ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో బ్రాడ్ కాస్టింగ్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నది. టీవీ చానల్స్ కొన్ని, యూట్యూబ్ చానల్స్ కొన్ని ప్రభుత్వం అనుకూలంగా ఉన్నాయి. అయితే వ్యతిరేక టీవీలు, యూట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. కొందరు యూట్యూబర్లు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారు అనే అభిప్రాయం ఉన్నది. వీరంతా, ప్రభుత్వ మంచి చెప్పకున్నా తప్పులను ఎత్తిచూపుతున్నారు. అందుకేనేమో బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు తెస్తున్నారేమో అనే భావన ఉంది. ది వైర్ వంటి సంస్థల మీద, మరికొంత మంది మీద విచారణలు చేశారు.
ఐటీ దాడులు చేశారు. బీజేపీకి యూట్యూబ్ నెట్వర్క్ చాలానే ఉన్నది. అయితే, నిజం చెప్పేవారిని అంతిమంగా బ్రాడ్ కాస్టింగ్ బిల్లు తెచ్చి కట్టడి చేయడం, యూట్యూబ్ చానల్స్‌ను బంద్ చేసుకునే విధంగా చేయడం కోసం ప్రభుత్వం యోచిస్తున్నదనే వాదన వినబడుతున్నది. ప్రభుత్వానికి తెలియకుండా, అనుమతి లేకుండా కంటెంట్‌ను ప్రసారం చేయలేరు. ఈ బిల్లులో ఇది కీలక అంశం! కాపీ రైట్స్ ఉండనే ఉన్నాయి. దీనితోనే కొంత పరేషాన్ ఉన్న యూట్యూబర్లు కేంద్రం బ్రాడ్ కాస్టింగ్ బిల్లు తెచ్చి ఆమోదిస్తే, ఆందోళన చెందడం సహజం. భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి.------ కంటెంట్ ముందు తెలపాలా?------------- అసలు కంటెంట్ ఏమిటో మీడియా ముందుగా ప్రభుత్వానికి చెప్పి చేయాలంటే సాధ్యమేనా?
నిజానికి కేంద్రం ఏ బిల్లు తెచ్చినా అది మొత్తంగా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఉండాలి. కేంద్రం గతంలోనూ అనేక బిల్లులు తెచ్చింది. ఉదాహరణకు మూడు వ్యవసాయ బిల్లులు తెచ్చారు. చివరకు రైతు ఆందోళనల వల్ల మళ్లీ వెనక్కి తీసుకోవలసివచ్చింది. కాబట్టి ఏ పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ తీసుకోవడం జరగాలి. కానీ, అలా జరగక పోతుండటమే సమస్య. ఇప్పుడు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు తెస్తున్నారు. మీడియా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారా అనేదే కీలకం. మీడియా కంట్రోల్ కోసమే బిల్లు అనే అనుమానాన్ని కేంద్రం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.--------- ప్రజల సమస్యల మీద వార్తలు, స్టోరీలు, డిబేట్లు సమాజానికి చాలా అవసరం. అవి దేశ ప్రయోజనాల రీత్యా మరింత అవసరం.
- ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్