తెలంగాణలో ఆగని బాల్య వివాహాలు

తెలంగాణలో ఆగని బాల్య వివాహాలు
  • నిరుడు దేశవ్యాప్తంగా 1,002 బాల్య వివాహాలు
  • ఎన్​సీపీసీఆర్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 2023లో మన రాష్ట్రంలో 57 బాల్య వివాహాలు జరిగినట్లు జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్​సీపీసీఆర్) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నది. ఈ జాబితాలో 215 బాల్య వివాహాలతో కర్నాటక మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

 163 పెండ్లిళ్లతో అస్సాం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు (155), వెస్ట్ బెంగాల్ (121), మహారాష్ట్రలో (99) నిలిచాయి. 2023లో దేశవ్యాప్తంగా 1,002 బాల్య వివాహాలు జరిగాయని పేర్కొన్నది. మన పక్కనున్న ఏపీలో 26 మంది చిన్న పిల్లలకు పెండ్లిళ్లు చేసినట్లు కమిషన్ రిపోర్టులో వెల్లడించింది. వాస్తవానికి అంతకుముందుతో పోలిస్తే కేసులు తగ్గినప్పటికీ.. దాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎన్​సీపీసీఆర్ నొక్కి చెప్పింది.

బాల్య వివాహాల అంచున 11 లక్షల మంది

దేశంలో 11.50 లక్షల మంది చిన్నారులు బాల్య వివాహాల అంచున ఉన్నారని ఎన్​సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా 18 ఏండ్లలోపున్న 15 లక్షల మంది ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేసి పంపించేస్తున్నారని రిపోర్ట్​లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే బాల్యవివాహాల కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. స్కూళ్ల నుంచి డ్రాపౌట్ అయిన పిల్లలు, స్కూల్​కు రెగ్యులర్​గా రాని స్టూడెంట్లను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. సమాచారం లేకుండా స్టూడెంట్లు స్కూల్ మానేస్తే ఆ పాఠశాల వివరాలను మ్యాప్ చేయాల్సిందిగా అధికారులకు సూచించింది.

అమ్మాయిలే బలైతున్నరు

బాల్య వివాహాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా బలైపోతున్నారని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నది. చిన్న వయసులోనే అమ్మాయిలకు పెండ్లిళ్లు అయిపోతుండటంతో వారికి విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం లభించడం లేవని వెల్లడించింది. వాళ్లు నలుగురిలో కలవలేకపోతున్నారని తెలిపింది. ఏమీ తెలియని వయసులో పెండ్లి చేయడంతో అమ్మాయిలు గృహ హింసకు బాధితులుగా మారుతున్నారని వివరించింది. ఎయిడ్స్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని తెలిపింది. 

నిధులు పెంచాల్సిందే..

బాల్యవివాహాల కట్టడికి చాలీచాలని నిధులను కేటాయిస్తున్నారని, ఫలితంగా సమాజం నుంచి ఆ దురాచారం పోవడం లేదని ఎన్​సీపీసీఆర్ అభిప్రాయపడింది. బాల్య వివాహాలను కట్టడి చేయాలంటే నిధులను కచ్చితంగా పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, బాల్యవివాహాలను ఆపేందుకు మూడేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశాలను నిర్వహిస్తున్నదని తెలిపింది. జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదని కమిషన్​ చైర్​పర్సన్ ప్రియాంక్ కనూంగు చెప్పారు. మొత్తంగా దేశంలోని 596 జిల్లాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నివేదికను తయారు చేసినట్టు పేర్కొన్నారు.