![భారత్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీదే పవర్.. ఇండియా టుడే సర్వేలో షాకింగ్ ఫలితాలు..!](https://static.v6velugu.com/uploads/2025/02/nda-300-paar-if-lok-sabha-polls-were-held-today-congress-slips_lOMR2rwn6P.jpg)
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఇండియా టుడే- సీ-వోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు భారత్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తోందని సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమి 343 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితాల ద్వారా స్పష్టమైంది.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన సాధారణ మెజార్టీ (272 సీట్లు)ని బీజేపీ సునాయసంగా సాధిస్తోందని ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 188 స్థానాలకు పడిపోతుందని సర్వేలో తేలింది. తాజా సర్వేలో పార్టీల పరంగా చూస్తే బీజేపీ 281 సీట్లు, కాంగ్రెస్ 78 స్థానాలు దక్కించుకుంటాయని స్పష్టమైంది.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. అదే ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 240 సీట్లను కాస్త.. 281 స్థానాలకు పెంచుకుంటుందని.. కాంగ్రెస్ 99 సీట్ల నుంచి 78కి పడిపోతుందని సర్వే ఫలితాల్లో బహిర్గతమైంది. ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఈ పోల్‌ను 2025, జనవరి 2 నుంచి 2025, ఫిబ్రవరి 9 మధ్య నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలలో 1,25,123 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించినట్లు ఇండియా టుడే స్పష్టం చేసింది.
కాగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో ‘‘ఇస్ బార్ చార్ సౌ పార్’’ (400 సీట్లు) నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది. కానీ బీజేపీకి ఓటర్లు ఊహించని షాకిచ్చారు. కాషాయ పార్టీని కేవలం 240 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు బీజేపీకి అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ మద్దతుతో బీజేపీ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
లోక్ సభ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ క్రమంగా తమ బలం పెంచుకుంటూ పోయింది. మహారాష్ట్ర, హార్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించి కేంద్రంలో సీటును మరింత స్ట్రాంగ్ చేసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న కాంగ్రెస్ క్రమంగా డౌన్ ఫాల్ అవుతోందని సర్వేలో తేలింది. ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ సొంత వైఖరేనని సర్వేలో ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.