200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్

200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
  • ఎన్పీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

పుణె: మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లుండగా మహా వికాస్ అఘాడీలో (ఎంవీఏ)ని భాగస్వామ్య పక్షాల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం చూపించవని తెలిపారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాద్​లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. 

‘‘సీట్ల పంపకాలపై నేరుగా నేను చర్చలు జరపడం లేదు. ఎన్పీపీ (ఎస్పీ) రాష్ట్ర యూనిట్ చీఫ్ జయంత్ పాటిల్ మా పార్టీ తరఫున చర్చలు జరుపుతున్నారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చింది” అని తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని మహారాష్ట్రలో ఇండియా కూటమి ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనగా శరద్ పవార్ సమాధానమిచ్చారు.

 ‘‘హర్యానా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నాం. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ ఫలితాలు చూడండి. హర్యానా రిజల్ట్స్ మహారాష్ట్రపై ఎటువంటి ప్రభావం చూపించవు” అని చెప్పారు. కాగా, ఎంవీఏ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు ఉన్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.