గత సర్కార్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల లెక్కలు బయటపెడుతామని ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు. జగన్ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని.. ఆ స్కాంలోని వాస్తవాలను కూటమి ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టుకు అందజేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాల నుంచి ప్రాథమిక రిపోర్టును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వంలో తొలుత ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేశారని.. తర్వాత 2021 మేలో జేపీ సంస్థకు ఇసుక టెండర్ కట్టబెట్టినప్పటి నుంచి దందా మొదలైందని వారు చెప్తున్నారు. అప్పట్నుంచి ఏం జరిగిందో లెక్కలు తీశామన్నారు. ఇసుక తవ్వకాలకు పర్యావరణ మదింపు సంస్థ 470 పర్యావరణ అనుమతులు జారీ చేసిందన్నారు.
ఇప్పుడీ జాబితా తీసుకొని పరిశీలన చేస్తున్నామన్నారు. రద్దీ ఉన్న రీచ్ పరిధిలోనే ఆ పరిమాణం మేరకే తవ్వారా? పక్కన కూడా తవ్వేశారా అనేది చూస్తున్నామన్నారు. అసలు ఈసీ లేకుండా తవ్వేసిన ప్రాంతాలను పరిశీలిస్తున్నమని.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గూగుల్ మ్యాప్స్ సహకారంతో నదుల్లో ఇసుక తవ్వకాలపై రిపోర్టులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు గనులశాఖ అధికారులూ అదే విధానం పాటిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గతేడాది మార్చిలో ఎన్జీటీ అదేశించినా, తవ్వకాలు అగలేదన్నారు. దీంతో ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సందర్భంగా పిటిషనర్ దండా నాగేంద్రకుమార్ యంత్రాలతో ఇసుక తవ్వకాల ఫొటోలను అందజేశారన్నారు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని జిల్లాలకు 220 ఫొటోలను పంపించారు. గనులశాఖ అధికారులు ఆ ఫొటోల వారీగా పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
మొన్నటివరకు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు రిపోర్టులు ఇచ్చిన కలెక్టర్లు ఇప్పుడు బదిలీ అయిపోయారని... దాంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలుందని కూటమి నాయకులు చెప్తున్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని అక్కడి అధికారుల సంయుక్త కమిటీ నివేదించినా కలెక్టర్లు మాత్రం అంతా సవ్యంగా జరిగిందని రిపోర్టు పంపారన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉల్లంఘనలు జరిగాయనడంతో కలెక్టర్ల నివేదికలు తప్పని తేలిపోయిందని వెల్లడించారు.
ALSO READ : రాష్ట్రపతి పాలన విధించాలి
తర్వాత మరోసారి నివేదికలు కోరినప్పుడు కృష్ణా జిల్లా నుంచే అక్రమ తవ్వకాలు వాస్తవమంటూ రిపోర్టు వెళ్లిందన్నారు. రిపోర్టు మార్చాలంటూ అక్కడి గనులశాఖ అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెచ్చినా, అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటుచేసి, ఇసుక తవ్వకాలు జరగకుండా చూశారన్నారు. అంతకుముందు వరకు జరిగిన ఇసుక దోపిడీ గుట్టు ఈ నెలాఖరుకు సుప్రీంకోర్టుకు అందజేసే రిపోర్టుతో వీడనున్నట్లు పేర్కొన్నారు.