డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ లభించింది. ఆర్యన్ ఖాన్తో పాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఎన్సీబీ అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేకపోయారు.
వీడియోలు తీయలేదు..సాక్ష్యం సమర్పించలేదు..
ఎన్సీబీ అధికారులు సోదాలు, దాడులు జరిపినప్పుడు వీడియోలు తీయాలి. అయితే క్రూయిజ్ షిప్‌పై దాడి చేసినప్పుడు మాత్రం ఎన్‌సీబీ అధికారులు వీడియోలు తీయలేదు. వీడియోలపై కోర్టు అధికారులు ప్రశ్నించగా..తీయలేదనే సమాధానం చెప్పారు. దీనికి తోడు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగానీ.. అమ్మినట్లుగానీ...ఎన్సీబీ అధికారులు సాక్ష్యాలను సంపాదించలేకపోవడంతో..ఆర్యన్ ఖాన్ దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్బీబీ పేర్కొంది.
కేసులో కీలక మలుపు..
క్రూయిజ్ షిప్ కేసులో ఎన్సీబీ అధికారులు ప్రత్యక్షసాక్షిగా ప్రభాకర్ సాయీల్ అనే వ్యక్తిని చేర్చారు. అయితే అతను గుండెపోటుతో మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ తన ఇంట్లోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినట్లుగా అతడి లాయర్ తుషార్ ఖండారే తెలిపారు.
ఛార్జ్ షీట్లో ఆర్యన్ ఖాన్ పేరు లేదు..
గతేడాది అక్టోబర్ 2న ఫ్రెండ్స్తో సరదాగా గడిపేందుకు ఆర్యన్ ఖాన్ గోవా వెళ్లే కార్డిల్లా క్రూయిజ్ ఎంప్రెస్ షిప్ ఎక్కాడు. అయితే ఈ షిప్లో డ్రగ్స్ ఉన్నాయని ముందస్తు సమాచారంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు జరిపారు. 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చారస్, 22 ఎంఎండీఏ పిల్స్ దొరికాయని ఎన్‌సీబీ అధికారులు ప్రకటించారు. అయితే షిప్లో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ సహా 14 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు బిగ్‌షాట్స్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎన్సీబీ అధికారులు 6వేల పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఇందులో ఆర్యన్ ఖాన్ పేరును మాత్రం చేర్చలేదు. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని పేర్కొన్నారు.
బెయిల్ కోసం తిప్పలు.
ఎన్సీబీ అధికారుల అదుపులో ఉన్న ఆర్యన్ ఖాన్ బెయిల్ పొందేందుకు నానా తంటాలు పడ్డాడు. షారుక్ ఖాన్ తన కుమారుడిని బెయిల్ ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు కోర్టు చుట్టూ తిరిగినా చాలా రోజుల పాటు ఫలితం లేకపోయింది. ఆర్యన్ ఖాన్ తరపున ముకుల్ రోహత్గి కోర్టులో వాదించాడు. ఆర్యన్కు వ్యతిరేకంగా అధికారుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టుకు విన్నవించగా... అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్ బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల తర్వాత అతను ఆర్థర్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. ముంబై నుంచి బయటకు వెళ్లాలి అనుకుంటే విచారణ అధికారికి ముందుగా సమాచారం ఇవ్వాలని నిబంధన విధించింది.
ఆర్యన్ ఖాన్పై ఎన్సీబీ అభియోగాలు..
మూడు వారాలకు పైగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని..డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలపై తండ్రి షారుక్ ఖాన్, అతని తరపున లాయర్లు ఖండించారు. ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గర డ్రగ్స్ లభించలేదని కోర్టులో వాదించారు.
ఎన్సీబీ తన అభియోగాలపై కోర్టుకు సరైన అధారాలు సమర్పించలేకపోయింది. ఎన్సీబీ అభియోగాలపై అధికారులను ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. ఆర్యన్పై తీవ్రమైన ఆరోపణలు చేయడానికి వాట్సాప్ సందేశాలను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది. అటు ఆర్యన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని నిందితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేసును విచారించి అధికారి సమీర్ వాంఖడే ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సమీర్ వాంఖడే కేసు నుంచి తప్పించారు. ఈ కేసు ముంబైకి చెందిన ఎన్సీబీ బృందం నుండి ఢిల్లీకి చెందిన ఎన్సీబీ బృందానికి బదిలీ చేశారు. విచారణలో అక్రమాలు, లోపాలు కూడా వెలుగు చూశాయి. ఆర్యన్ ఖాన్ సహా ఇతరులపై చార్జీషీట్ దాఖలు చేయడానికి గడువును పొడిగించాలని ఢిల్లీ ఎన్సీబీ కోర్టును కోరింది. దీంతో మార్చిలో రెండు మాసాల గడువును ఇచ్చింది కోర్టు. అయినా ఆధారాలు సంపాదించడంలో ఎన్సీబీ అధికారులు విఫలమయ్యారు.