కరోనా తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల అభ్యసన దిగజారుతున్నట్లు జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఎన్సీఈఆర్టీ తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా గణితంలో 49 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కనపరచలేకపోతున్నారు. మాతృభాషలతో పాటు, గణిత సామర్థ్యాలపై తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరిగింది. మాతృభాషలో 19 శాతం మంది కనీసం చదవలేని స్థితి ఉంది. రెండు అంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో మూడో తరగతి విద్యార్థులు 43% మంది ఉన్నారని సర్వే తెలుపుతుంది.
2021–---22 సంవత్సరానికి పాఠశాల పనితీరు గ్రేడింగ్‌లో కూడా తెలంగాణలోని పాఠశాలలు వెయ్యి పాయింట్లకు కేవలం 479.9.1 పాయింట్లతో దేశంలో 31 వ స్థానంలో నిలిచింది. అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, సమానత్వం, పాలనా ప్రక్రియ, విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయులకు విద్యా శిక్షణ అనే ఆరు మౌలిక అంశాల ప్రాతిపదికన కేటాయించిన పాయింట్లు చేసిన సర్వే తెలంగాణ స్థానాన్ని తెలుపుతోంది. ఇందులో 240 పాయింట్లకు కేవలం 36.6 పాయింట్లతో దేశంలో 35వ స్థానంలో తెలంగాణ ఉంది.
నేషనల్ అచీవ్మెంట్ సర్వే
దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) ప్రకారం మన రాష్ట్రంలో 5వ తరగతి విద్యార్థులు తెలుగులో 43 శాతం, లెక్కలలో 35 శాతం, పరిసరాల విజ్ఞానంలో 38 శాతం, ఎనిమిదవ తరగతి విద్యార్థులు తెలుగులో 48 శాతం, లెక్కలలో 32 శాతం, సామాన్యశాస్త్రంలో 35 శాతం మరియు సాంఘిక శాస్త్రంలో 34 శాతం మరియు పదవ తరగతి విద్యార్థులు తెలుగులో 36 శాతం, లెక్కలలో 29 శాతం, సామాన్య శాస్త్రంలో 34 శాతం, సాంఘిక శాస్త్రంలో 36 శాతం, ఇంగ్లిషులో 48 శాతం మాత్రమే తరగతివారీ విద్యా సామర్థ్యం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ నివేదికలో ప్రైవేటు పాఠశాలల విద్యా సామర్థ్యం కూడా కొంచెం అటు ఇటు తప్ప పెద్దగా ఏమీ తేడా కనిపించడం లేదు.
ఇక సామాజిక వర్గాల వారిగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులు 28 నుంచి 48 శాతం , ఎస్టీ విద్యార్థులు 27 నుంచి 46 శాతం , బీసీ విద్యార్థులు 29 నుంచి 48 శాతం మాత్రమే విద్యా సామర్థ్యం కలిగి ఉన్నారు. తెలంగాణలో సగానికి ఎక్కువ విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా తరగతి వారీ సామర్థ్యం సమర్ధంగా అందడం లేదని సర్వేలు చెప్తున్నాయి. కనీసం ప్రభుత్వవిద్యార్థులకు నిర్వహించే నామమాత్రపు కార్యక్రమాలు విద్యార్థులకు అసలే లేవు. ఈ విషయంలో పర్యవేక్షణ కానీ , సమాచారం కానీ విద్యాశాఖ వద్ద లేవు.
మారని ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్న గురుకులాలలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ 1002 రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే 5 లక్షల 59 వేలమంది విద్యార్థులకే పరిమితమైంది. ఈ పాఠశాలలో ఐదు నుంచి పది తరగతుల వరకే బోధన ఉంటుంది. ఒకటి నుంచి నాలుగు తరగతులు ఉండే 18, 235 ప్రాథమిక పాఠశాలలు అరకొర వసతులతో ఉండి, 9,21,076 విద్యార్థుల చదువు నిర్లక్ష్యం చేయబడుతోంది.
ఈ పాఠశాలలో 6,678 ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు. వీటిలో ఒకరే ఉపాధ్యాయుడు ఐదు తరగతుల పిల్లలకు బహుళ తరగతి పద్ధతిలో బోధన చేస్తున్నారు. బోధనతోపాటు, పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనము, మండల, జిల్లా అధికారులకు కావలసిన రిపోర్టులు పంపాలి. ఆయా సందర్భాల్లో మండల కేంద్రాల్లో, పాఠశాల కాంప్లెక్సులలో జరిగే సమావేశాలు, శిక్షణలకు హాజరు కావాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ కత్తి మీద సాముగా ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం చేరింది. ఇవన్నీ చూసుకుంటూ, సమన్వయం చేస్తూ బోధన చేయాలి. మధ్యాహ్న
భోజన కార్మికులకు అనేక రకాల బిల్లులను చేసి మండల కేంద్రానికి పంపిస్తే వారికి బిల్లులు వస్తాయి.
బోధనా సిబ్బంది కొరత
ప్రాథమిక విద్యలో 10,657 ఖాళీలు ఉండగా, ప్రాథమికోన్నత విద్యలో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 2,400 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులు, 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినా.. ఇంకా అమలులోనికి రాలేదు.
సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలతో అభ్యసన సంక్షోభం గట్టెక్కేదెలా? అప్పర్ ప్రైమరీ పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులతో పాటు పాఠశాల పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయుడు అదనంగా ఉండాలి. అదేవిధంగా తరగతికొక గది, ఆట స్థలము, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు ఉండాలి. ఉపాధ్యాయుల బోధనను పర్యవేక్షించటానికి డిప్యూటీ విద్యాధికారి ఉండాలి.
రాష్ట్రంలోని 66 డిప్యూటీ విద్యాధికారులకుగాను 60 ఖాళీలు ఉండడంతో ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ లేక విద్యాపాలన, విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధనను మూల్యాంకనం చేసే వ్యవస్థ గత మూడు దశాబ్దాలుగా మూలన పడింది. ఇక విద్యా ప్రమాణాలు ఎట్లా పెరిగేది?
యునెస్కో రిపోర్టు
విద్యా రంగంలో రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. పైగా అభ్యసన సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో మొత్తం విద్యారంగానికి కాయకల్ప చికిత్స జరగాల్సిన అవసరం ఉంది . ఇదే సమయంలో యునెస్కో -‘విద్యారంగంలో సాంకేతికత-2023’ నివేదిక చేసిన ఉపాధ్యాయులకు.. ‘డిజిటల్’ ప్రత్యామ్నాయం కాదు’ అనే సిఫార్సులు కూడా పరిశీలించాలి.
స్మార్ట్‌ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలని, వీటి వల్ల చదువులే కాకుండా సంస్కారం, విద్యార్థుల వ్యక్తిత్వం కూడా దెబ్బతింటోందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.కొవిడ్ సమయంలో ఇండ్లల్లోకి, బడుల్లోకి విచ్చలవిడిగా అడుగుపెట్టిన స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్ల వల్ల లాభం కంటే విద్యార్థులకు నష్టమే ఎక్కువ జరుగుతోందని యునెస్కో అధ్యయనం తేల్చింది. ‘‘మంచి టీచర్లను నియమించకుండా.. కేవలం కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలనిస్తే ఫలితం ఉండదు.
ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవటంతో విద్యార్థుల్లో చదువు మాని పక్కచూపులు ఎక్కువయ్యాయి’’ అని స్పష్టం చేసింది. విద్యార్థి కేంద్రంగా.. ఉపాధ్యాయులు ప్రధానంగా.. బోధన జరగాలని అందులో సిఫార్సు చేసింది. విద్యార్థుల మెరుగుదలకు మాత్రమే సాంకేతికత ఉపయోగపడాలి. ఆన్‌లైన్ విద్య అనేది బోధనలో, అభ్యసనలో అదనపు వనరుగా ఉండాలి. అంతేతప్ప ఉపాధ్యాయులకు అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. పిల్లలకు సాంకేతికతతోనే కాకుండా.. అది లేకుండా జీవించటం కూడా నేర్పాలి.
ALS0 READ: రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలె : సాధం వెంకట్
అభ్యసన సంక్షోభాన్ని అధిగమించాలి
వివిధ యాజమాన్యాలలో ఉన్న పాఠశాలలు, గురుకులాలన్నింటిని విద్యాశాఖ పరిధిలోనికి తెచ్చి విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ సక్రమంగా అమలయ్యేలా చూడాలి. వివిధ గురుకులాలకు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు ప్రత్యేకంగా పర్యవేక్షణ అధికారుల పోస్టులను మంజూరు చేసి, విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన, అభ్యసన కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ఈ బడులన్నింటికి వాటికి ఇచ్చే స్వయం ప్రతిపత్తిని ఇస్తూనే పర్యవేక్షణ, నాయకత్వం, సమాన విద్యను పిల్లలందరికీ అందించడానికి విద్యాశాఖ గొడుగు కిందికి తేవాలి. విద్యాశాఖలో వివాదాలన్నింటిని పరిష్కరించి, పర్యవేక్షణ అధికారుల పోస్టులైన మండల విద్యాధికారి( ఎంఈఓ), డిప్యూటీ విద్యాధికారి( డివైఇఓ), జిల్లా విద్యాధికారి( డిఇఓ), బీఈడీ కళాశాల, డైట్ కళాశాల లెక్చరర్ పోస్టులను భర్తీ చేసి, పర్యవేక్షణ పటిష్టం చేయాలి.
అప్పుడే విద్యార్థులకు సక్రమమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది. అంతేకానీ తాత్కాలిక ఉపశమనాలతో కూడిన చర్యలతో ప్రమాణాలు మెరుగుపడవు. విద్యా ప్రమాణాల పెంపునకు సమగ్రమైన ఆలోచనతో, ముందుచూపుతో చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పటి అభ్యసన సంక్షోభాన్ని అధిగమించి, మెరుగైన విద్యాప్రమాణాలు సాధించవచ్చు. అప్పుడే మన విద్యార్థులు మెరికలలాగా తయారై, సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవడం జరుగుతుంది.
- కె. వేణుగోపాల్, పూర్వ అధ్యక్షుడు, ఎపిటిఎఫ్