ఎన్‌‌బీసీసీకి జేపీ అప్పులోళ్ల కండిషన్లు

ఎన్‌‌బీసీసీకి  జేపీ అప్పులోళ్ల  కండిషన్లు

న్యూఢిల్లీ : జేపీ ఇన్‌‌ఫ్రాను దక్కించుకునేందుకు ఎన్‌‌బీసీసీ వేసిన బిడ్‌‌ను ఆమోదించేందుకు ఆ సంస్థ లెండర్స్‌‌ ఐదు కండిషన్లు పెడుతున్నారు. ఆ షరతులకు ఓకే అంటేనే ఎన్‌‌బీసీసీ బిడ్‌‌ను ఆమోదిస్తామని జేపీ లెండర్స్ చెబుతున్నారు. ఎన్‌‌బీసీసీ  ఒప్పుకున్న  950 ఎకరాలకు బదులుగా ఇప్పుడు 1,426 ఎకరాల భూమిని అందించాలని జేపీ లెండర్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఇన్‌‌కమ్ ట్యాక్స్ సహా ఇతర అథారిటీల నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా వారిదేనని చెప్పారు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్‌‌సీలాట్) ఆదేశాల ప్రకారం.. జేపీ ఇన్‌‌ఫ్రాటెక్‌‌ను దక్కించుకునేందుకు ఎన్‌‌బీసీసీ దాఖలు చేసిన బిడ్‌‌పై లెండర్స్ చర్చించాల్సి ఉంటుంది.  ఈ ఐదు కండిషన్లకు అంగీకరిస్తే… బిడ్‌‌ను సానుకూలంగా పరిగణలోకి తీసుకుంటామని లెండర్స్ కన్సార్షియం లీడర్‌‌ ఐడీబీఐ, ఎన్‌‌బీసీసీకి లేఖ రాసింది. క్రెడిటార్ల కమిటీ గురువారం సమావేశమవుతోన్న నేపథ్యంలో ఈ లేఖను ఎన్‌‌బీసీసీకి చేరవేసింది. యమున ఎక్స్‌‌ప్రెస్‌‌ ఇండస్ట్రియల్ డెవలప్‌‌మెంట్ అథారిటీ(వైఈఐడీఏ) నుంచి కూడా అవసరమైన అనుమతులను ఎన్‌‌బీసీసీనే తీసుకురావాలని లెండర్స్ షరతులు పెడుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే.. అమ్ముడుపోని ఫ్లాట్లకు ఆర్థిక సాయాన్ని ఎన్‌‌బీసీసీకి తాము అందజేస్తామని లెండర్స్ చెప్పారు. భూములను ట్రాన్స్‌‌ఫర్ చేసే విషయంలో భవిష్యత్తులో ఏమైనా ఇన్‌‌కమ్ ట్యాక్స్ లయబిలిటీ లేదా జీఎస్టీ లయబిలిటీ లేదా కార్పొరేట్ ట్యాక్స్ లయబిలిటీ తలెత్తితే, దానికి కూడా ఎన్‌‌బీసీసీనే బాధ్యత తీసుకోవాలి.

బ్యాంక్‌‌లకు, గృహ కొనుగోలుదారులకు

ఓటింగ్ హక్కులు…

ఎన్‌‌బీసీసీ బిడ్‌‌ను పరిశీలించడానికి నేడు(గురువారం) క్రెడిటార్ల కమిటీ సమావేశమవుతోంది. ఈ కమిటీలో 13 బ్యాంక్‌‌లకు, 23 వేల మంది గృహ కొనుగోలుదారులకు ఓటింగ్ హక్కులున్నాయి. ఈ నెల ప్రారంభంలో క్రెడిటార్ల కమిటీ ముంబైకి చెందిన సురక్ష రియాల్టీ బిడ్‌‌ను ఓటింగ్‌‌ ప్రాసెస్‌‌లో తిరస్కరించారు. జేపీ ఇన్‌‌ఫ్రాటెక్‌‌ పూర్తి చేయని ప్రాజెక్ట్‌‌లలో 20 వేలకు పైగా యూనిట్లున్నాయి. ఈ 20 వేల యూనిట్ల గృహ కొనుగోలుదారుల ఫ్లాట్లు వారి చేతులోకి రాకుండా.. అలా స్ట్రక్ అయిపోయాయి. ఎన్‌‌బీసీసీ బిడ్‌‌పై ఓటింగ్ ప్రాసెస్‌‌ను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. తాజా ఆఫర్ కింద, ఎన్‌‌బీసీసీ రూ.200 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌‌ను, రూ.5 వేల కోట్ల విలువైన 950 ఎకరాల భూమిని, యమున ఎక్స్‌‌ప్రెస్‌‌వేను బ్యాంక్‌‌లకు బదిలీ చేస్తానని చెబుతోంది. బ్యాంక్‌‌లకు, గృహ కొనుగోలుదారులకు రూ.23,723 కోట్ల అవుట్‌‌స్టాండింగ్ క్లయిమ్‌‌ను సెటిల్ చేయడానికి 2‌‌‌‌023 జూలై నాటికి ఫ్లాట్స్‌‌ను పూర్తి చేస్తానని తెలిపింది. ఈ బిడ్‌‌లోనే పలు మినహాయింపులను ఎన్‌‌బీసీసీ కోరుతోంది. సంస్థ నుంచి మరింత క్లారిటీని కూడా పొందాలనుకుంటోంది. భవిష్యత్తులో ఇన్‌‌కమ్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి వచ్చే మినహాయింపుల విషయంలో అసలు బలహీనపడకూడదని ఎన్‌‌బీసీసీ నిర్ణయించింది. భూములను, యమున ఎక్స్‌‌ప్రెస్‌‌వే వంటి వ్యాపారాలను బదిలీ చేసే విషయంలో డెవలప్‌‌మెంట్ అథారిటీల నుంచి అనుమతి తీసుకోవాలనుకుంటోంది.

జేపీ ఇన్‌‌ఫ్రా కోసం అదానీ గ్రూప్  బిడ్

జేపీ ఇన్‌‌ఫ్రాటెక్‌‌ను దక్కించుకునేందుకు అదానీ గ్రూప్‌‌ కూడా నాన్‌‌ బైండింగ్‌‌ బిడ్‌‌ను దాఖలు చేసింది. హౌజింగ్ ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేయడం కోసం రూ.1,700 కోట్ల వరకు వెంటనే అందించేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఉద్యోగులకు,  ఫైనాన్సియల్ క్రెడిటార్లకు క్లయిమ్స్‌‌ను సెటిల్  చేసేందుకు రెండు దఫాల వారీగా మరో వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్టు కూడా అదానీ గ్రూప్ హామీ ఇస్తోంది. ఇన్‌‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌‌ ఖర్చులను కూడా ఇది మీట్ అవ్వనున్నట్టు పేర్కొంటోంది. రుణాల చెల్లింపు కోసం బ్యాంక్‌‌లకు వెయ్యి ఎకరాల భూమిని కూడా ట్రాన్స్‌‌ఫర్ చేయాలనుకుంటోంది. ఇన్‌‌సాల్వెన్సీ ప్రాసెస్‌‌ తొలి రౌండ్‌‌లో అదానీ గ్రూప్‌‌ పాలుపంచుకుంది. కానీ ప్రస్తుతం రౌండ్‌‌లో అదానీ గ్రూప్ బిడ్ దాఖలు చేయలేకపోయింది.