Bagless Days: గుడ్ న్యూస్.. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు బడికి బ్యాగ్ తీసుకెళ్లక్కర్లేదు..!

Bagless Days: గుడ్ న్యూస్.. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు బడికి బ్యాగ్ తీసుకెళ్లక్కర్లేదు..!

ఢిల్లీ: స్కూల్ పిల్లలకు బండెడు పుస్తకాలు భారంగా మారుతున్న ఈరోజుల్లో కేంద్ర విద్యా శాఖ శుభవార్త చెప్పింది. 6వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు బ్యాగ్లెస్ డేస్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు బ్యాగుల బరువును కొన్ని రోజులైనా తగ్గించాలనే ఆలోచనతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మార్గదర్శకాలను జారీ చేసింది. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యా సంవత్సరంలో పది రోజులు స్కూల్కు బ్యాగ్ తీసుకెళ్లాల్సిన పని లేదు. అలా అని ఆరోజంతా పిల్లలను ఖాళీగా కూర్చోబెట్టరు. కూరగాయల మార్కెట్లకు తీసుకెళ్లడం, స్వచ్ఛంద సంస్థలకు తీసుకెళ్లడం, బుక్ ఫెయిర్స్కు తీసుకెళ్లడం, బయోగ్యాస్ ప్లాంట్స్ విజిట్, సోలార్ ఎనర్జీ పార్క్కు తీసుకెళ్లడం.. ఇవీ NCERT పాఠశాలలకు, టీచర్లకు చేసిన మార్గదర్శకాలు. 

ఎలాగూ బ్యాగ్ తీసుకెళ్లే పని లేదు కదా అని విద్యార్థులు క్లాసులకు డుమ్మా కొడితే కఠినంగా వ్యవహరించాలని కూడా టీచర్లకు మార్గదర్శకాలున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి అందుకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఈ బ్యాగ్లెస్ డేస్ కాన్సెప్ట్ను తీసుకొచ్చినట్టు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ బ్యాగ్లెస్ డేస్ను  విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా అమలు చేసే వెసులుబాటును పాఠశాలలకు ప్రభుత్వం కల్పించింది. అయితే.. రెండు నుంచి మూడు స్లాట్స్లో పూర్తి చేయాలని NCERT మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.