సౌత్​ స్టేట్స్​పై కేంద్రం వివక్ష.. ఎన్డీయే సర్కారు తీవ్ర అన్యాయం చేస్తుంది: సీఎం రేవంత్

సౌత్​ స్టేట్స్​పై కేంద్రం వివక్ష.. ఎన్డీయే సర్కారు తీవ్ర అన్యాయం చేస్తుంది: సీఎం రేవంత్
  • మేం సంపద సృష్టిస్తుంటే.. ఆ సొమ్మును నార్త్​ స్టేట్స్​కు పంచుతున్నది
  • జీడీపీలో  సౌత్​ వాటా 30 శాతం ఉంటే16 శాతం జనాభా లెక్కన నిధులేంది?  
  • తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో 40 పైసలే వెనక్కి
  • పన్నుల వాటా ప్రాతిపదికన ఇవ్వాలి
  • పోరాటానికి సౌత్​ స్టేట్స్​ సిద్ధమైతే తాను నాయకత్వం వహిస్తానని వెల్లడి
  • ఏబీపీ సదరన్ రైజింగ్ సమిట్​లో ప్రసంగం

 హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, సౌత్​ స్టేట్స్​ సంపదను సృష్టిస్తుంటే ఆ సొమ్మును నార్త్​ స్టేట్స్​కు పంచుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీఎం రేవంత్​అన్నారు.  జీడీపీలో 30 శాతం వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు16 శాతం జనాభా లెక్కన నిధులు ఇస్తున్నారని, తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో 40 పైసలే వెనక్కి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ‘ఏబీపీ సదరన్ రైజింగ్ సమిట్’కు  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.  దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతపై ప్రసంగించారు.  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఉద్యమించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని, అవసరమైతే ఆ  పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని రేవంత్​ అన్నారు.‘ఈ దేశంలో సంపద సృష్టించేది దక్షిణాది రాష్ట్రాలు. కానీ ఆ సొమ్మును  ఉత్తరాది రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి. 

దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని  దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయి. కానీ కేంద్రం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం వల్ల అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయి.  తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం 40 పైసలే వెనక్కి ఇస్తున్నది.  అదే యూపీ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వస్తున్నాయి’’ అని సీఎం రేవంత్​ తెలిపారు. కేంద్రం ఇకనైనా జనాభా ప్రాతిపదికన కాకుండా పన్నుల వాటాగా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు.  ‘‘కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా.. నిధుల విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతున్నది.  ప్రధాని మోదీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు  ప్రధాని మోదీ అందించిన సహకారం చాలా తక్కువ. కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడ ఓట్లు మాత్రం అడుగుతారు” అని వ్యాఖ్యానించారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి, ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ కారణాల వల్ల కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ పోరాటానికి నాయకత్వం వహించలేకపోయారని, ఎన్డీయేతో పొత్తు వల్ల చంద్రబాబు కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. ‘‘అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తా.  దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, అభివృద్ధి కోసం పోరాడుతా’’ అని స్పష్టం చేశారు.  దేశంలో కాంగ్రెస్ హయాంలోనే  అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, బాక్రానంగల్ మొదలుకొని నాగార్జున సాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టారని తెలిపారు. విద్యావ్యవస్థలో జవహర్​లాల్​ నెహ్రూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి,  గొప్ప  యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని, ఎందరో ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, పారిశ్రామికవేత్తలు వాటి నుంచి వచ్చిన వారేనని సీఎం చెప్పారు. దేశానికి మూడోసారి ప్రధాని అయిన మోదీ.. ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చారో,   దేశానికి ఏ రకమైన సేవలు చేశారో బీజేపీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్​ సవాల్ చేశారు.  ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్ అభివృద్ధి

హైదరాబాద్​లోని బాపూఘాట్​ను అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రేవంత్​ హామీ ఇచ్చారు. ‘‘ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ పటేల్ విగ్రహం తరహాలో బాపూఘాట్ లో  గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్  అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. కానీ గాంధీ వారసులుగా మేం బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం’ అని స్పష్టంచేశారు. 

పదేండ్లలో కేసీఆర్​10 సార్లు కూడాసెక్రటేరియెట్​ రాలే

పదేండ్లు  ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ 10 సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని నిలదీశారు. ‘కేసీఆర్  తన ఫాంహౌస్‌‌‌‌లో పడుకుంటడు. గత పది నెలల్లో ఒక్కసారే అసెంబ్లీకి వచ్చిండు.  తాను జమీందార్​నని, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ అనుకుంటడు. అందుకే బయటకు రావడం లేదు. డెమొక్రసీపై గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు?’’ అని సీఎం రేవంత్​  ప్రశ్నించారు. ‘తెలంగాణలో 4  కోట్ల మంది ప్రజలు ఎన్నుకుంటేనే మేం అధికారంలోకి వచ్చాం.  మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల ఆలోచనను కేసీఆర్  అర్థం చేసుకోవాలి.  ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నరు. కానీ  బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు’’ అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఈ సారి కేంద్రంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ చెప్పారని,  240 సీట్లు కూడా రావని తాను చెప్పానని, బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని ముందే చెప్పినట్టు గుర్తుచేశారు.

నేడు కొడంగల్​కు సీఎం 

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు కొడంగల్​ చేరుకోనున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మద్దూరు మండల కాంగ్రెస్​​నాయకుడు సతీశ్, బోంరాస్​పేట మండల సీనియర్​ నాయకుడు నర్సిరెడ్డి కుటుంబాలను పరామర్శించనున్నారు.

మూసీ పునరుజ్జీవాన్ని ఎందుకు అడ్డుకుంటున్నరు?

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయో చెప్పాలి. మీరు గుజరాత్​లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ.. మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నరు? మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్​కు పోటీ ఇవ్వడం ఖాయం. అందువల్లే తెలంగాణను, హైదరాబాద్​ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నరు. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటిరోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంలోని ఆంతర్యం ఏమిటి? ‘రైజింగ్​ తెలంగాణ, రైజింగ్​ హైదరాబాద్​’ను బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఫ్యూచర్​ సిటీని నిర్మిస్తే వారికొచ్చిన సమస్య ఏంటి?.  ఇలాంటి డెవలప్​మెంట్​ పనులను అడ్డుకుంటే భారత్​ 5 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా ఎలా ఎదుగుతుంది. వందలాది మంది బలిదానాలతో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి