ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ, ప్రతిపక్షాలు తమను తాము బలపర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాయి. యూఎస్, ఇంగ్లాండ్వంటి ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నట్లు ఇండియాలో 3 లేదా 4 పార్టీలు మాత్రమే ఉండవు. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీంతో కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే పొత్తులతో బలపడాల్సిన అవసరం ఉంటుంది. దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, దాదాపు 20 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నది. ప్రాంతీయ పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకురావడం ప్రతిపక్షాలకు సవాలు అయితే, మిత్రపక్షాలను సంపాదించుకోవడం, ప్రత్యర్థి ప్రతిపక్ష కూటమిని విభజించడం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ముందు ఉన్న సవాలు.
కేంద్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడంలో చిన్న పార్టీలు కీలకంగా మారతాయని గ్రహించిన బీజేపీ తన కూటమిలో అనేక పార్టీలను చేర్చుకుంటున్నది. గతంలో తనను వీడిన పాత మిత్రులతో కలిసిపోవడం మొదలుపెట్టింది. చిరాగ్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ మాంఝీ, బీహార్‌లోని ఇతర చిన్న పార్టీలను బీజేపీ చేర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో సుహెల్‌దేవ్ బీఎస్పీని, అస్సాంలో అసోం గణ పరిషత్‌ను దగ్గరకు తీసింది. ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడుతో బీజేపీ మంతనాలు ప్రారంభించింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాలో గట్టి పొత్తు ఉంటుంది. తమిళనాడులో, బీజేపీ తన స్థానిక యూనిట్‌ను ఉత్తేజపరిచింది. అయితే అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకేకు విలువ ఇస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపింది. 2019లో 39 ఎంపీల్లో 38 మందిని బీజేపీ వ్యతిరేక డీఎంకే ఫ్రంట్ గెలుచుకుంది. తమిళనాడులో కొంత మంది ఎంపీలను దక్కించుకోవాలని కూడా బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్ర బీజేపీకి పెద్ద స్టేట్‌గా మారింది. 2019 లో శివసేనతో బీజేపీ కూటమి మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే శివసేన బీజేపీ కూటమిని విడిచిపెట్టిన తర్వాత, మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోతుందని అందరూ భావించారు. అయితే, శివసేన, శరద్ పవార్ పార్టీలో పెద్ద చీలికలు, థాక్రే ప్రభుత్వం పతనం కావడం లాంటి పరిస్థితులు బీజేపీకి చాలా సురక్షితంగా మారింది.
బీజేపీ కూటమి బలహీనతలు
2019లో భారీ విజయం సాధించిన తర్వాత చిన్న పార్టీలను పెంచి, తన కూటమిని విస్తరించడాన్ని బీజేపీ విస్మరించింది. అది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షంగా బలపడేందుకు దారితీసింది. ప్రాంతీయ నాయకులైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్‌లపై కూడా బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వాస్తవానికి ఈ ముగ్గురు నాయకులు బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీపై దాడికి కాంగ్రెస్‌తో దోస్తీ కడుతున్న పరిస్థితి కనబడుతున్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చేయలేకపోవడం లాంటి అంశాలు.. బీజేపీ ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం కల్పించాయి. బీజేపీ ఇప్పుడు అలాంటి సమస్యలను ఏడాదిలోపే పరిష్కరించుకోవడం సాధ్యం కాని విషయం. నితీష్ కుమార్ నిష్క్రమణ బీజేపీ కూటమికి ఎదురుదెబ్బనే. బీహార్‌లోని 40 మంది ఎంపీల్లో బీజేపీ అత్యధికంగా గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ చిన్న పార్టీలను వెతుక్కోక తప్పడం లేదు.
బీజేపీకి కాంగ్రెస్ సాయం చేసిందా..?
కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఏకం చేయడంలో చాలా తొందరపడి, తమకు పెద్ద కూటమి వచ్చిందని ప్రగల్భాలకు పోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ హడావిడి, శబ్దం బీజేపీని నిద్ర నుంచి మేల్కొల్పాయి. చిన్న పార్టీలను సమీకరించడం, కోల్పోయిన మిత్రపక్షాలను తిరిగి కలుపుకోవాలన్న స్పృహ బీజేపీకి కలిగేలా చేసింది కాంగ్రెసేనా? జనవరి, 2024 వరకు కాంగ్రెస్ అలాంటి ప్రయత్నాలను గోప్యంగా ఉంచితే, బీజేపీకి తన రాజకీయాలను సరిచేసుకోవడానికి సమయం ఉండేది కాదేమో. కర్నాటకలో విజయం తర్వాత మితిమీరిన విశ్వాసంతో ఉన్నది. మాజీ ప్రధాని దేవెగౌడ వంటి నాయకులకు దూరంగా ఉంది. ఇప్పుడు దేవెగౌడ బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి పెద్ద బూస్ట్‌గా మారవచ్చు. ప్రతిపక్షం అంటే రాజవంశాలు, కుటుంబ పార్టీల యూనియన్ అని ప్రధాని మోదీ అంటున్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో ఓటర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడూ అదే కనిపిస్తోంది. కాంగ్రెస్ తప్పులు చేస్తుంటే, బీజేపీ తన అనేక తప్పులను సరిదిద్దుకుంటున్నది. బీజేపీ అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవాలి. చిన్న పార్టీలు, బలమైన నాయకులతో తన సంబంధాలను సరిదిద్దుకోవాలి. ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం మనం వేచి ఉండక తప్పదు. నిద్రపోతున్న కుంభకర్ణుడిని కాంగ్రెస్ నిద్ర లేపింది. పొత్తుల గురించి ఆలోచించకుండా బీజేపీ ఇంతకాలం గాఢనిద్రలో ఉంది. అయితే కాంగ్రెస్ మేల్కొని బీజేపీని తట్టి లేపింది. ఇప్పుడు కాషాయ పార్టీ పొత్తుల కోసం కసరత్తు చేస్తోంది. ఏతా వాతా తేలిందేమిటంటే.. కాంగ్రెస్ బలహీనతే బీజేపీకి అతిపెద్ద ఆస్తి!
ప్రతిపక్ష కూటమి బలాలు
ఇటీవల కర్నాటకలోని బెంగళూరులో కాంగ్రెస్‌సహా 26 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ విపక్ష కూటమి దాదాపు 2019 ఎన్నికల నాటిదే. గాంధీలు, స్టాలిన్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీలు, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారి ముఖాలు అప్పుడు ఉన్నవే కాగా.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కూటమికి కొత్త, పెద్ద చేరికలుగా చూడాలి. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పుంజుకుందనే భావన పార్టీ వర్గాలతోపాటు కొంత ప్రజల్లోనూ వచ్చింది. ఇది కాంగ్రెస్‌కు సానుకూల ప్రకాశాన్ని సృష్టించింది. విపక్ష కూటమిలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ల చేరికతో బెంగాల్, పంజాబ్, ఢిల్లీలో బీజేపీ ఐక్య పోరాటాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. కేసీఆర్ కూడా సైలెంట్ విపక్ష కూటమికి నిశ్శబ్ద మద్దతుదారుగా ఉంటే మాత్రం బీజేపీకి 4 రాష్ట్రాల్లో వ్యతిరేకత తప్పదు.
– డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్