మోడీ ప్లస్.. నితీశ్ మైనస్
బీహార్ లో బీజేపీ, జేడీయూ కూటమి మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది. కౌంటింగ్ సమయంలో మొదటి నుంచి ఎన్డీఏ లీడ్ లోనే ఉన్నా.. ప్రతిపక్షాల మహా కూటమి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఇచ్చింది. రెండు కూటముల మధ్య పెద్దగా సీట్ల తేడా లేకపోవడంతో ఫలితం ఎటైనా అవ్వొచ్చన్న టెన్షన్ కనిపించింది. అటు బీజేపీ–జేడీయూ, ఇటు ఆర్జేడీ–కాంగ్రెస్ కూటములు రెండూ అధికారం తమదే అన్న ధీమా వ్యక్తం చేశాయి. చివరికి స్వల్ప తేడాతో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం దక్కించుకుంది. నితీశ్ పై వ్యతిరేకత ఎన్డీఏకి కొంత నష్టం కలిగించినా.. మోడీ హవా పని చేయడంతో బీజేపీకి సీట్లు పెరిగి మేజిక్ ఫిగర్ ను దక్కించుకోవడంలో సక్సెస్ అయింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేది జేడీయూ చీఫ్ నితీశ్ కుమారే అన్న ట్రెండ్ కనిపించింది. కానీ ఎన్నికల ప్రచారం మొదలైన కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. నితీశ్ పై వ్యతిరేకతే బీజేపీ– జేడీయూ కూటమిని ఇంటికి పంపడం ఖాయమన్నట్లు కనిపించింది. 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసి పోటీ చేసి 40 సీట్లలో 39 సొంతం చేసుకున్నాయి. ఆ సమయంలో మోడీ మళ్లీ ప్రధాని కావాలన్న ఆశతోనే జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీశ్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మోడీ పాపులారిటీనే తగ్గించిందని చెప్పొచ్చు. నితీశ్ పై ఉన్న కోపంతో జనం జేడీయూకి తక్కువ సీట్లు ఇచ్చినా.. బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చి బ్యాలెన్స్ చేశారు.
నితీశ్ పార్టీకి భారీగా తగ్గిన సీట్లు
బీహార్ లో నడిచిన ఉత్కంఠ పోరులో చివరికి అధికార కూటమి మరోసారి ప్రజల ఆమోదం పొందింది. కానీ సీఎంగా ఉన్న నితీశ్ పై ప్రజా వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆయన 15 ఏళ్లుగా సీఎంగా ఉండడంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే దీనికి అదనంగా కరోనా ఆయన పార్టీ జేడీయూపై మరో దెబ్బ కొట్టింది. కరోనా లాక్ డౌన్ వల్ల పనులు కోల్పోయిన బీహారీ వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కసారిగా తిరిగి స్వస్థలాలకు వచ్చారు. అయితే లక్షలాదిగా వచ్చిన కార్మికులు వాళ్ల ఇండ్లకు చేరడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. యూపీ నుంచి బీహార్ సరిహద్దు వరకు ఉత్తరప్రదేశ్ అధికారులు వలస కార్మికులను వదిలిపెట్టినప్పటికీ వాళ్లను స్వస్థలాలకు చేర్చడంలో నితీశ్ సర్కారు ఫెయిల్ అయింది. పైగా ఉపాధి కోల్పోయామన్న కోపంలో ఉన్న వలస కూలీలకు పుండు మీద కారంలా మరోసారి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీనే అన్ని పార్టీలు రిపీట్ చేయడం మరింత ఆగ్రహం పెంచింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ‘ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీహారీలను వెనక్కి తీసుకొచ్చి.. అందరికీ ఉద్యోగాలు, ఉపాధి చూపిస్తాం’ అని నితీశ్ హామీ ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్న కోపం, కరోనా టైమ్ లో ఎదుర్కొన్న కష్టాల వల్ల నెలకొన్న ఆవేదన కలిసి నితీశ్ ను దెబ్బ కొట్టాయి. దీంతో గత ఎన్నికల్లో 70 సీట్లు గెలుచుకున్న జేడీయూ ఈ సారి 40 సీట్లకు అటూ ఇటుగా ఆగిపోయింది. తన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ముందే ఊహించిన నితీశ్ ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ అండ కోసం ఎదురు చూసినట్లు ప్రతి సభలో కనిపించారు.
మోడీ మంత్రం పనిచేసింది
బీహార్ లో ఎన్డీయే కూటమి గట్టెక్కిందంటే మోడీ హవానే కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో సీఎం ఫేస్ అయినప్పటికీ మోడీ పాపులారిటీ వల్లే మళ్లీ అధికారం దక్కింది. 2018లో చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వడం మనం చూశాం. అయితే, 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. అందువల్ల ఈ ఎన్నికల్లో నితీశ్ పై అసంతృప్తి దెబ్బకొట్టినా.. మోడీపై ఉన్న నమ్మకం ఎన్డీఏని నిలబెట్టింది. నితీశ్పైనే కోపం వల్ల జేడీయూకి గత ఎన్నికల్లో కంటే ఈసారి దాదాపు 30 సీట్ల వరకు తగ్గినా.. బీజేపీకి అదనపు సీట్లు వచ్చాయి. 2015 ఎన్నికల్లో బీజేపీకి 53 సీట్లు రాగా.. ఇప్పుడు ఆ పార్టీ 70కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాని మోడీ పాజిటివ్ ఇమేజ్ ఎన్డీఏకు ప్లస్ అయినా.. బీహారీ ప్రజల్లో నితీశ్ పై గూడు కట్టుకున్న కోపం ఆ కూటమిని దెబ్బకొట్టింది. అయితే బీజేపీ–జేడీయూతో కలిసి పోటీ చేసిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, హిందుస్థానీ ఆవమ్ మోర్చా (సెక్యులర్) లాంటి చిన్న చిన్న పార్టీలకు వచ్చిన సీట్ల సాయంతో ఎన్డీఏ గట్టెక్కింది.
మహా కూటమికి కాంగ్రెస్ పెద్ద మైనస్
ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికల ప్రకటనకు చాలా రోజుల ముందే మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఆర్జేడీ–కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా లీడ్ చేసిన ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అయితే అంత వేగంగా ఎన్నికలకు సిద్ధమైన ఆర్జేడీ చివరికి అధికార పీఠానికి దగ్గరగా వచ్చి అడుగు దూరంలో ఆగిపోయింది. దీనికి అనుమానం లేకుండా కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పొచ్చు. ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్ జేడీయూ–బీజేపీ కూటమిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేసినా.. కాంగ్రెస్ పెద్ద మైనస్ గా మారింది. కాంగ్రెస్ తన బలానికి మించి సీట్లను తీసుకుని మహా కూటమి ఓటమికి కారణమైంది. మొదట్లో తేజస్వీ యాదవ్ కాంగ్రెస్ కు 48 సీట్లకు మించి ఎక్కువ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. కానీ నానా యాగీ చేసి కాంగ్రెస్ 70 సీట్లు ఇచ్చే వరకూ వదల్లేదు. కానీ ఆ పార్టీ 20 స్థానాల్లో కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించి ఉంటే మహా కూటమి పరిస్థితి మరింత బెటర్ గా ఉండేది. బీహార్ లో కాంగ్రెస్ ను చిన్నపార్టీగానే చూస్తున్నామని ఆ పార్టీ స్థానిక నేతలే ఒప్పుకున్నా.. అగ్రనాయకత్వం మొండిగా వ్యవహరించడం మహాకూటమిని మరో ఐదేళ్ల పాటు అధికారానికి దూరం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా రాహుల్ గాంధీ సభలకు పెద్దగా జనం కూడా రాలేదు. 31 ఏళ్ల తేజస్వీ యాదవ్ కు ఏ సభలో చూసినా భారీగా స్పందన కనిపించింది. యువ నాయకుడైన ఆయన వైపే ప్రజలు మొగ్గు చూపారని క్లియర్ గా ఈ ఎన్నికల రిజల్ట్ చెబుతోంది. వాస్తవానికి ఆర్జేడీ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది.
లెఫ్ట్ పార్టీలకు లైఫ్
ఈ ఎన్నికలు దేశ వ్యాప్తంగా బలహీనమైపోతున్న లెఫ్ట్ పార్టీలకు లైఫ్ లైన్ గా నిలిచాయి. అనూహ్యంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో సమానంగా సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీతో కలిసి మహాకూటమిలో భాగంగా బరిలోకి దిగిన సీపీఎం, సీపీఐ,
సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్) మూడు కలిసి 15కు పైగా స్థానాల్లో విజయం సాధించాయి. 2015 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి మూడు చోట్ల మాత్రమే విజయం సాధించాయి. అయితే ఈ సారి సీపీఎం 2, సీపీఐ 2, సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్) 12 చోట్ల గెలిచాయి. ఈ పార్టీలు మూడింటికీ కలిపి తేజస్వీ కేటాయించిన సీట్లు 29 మాత్రమే. అయినా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కు దీటుగా సీట్లు గెలుచుకుని లెఫ్ట్ పార్టీలు మహా కూటమి బలం పెంచడంలో ముందున్నాయి. ఈ ఎన్నికల్లో యువత, స్టూడెంట్ లీడర్స్, రైతు ఉద్యమాల్లో పాల్గొన్న వారికే సీట్లు ఇచ్చి సక్సెస్ అయ్యాయి. పైగా వామపక్ష పార్టీలు పోటీ చేసిన చోట్ల కూటమిలోని మిగతా పార్టీల ఓట్ ట్రాన్స్ ఫర్ బాగా జరిగింది.
ఓట్లు చీల్చిన చిరాగ్ పాశ్వాన్..
బీహార్ ఎన్నికల ప్రకటనకు ముందు వరకూ ఎన్డీఏ కూటమిలో ఉన్న లోక్ జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సడన్ గా ఒంటరి పోరాటానికి దిగారు. నితీశ్ కుమార్ పై యుద్ధం ప్రకటించారు. నితీశ్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారం నుంచి ఆయన్ను దూరం చేయడమే తన లక్ష్యమంటూ ప్రకటించారు. అయితే తాను బీజేపీకి మాత్రం దూరంగా లేనని, మోడీ తనకు గురువు లాంటి వారని చెప్పారు. ఆయన పార్టీ అభ్యర్థులను కేవలం నితీశ్ కుమార్ పార్టీ క్యాండిడేట్లపై మాత్రమే పోటీకి పెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం చిరాగ్ క్యాండిడేట్లను పెట్టలేదు. తన యుద్ధం నితీశ్ ను అధికారంలో నుంచి దించడం కోసమేనని, అధికారంలోకి వచ్చేది బీజేపీ – ఎల్జేపీ కూటమే అని ప్రచారంలో బలంగా చెబుతూ వచ్చారు. అయితే ఆయన అనుకున్నట్లు ఎల్జేపీకి సీట్లు రాలేదు. ఎల్జేపీ ఒక్క సీటుకే పరిమితం అయినా నితీశ్ పై దెబ్బ కొట్టాలన్న లక్ష్యం మాత్రం నెరవేరినట్లుగా కనిపిస్తోంది. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం వెనుక కూడా చిరాగ్ రోల్ ఉంది. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు పూర్తిగా ప్రతిపక్షాల వైపు వెళ్లకుండా చిరాగ్ పార్టీ కొంతమేర చీల్చింది.
For More News..