శరద్ పవార్ భారీ స్కెచ్.. అజిత్ పవార్‎ను ఓడించేందుకు రంగంలోకి యంగ్ లీడర్

శరద్ పవార్ భారీ స్కెచ్.. అజిత్ పవార్‎ను ఓడించేందుకు రంగంలోకి  యంగ్ లీడర్

ముంబై: డిప్యూటీ సీఎం, తన మేనల్లుడు అజిత్ పవార్‎ను ఓడించేందుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ భారీ స్కెచ్ వేశారు. ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‎ను ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు ఫ్యామిలీ మెంబర్‎ను బరిలోకి దించాడు. అజిత్ పవార్ పోటీ చేయనున్న బారామతి అసెంబ్లీ స్థానం నుండి యువ నాయకుడు యుగేంద్ర పవార్‎ను పోటీకి దించారు. ఈ మేరకు ఎన్సీపీ (శరద్ వర్గం) ఇవాళ అధికారిక ప్రకటన చేసింది. కాగా, యుగేంద్ర పవార్‎ శరద్ పవార్‎కు మనువడు. అజిత్ పవార్‎కు మేనల్లుడు. అయితే, తనను వెన్నుపోటు పొడిచి ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్‎పై ప్రతీకారం తీర్చుకోవాలని.. అందుకే అతడిపై సొంత కుటుంబ సభ్యుడినే శరద్ పవార్ బరిలోకి దింపినట్లు మహా పాలిటిక్స్‎లో టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం గురువారం (అక్టోబర్ 24) 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్‎లో ఎన్సీపీ కీలక నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. సీనియర్ నేతులు అనిల్ దేశ్‌ముఖ్‌ కటోల్‌ అసెంబ్లీ స్థానం నుండి, జయంత్ పాటిల్ ఇస్లాంపూర్, ముక్తైనగర్‌ నుంచి రోహిణి ఖడ్సే, జితేంద్ర అవద్- కాల్వా ముంబ్రా నుండి బరిలోకి దిగనున్నారు. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోంది. 

ALSO READ | మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: మాజీ సీఎం శరద్ పవార్‎కు బిగ్ షాక్

కాగా, మాజీ సీఎం శరద్ పవార్ మేనల్లుడు అజిత్ ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చిన విషయం తెలిసిందే. తన వర్గం ఎమ్మెల్యేలతో అధికార మహాయతి కూటమితో అజిత్ పవార్ చేతులు కలపడంతో.. అతడిని డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఈ క్రమంలోనే పార్టీని విచ్ఛిన్నం చేసిన అజిత్‎ను ఓడించేందుకు శరద్ పవార్ వర్గం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పవార్ ఫ్యామిలీ మెంబర్స్ పోటీతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బారామతి ఎన్నిక హాట్ టాపిక్‎గా మారనుంది. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 23వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.