విభేదాలను పరిష్కరించుకుంటం: శరద్​ పవార్

పుణె :  ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలున్నాయని, సీట్ల పంపకాల విషయంలో పార్టీల మధ్య తగాదాలు వచ్చాయని ఎన్సీపీ శరత్ చంద్ర పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయన బుధవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్​లో మీడియాతో మాట్లాడారు. కొన్ని సమస్యల కారణంగా బెంగాల్​లో కూటమి పార్టీల మధ్య తేడాలు వచ్చినట్లు గుర్తించామన్నారు. 

సాధ్యమైనంత తొందరలో ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలు సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. కూటమి పార్టీల గత సమావేశం సందర్భంగా.. అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించామని పవార్ గుర్తుచేశారు. కానీ, మెజార్టీ పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితమయ్యాయన్నారు. దీంతో ఆ పార్టీలన్నీ తమ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో కలిసి నడవాలని నిర్ణయించామని, అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని శరద్ పవార్ చెప్పారు.