ముంబై: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండేకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సీజ్ చేసిందని సమాచారం. డ్రగ్స్ కేసులో గురువారం ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌సీబీ అధికారులు.. మధ్యాహ్నం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేశారు. అనన్య ఇంట్లో నుంచి ఆమె వినియోగించే ఫోన్లు, ల్యాప్‌టాప్‌తోపాటు పలు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనన్యను ఎన్‌సీబీ విచారిస్తోంది.
వాట్సాప్ చాట్స్‌లో అనన్య పేరు?
అనన్య ఇంటిపై రెయిడ్స్ చేసిన సమయంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌కు ఎన్‌సీబీ వెళ్లడం గమనార్హం. డాక్యుమెంటేషన్ పనిని పూర్తి చేయడానికే అధికారులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా.. అనన్య పాండే, షారుఖ్ కూతురు సుహానా ఖాన్‌ను బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్, అనన్య పాండేకు కూడా మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఆర్యన్ వాట్సాప్ చాట్‌లను ముంబై స్పెషల్ కోర్టుకు సమర్పించిన ఎన్‌సీబీ.. ఆ చాట్స్‌లో ఓ బాలీవుడ్ యువ హీరోయిన్ కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అయితే ఆ నటి పేరును వెల్లడించలేదు. తాజాగా అనన్య ఇంటిపై ఎన్‌సీబీ దాడులు, ఆమెకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆ చాట్స్‌లో ఉన్న హీరోయిన్ ఆమెనేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి.