ఈ టర్మ్​లోనే జమిలి ఎన్నికలు!

  • మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు 

  • వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా ఎన్డీయే అడుగులు 

  • అన్ని పార్టీల నుంచీ మద్దతు లభిస్తుందని ధీమా 

  • రేపటితో మోదీ 3.0 సర్కారుకు వంద రోజులు 

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే 3.0 సర్కార్​కు వంద రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్ లోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకేసారి ఎన్నికలు)’ అమలుకు మోదీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. 

జమిలి ఎన్నికలకు అన్ని పార్టీల నుంచీ మద్దతు లభిస్తుందని కేంద్రం ఆశాభావంతో ఉన్నట్టు ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ప్రస్తావిస్తూ ‘పీటీఐ’ వార్తాసంస్థ ఆదివారం ఓ కథనం వెలువరించింది. మోదీ 3.0 సర్కారు పూర్తి పదవీకాలం కొనసాగుతుందని, ఈ టర్మ్ లోనే ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చి జమిలి ఎన్నికలు ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోందని తెలిపింది.

 పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఓ మూలన ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతోందని, అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.జమిలి ఎన్నికల కల సాకారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మూడోసారి అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. 

18 రాజ్యాంగ సవరణలు అవసరం.. 

లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసి సిఫారసులు 
చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, దేశవ్యాప్తంగా రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. 

మొదట లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని, ఆ తర్వాత వంద రోజుల్లోపు లోకల్ బాడీస్ ఎన్నికలను పూర్తి చేయాలని సూచించింది. ఈ మూడు ఎన్నికలకూ ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని తెలిపింది. జమిలి ఎన్నికల అమలు కోసం 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని, వీటికి రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేదని వెల్లడించింది. 

అయితే, ఈ రాజ్యాంగ సవరణ కోసం పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  మరోవైపు ఈ అంశంపై లా కమిషన్ కూడా విడిగా అధ్యయనం చేస్తోంది. జమిలి ఎన్నికలను 2029 నుంచి మూడు అంచెలుగా నిర్వహించాలని సూచించే అవకాశం ఉంది. మొదట లోక్ సభకు, ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలకు, అనంతరం లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది.