జూన్ 9న మోదీ ప్రమాణ స్వీకారం .. కర్తవ్యపథ్ వేదికగా ప్రోగ్రామ్

జూన్ 9న మోదీ ప్రమాణ స్వీకారం ..  కర్తవ్యపథ్ వేదికగా ప్రోగ్రామ్

న్యూఢిల్లీ:  దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత మోదీ శనివారమే ప్రమాణం చేస్తారని వార్తలు రాగా.. తాజాగా ఆ ప్రోగ్రామ్​ను ఆదివారం సాయంత్రానికి మార్చారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌‌‌‌లో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండో నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఈసారి దక్షిణాసియా దేశాల అధినేతలు హాజరవుతున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గెస్ట్​ల లిస్ట్​ను సిద్ధం చేస్తున్నది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ​సింఘే అటెండ్ అవుతున్నట్టు ఇప్పటికే కన్​ఫామ్ అయింది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్​కు ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ ఇన్విటేషన్ పంపించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును కూడా ఆహ్వానించారు. 

2014లో సార్క్, 2019లో బిమ్స్ టెక్ నేతలు..  

షేక్ హసీనా ఢాకా నుంచి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరి న్యూఢిల్లీకి వస్తున్నట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. బుధవారమే మోదీకి షేక్ హసీనా ఫోన్ చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ కావాలని మోదీ కోరగా.. ఆమె అంగీకరించారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్) దేశాల అధినేతలు హాజరయ్యారు. రెండోసారి 2019లో బిమ్స్​టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్) దేశాల అధినేతలు అటెండ్ అయ్యారు. 

మంత్రి పదవులపై చర్చించిన బీజేపీ నేతలు

ప్రభుత్వ ఏర్పాటు విషయమై గురువారం కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్​నాథ్ సింగ్ తో పాటు బీజేపీ సీనియర్ లీడర్లు ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో ఈ సమావేశం జరిగింది. కూటమి పార్టీలకు కేటాయించాల్సిన మంత్రిత్వ శాఖలు, ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లపై చర్చించినట్టు తెలుస్తున్నది. టీడీపీ కోరిన లోక్​సభ స్పీకర్​తో పాటు మంత్రి పదవుల అంశంపై కూడా డిస్కస్ చేసినట్టు సమాచారం. జేడీయూ నేత నితీశ్ కుమార్ పెట్టిన కొన్ని వినతులనూ పరిశీలించారు. కూటమిలో మిగిలిన పార్టీల నేతలకు కేటాయించే మంత్రిత్వ శాఖలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది.

లోక్​సభ స్పీకర్ పదవిపై టీడీపీ కన్ను 

బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ (272) దాటకపోవడంతో పలు ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతున్నది. 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో టీడీపీ (16), జేడీయూ (12) కింగ్ మేకర్లుగా నిలిచాయి. బుధవారం ఎన్డీఏ కూటమిలోని నేతలు భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, కింగ్ మేకర్లుగా నిలిచిన టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకమైన కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నాయి. ఈ మేరకు తమ అభిప్రాయాలను బీజేపీ హైకమాండ్ ముందు పెట్టినట్టు సమాచారం. లోక్​సభ స్పీకర్​తో పాటు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులుగా టీడీపీ నేతలకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తున్నది. కాగా, బీజేపీ హైకమాండ్ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, మరో కింగ్ మేకర్ జేడీయూ కూడా తన మనసులో మాట బీజేపీ అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. ఎన్డీఏ కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాని అమలుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్యానెల్​ను లీడ్ చేసే బాధ్యత నితీశ్​కుమార్​కు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కాగా, కీలకమైన హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

నేడు మోదీతో ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరఫున కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని వీరంతా బలపర్చనున్నారు. ఎన్డీఏ ఎంపీల నాయకుడిగా మోదీని ఎన్నుకున్నాక సాయంత్రం కూటమిలోని సీనియర్ సభ్యులు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఇతరులు ప్రధానితో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. తమ వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ఉందని తెలియజేసి, కొత్త సర్కార్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఎంపీల జాబితాను కూడా వారు రాష్ట్రపతికి అందజేయనున్నారు.