ఆంధ్ర ప్రదేశ్ ఆర్డర్ బుక్ పొజిషన్‌లో అనిశ్చితితో ఎన్‌సీసీ లిమిటెడ్ షేర్ గత నెల రోజుల్లో బాగా తగ్గింది. సుమారు 25 శాతం తగ్గిన షేర్ ప్రస్తుతం రూ. 60 కి చేరింది. వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టులను రద్దు చేయడం వల్లే ప్రధానంగా ఎన్‌సీసీ షేర్ పతనమైంది. పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తుండటంతో కంపెనీ భవిష్యత్ మళ్లీ ఆశాజనకంగా మారిందని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని కాంట్రాక్టుల పనుల రాబోయే మూడు నెలల్లో ప్రారంభమవుతాయని అక్కడి ఉన్నతాధికారులు తమకు చెప్పారని హెచ్‌డీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. మరిన్ని ప్రాజెక్టులు రద్దయ్యే అవకాశాలు కనబడటం లేదని పేర్కొంది. కంపెనీ అప్పులు కూడా ఇప్పుడున్న స్థితిలోనే కొనసాగుతాయని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావల్సిన చెల్లింపులలో కొంత ఆలస్యం ఉండొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. సెంబ్‌కార్ప్‌తో వివాదంలో ఆర్బిట్రేషన్ కొనసాగుతోందని, అది పరిష్కారమైతే ఎన్‌సీసీకి రూ. 400–500 కోట్ల నగదు చేతికి వస్తుందని ఈ బ్రోకరేజ్ హౌస్ చెబుతోంది. ఫలితంగా కంపెనీ షేరు రూ. 154 కి చేరొచ్చని టార్గెట్‌గా తెలిపింది. అంటే 140 శాతం పెరుగుదలని అంచనా వేస్తోంది.
షేరు ధర పెరిగే చాన్స్
హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్ షేర్ ధర భవిష్యత్‌లో 60 నుంచి 140 శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ షేర్ పెరగాలంటే కొన్ని షరతులున్నాయని చెబుతున్నారు. స్మాల్‌కాప్ కేటగిరీలోని ఎన్‌సీసీ లిమిటెడ్ షేరు గత నెలరోజుల్లోనే 25 శాతం మార్కెట్ కాపిటలైజేషన్ పోగొట్టుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా వచ్చిన వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 6,100 కోట్ల విలువైన కాంట్రాక్టులను రద్దు చేయడంతోనే కంపెనీ షేర్ తగ్గిపోయింది. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. మార్చి 2019 తో ముగిసిన క్వార్టర్లో రూ. 41,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ బుక్ జూన్ క్వార్టర్ నాటికి రూ. 33,495 కోట్లకు పడిపోయింది.
కాంట్రాక్టులకు ఢోకా లేదు
ఎన్‌సీసీ లిమిటెడ్ చేతిలో ఇంకా రూ. 12,500 కోట్ల విలువైన ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్టులున్నాయి. ఇందులో రూ. 4,980 కోట్ల కాంట్రాక్టు పీఎంఏవై స్కీముది కాగా, మరో రూ. 6,500 కోట్ల కాంట్రాక్టు అమరావతి క్యాపిటల్ రీజియన్‌ది. ఆంధ్ర ప్రదేశ్ వాటర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రూ. 1,025 కోట్ల కాంట్రాక్టు కూడా కంపెనీ చేతిలో ఉంది. మిగిలిన ఈ కాంట్రాక్టులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడరీల ఎక్స్‌పోజర్ తగ్గుతుందని, వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్బిట్రేషన్‌లోని కొన్ని కేసులు ఎన్‌సీసీకి అనుకూలంగా పరిష్కారమవుతాయని, ఫలితంగా రూ. 400 నుంచి 700 కోట్ల డబ్బు కంపెనీ చేతికందుతుందని భావిస్తున్నారు. రిస్క్‌తో పోలిస్తే రివార్డుకే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ. 11,000 కోట్లను దాటుతుందని ఎన్‌సీసీ తెలిపింది. ఈబీఐటీడీఏ మార్జిన్ కూడా
11.2 –12 శాతం మధ్యలో ఉండొచ్చని పేర్కొంది. రద్దయిన ప్రాజెక్టులకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలు కూడా రిలీజవుతాయని కంపెనీ భావిస్తోంది. అమలులో ఉన్న ప్రాజెక్టుల బ్యాంకు గ్యారంటీలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టులు పునః సమీక్షించాలనే నిర్ణయంతో వివిధ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఐతే, ఈ ప్రాజెక్టులు రాబోయే రెండు, మూడు నెలల్లో మొదలవుతాయని ఎన్‌సీసీ భావిస్తోందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలానికి గతంలో ఇచ్చిన టార్గెట్‌ను సవరిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వ్యవహారాలలో ఏమాత్రం సానుకూలత కనిపించినా షేర్ ధర మళ్లీ పుంజుకుంటుందని, తమ టార్గెట్ ధర రూ. 125 గా రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది.
అందరూ ‘బై’ రేటింగే..
జూన్ క్వార్టర్లో ఎన్‌సీసీ లిమిటెడ్ నికరలాభం 21.6 శాతం తగ్గి రూ. 81.3 కోట్లకు పరిమితమైంది. ప్రభుత్వ ప్రాజెక్టులలో చెల్లింపుల ఆలస్యం వల్ల వడ్డీ భారం పెరిగింది. జూన్ క్వార్టర్‌కు ఆదాయం కూడా 7.3 శాతం తగ్గి రూ. 2,182 కోట్లకు చేరింది. జూన్ 2019 క్వార్టర్లో కంపెనీకి కొత్తగా రూ. 635 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రాజెక్టులు పెరిగితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల సమస్య కంపెనీకి పెద్దగా ఉండదని భావిస్తున్నట్లు ఎడిల్‌వీస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఐతే, టార్గెట్ ధరను రూ. 111 గా నిర్ణయించిన ఎడిల్‌వీస్ సెక్యూరిటీస్ ‘బై’ రేటింగ్‌ను కొనసాగించింది. ఎన్‌సీసీ లిమిటెడ్ అప్పులు తగ్గుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అప్పులు రూ. 2,200 కోట్లకు చేరొచ్చని భావిస్తున్నట్లు ఐసీఐసీఐడైరెక్ట్.కామ్ తెలిపింది. కంపెనీ వర్కింగ్ కాపిటల్ సైకిల్‌ను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. సోమవారం ఎన్‌సీసీ లిమిటెడ్ షేర్ 2.41 శాతం తగ్గి రూ. 60 వద్ద ట్రేడవుతోంది.
ఇండియన్ మోటార్ సైకిల్ నుంచి ఎఫ్‌టీఆర్ 1220 ఎస్
అమెరికన్ కంపెనీ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ మార్కెట్లోకి సోమవారం ‘ఎఫ్‌టీఆర్ 1220 ఎస్’ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్-షోరూం ధర రూ.15.99 లక్షలని తెలిపింది. మరో మోడల్ ఎఫ్‌టీఆర్ 1220 ఎస్ రేస్ రెప్లికా ధర రూ.17.99 లక్షలని పేర్కొంది. లీజు ద్వారా ఈ బైక్స్‌ను ఉపయోగించుకునేందుకు ఈ సందర్భంగా ఓరిక్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 4.3 ఇంచుల ఎల్సీడీ టచ్‌స్క్రీన్, సెన్సిటివ్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, 3 రైడ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.