
న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్- మీడియం పాఠ్యపుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమయింది. ఒకటి నుంచి 6వ తరగతి టెక్స్ట్ బుక్స్‌కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు. వాటిని హిందీ పేర్లతో ప్రింట్ చేశారు. 6వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ను గతంలో హనీసకిల్ అని పిలిచేవారు. అదే పుస్తకానికి ఇప్పుడు 'పూర్వి' అనే హిందీ పేరు పెట్టారు.
ఇది ఒక శాస్త్రీయ సంగీత రాగం పేరు, దీనికి 'తూర్పు'అని మరొక అర్థం కూడా ఉంది. అలాగే.. ఒకటి, రెండో తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్‌కు సంగీత వాయిద్యాల పేర్లయిన ‘మృదంగ్’.. మూడో తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకానికి ‘సంతూర్’ అని పేరు పెట్టారు. అయితే, సైన్స్, సోషల్ బుక్స్ ఇంగ్లీష్ పేర్లు మార్చలేదు. కానీ.. హిందీ, ఉర్దూ వెర్షన్‌లకు పేర్లు మార్చారు.
ఆరో తరగతి కొత్త సైన్స్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో క్యూరియాసిటీగానూ.. హిందీ, ఉర్దూ వెర్షన్‌లకు ‘జిగ్యాస’, ‘తజస్సుస్’గా పేర్లు పెట్టారు. అదేవిధంగా.. సోషల్ పుస్తకానికి ఇంగ్లీష్ లో ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ గానూ..హిందీలో సమాజ్ కా అధ్యాయన్: భారత్ ఔర్ ఉస్కే ఆగే అని పేరు పెట్టారు. గతంలో 6వ తరగతి మ్యాథ్స్ పుస్తకాన్ని ఇంగ్లీషులో గణితం, హిందీలో గణిత్, ఉర్దూలో రియాజి అని పిలిచేవారు. కానీ ఇప్పుడు.. ఇంగ్లీష్, హిందీ వెర్షన్లలోనూ 'గణిత ప్రకాశ్'గా పేరు పెట్టారు.
విమర్శలివే..
ఎన్‌సీఈఆర్‌టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్- మీడియం పాఠ్యపుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అన్ని రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడానికే టెక్స్ట్ బుక్స్‌కు హిందీ పేర్లు పెడుతున్నారని ఆరోపించారు. ఇది ‘హిందీ వలసవాదం’ అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అభివర్ణించారు. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడం ఏంటని జేఎన్‌యూ రిటైర్డ్ ప్రొఫెసర్ అన్విత అబ్బీ ప్రశ్నించారు. ఇది స్టూడెంట్లను తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలిపారు.
రోమన్ లిపిని ఉపయోగించి పుస్తకాలపై హిందీ పేర్లను రాయడం వల్ల వాటిని పిల్లలు తప్పుగా ఉచ్చరించే ప్రమాదం ఉందని ఓ రిటైర్డ్ భాషావేత్త వెల్లడించారు. ఉదాహరణకు.. గణిత అనే పదంలో 'ణ' శబ్దం రోమన్ లిపిలో సరైన విధంగా ఉచ్చరించబడదని వివరించారు. తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలు పాఠశాలల్లో కేంద్రం తెచ్చిన త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్‌సీఈఆర్‌టీ తెచ్చిన మార్పులు హిందీ మాట్లాడని ప్రాంతాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమని మరికొందరు అభిప్రాయపడ్డారు.