పవర్ చూపించిన పవార్

శరద్ ​పవార్​కు 79 ఏళ్లు. ఆయన పార్టీ ఎన్సీపీలోంచి ఎంతో మంది ఫిరాయించారు. అవినీతి కేసు వెన్నాడింది. అయినా సరే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మరాఠా వీరుడు తన సత్తా చూపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మళ్లీ తన సత్తా చాటారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని  మొత్తం 48 సీట్లలో ఎన్సీపీకి కేవలం నాలుగు సీట్లే దక్కాయి. లోక్ సభ ఎన్నికలు ముగియగానే చాలా మంది పార్టీ నాయకులు పార్టీకి గుడ్ బై కొట్టారు. కొంతమంది బీజేపీలోకి, మరికొంతమంది శివసేనలోకి చేరిపోయారు. సహజంగా వెస్ట్ మహారాష్ట్ర, ఎన్సీపీకి  కంచుకోట వంటిది. అలాంటి ప్రాంతం నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. సీనియర్ లీడర్ ఉదయన్ రాజే బోసలే కూడా పార్టీకి గుడ్ బై కొట్టారు. దీంతో  మహారాష్ట్ర పాలిటిక్స్ లో  ఎన్సీపీ హవా ముగిసిందని చాలా మంది అనుకున్నారు. అయినా డీలా పడలేదు. కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారు. ఫలితాల్లో  కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా ఎన్సీపీకి దక్కే అవకాశాలున్నాయి.

సతారా ప్రచారంలో ఎమోషనల్​

అసెంబ్లీ ఎన్నికలతో పాటు సతారా లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో జోరున కురుస్తున్న వర్షంలో నిలబడి ఎమోషనల్ గా పవార్ మాట్లాడిన తీరు ఓటర్లను ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ అయింది.

ఈడీ కేసుతో ప్రజల్లో సానుభూతి

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు శరద్ పవార్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) మనీలాండరింగ్ కేసు పెట్టింది. విచారణకు రావలసిందిగా అధికారులు కోరకపోయినా తనంతట తానే ఈడీ ఆఫీసుకు వచ్చి కేసుకు సంబంధించి పవార్ వివరణ ఇచ్చారు. “ఛత్రపతి శివాజీ పుట్టిన నేలపై పుట్టిన మేం ఢిల్లీ అధికారానికి తలవంచే ప్రసక్తే లేదు ”అంటూ ఆవేశంగా ఆయన చేసిన కామెంట్స్ ఎన్సీపీ కేడర్ లో జోష్ నింపాయి. ఇన్నాళ్లూ  సైలెంట్ గా ఉండి సడన్ గా ఎన్నికలకు ముందు తనపై ఈడీ కేసు పెట్టడం వెనక ఉన్న మతలబును ప్రజలు అర్థం చేసుకోగలరని కామెంట్ చేసి అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు పవార్. ఈడీ కేసు నేపథ్యంలో ఆయనపై  ప్రజల్లో సానుభూతి పెరిగిందని ఎనలిస్టులు అంటున్నారు.