దళితులపై దారుణాలు ఆగట్లే

దళితులకు రాజ్యాంగం ఎన్నో విధాల రక్షణలు కల్పించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఈ వర్గాలు రాజ్యాంగ భద్రతకు నోచుకోవడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో వీరిపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో సర్వే ప్రకారం 20 శాతం మేర కేసులు పెరిగాయి. ఎస్సీ మహిళలపై రేప్​ ఘటనలుకూడా పెరగడం సోషల్​ యాక్టివిస్టులు ఆందోళనగా ఉన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా, పెద్ద కులాలకు, దళితులకు మధ్య సామరస్యం ఏర్పడలేదు. ఇప్పటికీ దళితుల పట్ల కొన్ని కులాలు అమానుషంగానే ప్రవర్తిస్తున్నాయని నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) చెబుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. జాట్​, యాదవ్​, రాజపుత్​ వంటి కులాలకు దగ్గర దగ్గరగా ఎస్సీల సంఖ్య ఉంది. అయినాగానీ, ఆయా కులాలు పొలిటికల్​గా పైచేయి కావడంతో దళితులపై అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా హర్యానా, మధ్యప్రదేశ్​, యూపీల్లో ఏటా దళితులకు వ్యతిరేకంగా నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అసలు దేశంలో నమోదవుతున్న ఎస్సీ కేసుల్లో 56 శాతం కేవలం మధ్యప్రదేశ్​, యూపీ, బీహార్​ రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. మొత్తం దేశంలో జరుగుతున్న ఎస్సీ వ్యతిరేక దారుణాల్లో 52 శాతం యూపీలో, 15.6 శాతం బీహార్​లో జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్టు చెబుతోంది. 2017లో యూపీలో అత్యధిక కేసులు నమోదు కావడాన్ని బట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  ఈ కేటగిరీ క్రైమ్​ రికార్డులో యూపీ, బీహార్​ టాప్​ పొజిషన్​లో ఉన్నాయి.

షెడ్యూల్​ కులాలవారికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడులకు సంబంధించి, రెండేళ్లు ఆలస్యంగా ఎన్సీఆర్బీ–2017 రిపోర్టు విడుదలైంది. దేశంలో మొత్తంగా 5,775 కేసులు ఎస్సీ అణచివేత చట్టం కింద  నమోదయ్యాయి. 2016లో ఈ కేసుల సంఖ్య 5,082 మాత్రమే.  కాగా, తాజా నివేదికలో హర్యానా, ఎంపీ రాష్ట్రాల్లో 20 శాతం మేర అధికంగా నేరాలు నమోదయినట్లు తేలింది. 2015లో 510 కేసులు, 2016లో 639 కేసులు జరగ్గా, ఆ మరుసటి ఏడాది 762 కేసులకు పెరిగాయి.  ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే.. హర్యానాలో జాట్​ ఓటర్లు 29 శాతం ఉండగా, దళిత ఓటర్లు 22 శాతం వరకు ఉంటారు. వీరికి 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో 17 సీట్లు రిజర్వ్​ అయి ఉన్నాయి. పొలిటికల్​గాకూడా దళితులు హర్యానాలో బలంగానే ఉన్నప్పటికీ, సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబాటుతనం వల్ల తరచు అణచివేతకు గురవుతున్నట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.  2017లో దళిత వ్యతిరేక కేసుల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్​లో నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది ఎస్సీల్లో 52 మంది ఏదో ఒకరకమైన అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ రిపోర్ట్​ గుర్తించింది.

బీహార్​లో 2016తో పోలిస్తే, 2017లో ఎస్సీలపై 18.34 శాతం ఎక్కువగా దాడులు జరిగాయి. ఇక్కడ ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాకి 41 మంది వేధింపులకు గురవుతున్నారు. మొత్తం ఎస్సీ వ్యతిరేక కేసుల్లో 15.6 శాతం బీహార్​లోనే నమోదయ్యాయి. దక్షిణాదిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎస్సీ వ్యతిరేక కేసులు నానాటికీ పెరుగుతున్నట్లుగా ఎన్సీఆర్బీ రిపోర్డునిబట్టి తెలుస్తోంది. ఇక్కడ 2015–16 రెండేళ్లలోనూ కేవలం మూడేసి కేసులు మాత్రమే రికార్డు కాగా, 2017 నాటికి (966.6% పెరుగుదలతో) 32 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. ఇక్కడ 48 కేసులు నమోదయ్యాయి.

కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్​ ప్రదేశ్​, మణిపూర్​, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్​, సిక్కిం, త్రిపురల్లోనూ, జమ్మూ కాశ్మీర్​లోనూ 10 కంటే తక్కువగానే ఎస్సీలపై అత్యాచార కేసులు రికార్డయ్యాయి. కాగా, 2017లో ఎస్సీలపై జరిగిన రేప్​ ఘటనలకు సంబంధించి ఎన్సీఆర్బీ ఆందోళన చెందింది. 2,058 మంది ఎస్సీ మహిళలు, 656 మంది ఎస్సీ బాలలు రేప్​కి గురయినట్లు పేర్కొంది. ప్రభుత్వపరంగా జరుగుతున్న ప్రయత్నాలకు సామాజికంగా తోడ్పాటు లభించడం లేదని యాక్టివిస్టులు అంటున్నారు.

పిల్లల్నెత్తుకుపోవుడు ఎక్కువైంది

ఎన్సీఆర్బీ–2017 నివేదిక ప్రకారం… పిల్లల్ని కిడ్నాప్​ చేయడం 2016 కంటే బాగా ఎక్కువైంది. మొత్తంగా 95,893 కిడ్నాప్​ కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాదిలో 20,555 మంది మగపిల్లలు, 42,691 మంది ఆడపిల్లలు (మొత్తం 63,349 మంది) కిడ్నాప్​కు గురయ్యారు. వీరిలో చాలామందిని ట్రేస్​ చేశారు. అనేకమందిని కిడ్నాపర్ల బారినుంచి కాపాడారు. అల్లర్ల కేసులు 58,880 నమోదు కాగా,  ఒక్క బీహార్​లోనే 11,698 కేసులు రికార్డుకెక్కాయి. ఆ తర్వాత యూపీ 8,990, మహారాష్ట్ర 7,743 కేసులున్నాయి.

మహిళలే మెయిన్​ టార్గెట్​

నేరస్తుల మెయిన్​ టార్గెట్​ మహిళలేనని ఎన్సీఆర్బీ గుర్తించింది. మొత్తంగా దేశంలో మహిళలపట్ల దారుణంగా ప్రవర్తించిన కేసులు 3,59,849 నమోదయ్యాయి. వీటిలో 56,011 కేసులతో యూపీ టాప్​లో ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర 31,979, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్​ 30,002 కేసులతో ఉన్నాయి. మెజారిటీ కేసులు గృహ హింసకు సంబంధించినవి కాగా, ఆ తర్వాత కేసుల్లో ఆడవాళ్ల ఎదుగుదలను ఓర్వలేనితనంతో చేసినవి, మహిళల కిడ్నాప్​, రేప్​ వంటివి ఉన్నాయి.