వాజ్ పేయి నుంచి మోడీ వరకు…. పడుతూ.. లేస్తూ ఎన్డీయే

వాజ్‌‌‌‌పేయి చైర్మన్‌‌‌‌గా ఏర్పడ్డ ఎన్డీయే దేశంలోని చాలా సెంట్రిక్‌‌‌‌ రైట్‌‌‌‌ పార్టీలను ఏకం చేయగలిగింది. ఫెర్నాండెజ్‌‌‌‌, అద్వానీల సాయంతో నాన్‌‌‌‌–కాంగ్రెస్‌ , నాన్‌‌‌‌–లెఫ్ట్‌‌‌‌ కూటమిగా అందరి ఆమోదం పొందిం ది. దీనికి భిన్నం గా ఎన్డీయే–2 నడుస్తోంది. వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వానికి, మోడీ సర్కారుకి పూర్తిగా వ్యత్యాసముందన్నది పరిశీలకుల అభిప్రాయం. గతంలో అందరినీ కలుపుకునే రీతిలో ఎన్డీయే–1 సాగగా, మిత్రులనుసైతం దూరం చేసుకునేలా ఎన్డీయే2 ఉందంటున్నారు. ప్రస్తుతం మోడీ–షా జోడీ మెడపైనే కత్తి వేలాడుతోం ది. ఈ నెల 23న వెలువడే ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా వీరిద్దరే ఎక్స్‌ పోజ్‌‌‌‌ అవుతారు.

1998… వరుసగా రెండు యుద్ధాల తర్వాత జనం సంధిని కోరుకున్నట్లుగా దేశం ఒక ప్రత్యామ్నాయ నాయకుడికోసం ఎదురు చూసిన ఏడాది. అంతకుముందు 1996లో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితితో జనం విసిగిపోయారు. జనతా పార్టీ ప్రయోగం మూడేళ్లకే దెబ్బతింటే, జనతా దళ్‌‌‌‌ రెండేళ్లకే చీలికలు పీలికలైపోయింది. 1996 ఎన్నికల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి 140 స్థానాలు రాగా, బీజేపీకి 161 సీట్లు తెచ్చుకుంది. చట్టసభలో ఏకైక పెద్ద పార్టీకి లేదా వివిధ పార్టీల కూటమికి  మొదటి అవకాశం ఇవ్వాలనేది సర్కారియా కమిషన్‌‌‌‌ సూచన. దాని ప్రకారంగానే సింగిల్‌‌‌‌ లార్జెస్ట్‌‌‌‌ పార్టీగా బీజేపీని ఆహ్వానించారు. ఆ పార్టీకి సమతా పార్టీ 8, శివసేన 15, హర్యానా వికాస్‌‌‌‌ పార్టీ 3 మద్దతు పలకడంతో బీజేపీ బలం 213కి చేరడంతో వాజ్‌‌‌‌పేయి ప్రధాని అయ్యారు. బల నిరూపణలో ఫెయిలై 13 రోజులకే రాజీనామాచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ని ఆహ్వానించినా, ముందుకు రాలేదు.  79 స్థానాలుగల యునైటెడ్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌కి  కాంగ్రెస్‌‌‌‌ (140), లెఫ్ట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ (52) మద్దతు ప్రకటించడంతో హెచ్‌‌‌‌.డి.దేవెగౌడ ప్రధాని కాగలిగారు. అయితే, విధానపరమైన విభేదాలవల్ల 10 నెలల 21 రోజుల తర్వాత అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు సీతారాం కేసరి మద్దతు ఉపసంహరించుకున్నారు.  జనతా దళ్‌‌‌‌ నుంచి దేవెగౌడ వర్గం వెళ్లిపోవడంతో యునైటెడ్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌కి  కాంగ్రెస్‌‌‌‌ మళ్లీ సపోర్టు ఇచ్చి, ఐ.కె.గుజ్రాల్‌‌‌‌ని ప్రధానిగా నిలబెట్టింది. అయితే,  ఈ ప్రభుత్వంకూడా నిలబడలేదు. కేవలం 11 నెలలకే  పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలు అవసరమయ్యాయి.  అప్పటి వరకు యునైటెడ్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌తో అంటకాగిన డిఎంకె, తెలుగు దేశం పార్టీ వంటివి పక్కకు తప్పుకున్నాయి.

అలాంటి సంక్షోభ పరిస్థితిలో వాజ్‌‌‌‌పేయి చైర్మన్‌‌‌‌గా 1998లో నేషనల్‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌ (ఎన్డీయే) ఏర్పడింది. దీనికి తెలుగుదేశం పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.  మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకి 254 సీట్లు తెచ్చుకుని వాజ్‌‌‌‌పేయి ప్రధానిగా పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తెలుగు దేశం పార్టీ బయటినుంచి మద్దతు ప్రకటించి, స్పీకర్‌‌‌‌గా బాలయోగిని ఎంపిక చేయించింది. అయితే, ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న అన్నా డీఎంకే, బీఎస్‌‌‌‌పీ వంటివి తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  లోక్‌‌‌‌సభలో బలనిరూపణ జరగ్గా, కేవలం ఒక్క ఓటు తేడాతో వాజ్‌‌‌‌పేయి  ప్రభుత్వం కుప్పకూలింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.

1999 భారతీయ జనతా పార్టీకి బాగా కలిసొచ్చింది.  ప్రతిపక్ష రాజకీయాల్లో ఆరితేరిన జార్జి ఫెర్నాండెజ్‌‌‌‌, మాస్‌‌‌‌లోకి బీజేపీని తీసుకెళ్లిన లాల్‌‌‌‌ కృష్ణ అద్వానీలు  చక్రం తిప్పారు. ఫెర్నాండెజ్‌‌‌‌ సెంట్రిక్‌‌‌‌ రైట్‌‌‌‌ పార్టీలన్నింటినీ ఒక చోటకు చేర్చగలిగారు.  అప్పటివరకు దూరంగా ఉన్న డీఎంకే, తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, జమ్మూ కాశ్మీర్​ నేషనల్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌, జనతాదళ్‌‌‌‌ (ఎస్‌‌‌‌) వంటి,పార్టీలన్నీ బీజేపీ నాయకుడు వాజ్‌‌‌‌పేయి నాయకత్వాన్ని సమర్థించాయి.  దీంతో 270 ‘సీట్లతో అధికారాన్ని చేపట్టగా, 29 సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచే మద్దతు పలికింది. స్పీకర్‌‌‌‌గా మరోసారి బాలయోగి బాధ్యతలు అందుకున్నారు.

ఆ విధంగా వాజ్‌‌‌‌పేయి–అద్వానీ–జార్జి ఫెర్నాండెజ్‌‌‌‌ త్రయం సృష్టించిన నేషనల్‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌ (ఎన్డీయే) పూర్తిగా అయిదేళ్ల కాలానికి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.  హిందూత్వ పార్టీగా పేరుబడ్డ బీజేపీకి వాజ్‌‌‌‌పేయి సెక్యులర్‌‌‌‌ ముసుగు (ముఖోటా)గా ఉపయోగపడితే, ఫెర్నాండెజ్‌‌‌‌ నాన్‌‌‌‌–కాంగ్రెస్‌‌‌‌ ప్రోగ్రెసివ్‌‌‌‌ శక్తులకు దోస్తు కాగలిగారు. వీరి వల్లనే జనతాదళ్‌‌‌‌ నుంచి విడిపోయిన చాలామంది నాయకులు ఎన్డీయే వైపు మొగ్గు చూపారు. దీంతో వాజ్‌‌‌‌పేయి కొద్ది నెలలు తక్కువగా అయిదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు.

2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 138 సీట్లు సాధించినా, ఎన్డీయేలోని చాలా మిత్రపక్షాలు తమ తమ రాష్ట్రాల్లో తగినన్ని సీట్లు సాధించలేకపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో తెలుగు దేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కేవలం అయిదు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌‌‌‌ 145 స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీ నాయకత్వంలోని యునైటెడ్‌‌‌‌ ప్రోగ్రెసివ్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌ (యూపీఏ) 218 సీట్లు క్లెయిమ్‌‌‌‌ చేసుకుంది. 59 సీట్లు సాధించిన లెఫ్ట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌, సమాజ్‌‌‌‌వాది పార్టీ, బహుజన సమాజ్‌‌‌‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తరఫున మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ ప్రభుత్వాన్నేర్పాటు చేశారు. 2009లోనూ ఇదే సీన్‌‌‌‌ రిపీట్‌‌‌‌ అయ్యింది.  పదేళ్లపాటు మన్మోహన్‌‌‌‌ (యూపీఏ) పాలన గడిచాక, 2014లో నరేంద్ర మోడీ హయాంలో ఎన్డీయే–2 ప్రభుత్వం అధికారానికొచ్చింది.

వాజ్‌‌‌‌ఫేయి ప్రభుత్వాన్ని ఎన్డీయే–1 గానూ, మోడీ పాలనను ఎన్డీయే–2గానూ చెబుతుంటారు. ఈ రెండు ప్రభుత్వాలకు మౌలికంగానే చాలా వ్యత్యాసముంది.  వాజ్‌‌‌‌పేయి దేశంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడుగా గుర్తింపు పొందగా, మోడీ హిందూత్వ శక్తుల ప్రతినిధిగా పేరుబడ్డారు. వాజ్‌‌‌‌పేయి హయాంలోనే సబర్మతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ దహనం, దానికి ప్రతీకారంగా గోద్రాలో అల్లర్లు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తంగా వెయ్యికి పైగా చనిపోగా, 2,500 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఆయన హయాంలోనే పాకిస్థాన్‌‌‌‌ మన అధీనంలోని కాశ్మీర్‌‌‌‌లోగల  కార్గిల్‌‌‌‌లో చొరబడి కాల్పులకు దిగడంతో యుద్ధం సంభవించింది.  అయినప్పటికీ వాజ్‌‌‌‌పేయిని ఎవరూ తప్పుబట్టలేదు. ఆయన అందరివాడుగా పేరుపొందడమే కారణంగా చెబుతారు. ఎన్డీయే–2లో మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలోనూ చాలా చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల అభ్యుదయ రచయితలు, జర్నలిస్టులపై దాడులు జరిగాయి.  మోడీని మతవాది అనే కోణంలో చూడడంద్వారా ఈ ఘటనల్లో ఆయన బాగా అపప్రథకు గురయ్యారు. అంతేకాకుండా, ప్రధానిగా తాను, పార్టీ అధ్యక్షుడిగా అమిత్‌‌‌‌ షా నడిపిన రాజకీయాలు నియంతృత్వంగా ఉన్నాయంటారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో మొదటి నుంచీ ఎన్డీయేకి మిత్రపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో కొత్తగా కలిసిన పీపుల్స్‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌ పార్టీ (పీడీపీ) మధ్యలోనే తప్పుకోవడం వెనుక మోడీ–షా దూకుడు రాజకీయాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

మోడీ–షా జోడీ దేశంలో సామరస్యపూర్వక రాజకీయ వాతావరణాన్ని ఏర్పరచలేకపోయిందన్నది అందరూ చెప్పే మాట.  వీరిద్దరి వల్లనే గతంలో ఎన్‌‌‌‌డీఏతో కలిసి నడిచిన తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, బిజూ జనతాదళ్‌‌‌‌, బీఎస్‌‌‌‌పీ, డీఎంకే, తెలుగుదేశం పార్టీ,వంటివి ఇప్పుడు ఒంటరిగా బరిలో దిగాయి. సర్వేలు చెబుతున్న విధంగా ఈ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రానిపక్షంలో మళ్లీ మిత్రులందరినీ కూడగట్టుకోవలసి వస్తుంది. మోడీ–షా దుందుడుకు పోకడలను తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంతోనే దూరమైనవాళ్లు ఎంతవరకు కలిసొస్తారన్నది అనుమానమేనని అంచనా.  మోడీ కాకుండా మరో నాయకుడిని గనుక పార్టీ ప్రొజెక్ట్‌‌‌‌ చేయగలిగితే… ఇప్పటివరకు దూరం దూరంగా ఉన్న సెంట్రిక్‌‌‌‌ రైట్‌‌‌‌ పార్టీలు మరోసారి ఎన్డీయే గూటిలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ అంచనాలు, విశ్లేషణలు ఎంతవరకు కరెక్టో ఈ నెల 23న గానీ తేలదు.

రకరకాల ఎత్తుగడలు

కిందటిసారి లోక్‌‌సభ ఎన్నికల్లో ఎన్‌‌డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి దూరమైంది. ఎన్‌‌డీఏకి మొదటి నుంచీ మిత్రుడిగా కొనసాగిన నాయకుడు నారాచంద్రబాబునాయుడు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక నూతన రాజధాని నిర్మాణం మొదలుకొని స్పె షల్‌ స్టేటస్‌ శాంక్షన్‌‌ వరకు మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదన్నది చంద్రబాబు ఆరోపణ. ఈ కారణంతోనే ఆయన ప్రభుత్వం నుంచి తమ మంత్రులను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్‌‌డీఏ నుంచి కూడా తప్పుకున్నారు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి మోడీ–షా జోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దూరంగా ఉన్న పార్టీలను బుజ్జగించి మరల దగ్గరకు తీసుకుంటున్నాయి. శివసేన, అసోం గణ పరిషత్ వంటి పార్టీలను ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదల కావడానికి ముందే దగ్గరకు చేరదీశాయి. తమిళనాడు లో అన్నా డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. ఓ వైపు పాత మిత్రులను దగ్గర చేసుకుంటూ మరోవైపు కొత్త మిత్రులతో కలిసి బరిలోకి దిగింది ఎన్‌‌డీఏ కూటమి.

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ పై ఆశలు

యూపీలో పోయిన ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు ఈసారి రావని సర్వేలు చెబుతున్నాయి.మొత్తం 80 ఎంపీ సీట్లలో 35కి మించక పోవచ్చని అంటున్నారు. అందువల్ల ఒడిశా,పశ్చిమ బెం గాల్‌ పై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుం ది. ఒడిశాలో కొంతకాలంగా చొచ్చుకుపోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడ కాంగ్రెస్ యాక్టివ్‌‌గా లేకపోవడంబీజేపీకి లాభించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, మమతా బెనర్జీ పాలనలోఉన్న పశ్చిమ బెంగాల్‌ ను కూడా బీజేపీ టార్గెట్ చేసుకుంది. మమతా బెనర్జీ నియంత అని ప్రచారం చేసింది. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోరని ఆరోపణలు చేసింది. బెంగాల్‌ లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభావం కనుమరుగవడం, మమతా బెనర్జీపై సామాన్య జనం అసంతృప్తిగా ఉండడం తమకు లాభిస్తుందని బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో అమిత్ షా హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి పర్మిషన్ ఇవ్వని సంఘటనతో పాటు తాజాగా ఆయన పర్యటన సందర్భంగా జరిగిన హింసను ప్రచారంలో హైలెట్ చేసుకుని లాభపడాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.