
ఇంటర్‌తో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నావల్ అకాడమీల్లో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టా పొందే అద్భుత అవకాశం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) నోటిఫికేషన్‌తో కలగనుంది. 2023 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 2 జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, 113వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో అడ్మిషన్స్ కల్పిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగం ఇస్తారు.
ఆర్మీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బీఎస్సీ, బీఎస్సీ(కంప్యూటర్), బీఏ కోర్సుల్లో ఏదైనా చదవొచ్చు. నేవీకి ఎంపికైనవారు బీటెక్, ఎయిర్‌ఫోర్స్‌కు సెలెక్టయినవారు బీఎస్సీ లేదా బీటెక్ చదువుతారు. కోర్సు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినవారికి తర్వాతి దశలో ట్రైనింగ్ ఉంటుంది. మంచి వేతనాలు పొందడమే కాక సమాజంలో ఉన్నత హోదా, దేశానికి సేవ చేసే సువర్ణావకాశం మీ సొంతం అవుతుంది.
ఖాళీలు: మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌ఏ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
దరఖాస్తులు: దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు ఉపసంహరించుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అభ్యర్థులు 2 జులై, 2004కి ముందు, 1 జులై, 2007కి తర్వాత పుట్టి ఉండకూడదు.
ఎగ్జామ్ ప్యాటర్న్: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి (సమయం రెండున్నర గంటలు). ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం చొప్పున నెగెటివ్ మార్కు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 16న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.upsconline.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్
సీడీఎస్ ఎగ్జామ్
ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సుల్లో ఉన్నతమైన ఉద్యోగం సాధించడానికి యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ) నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తిచేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు ఈ పరీక్షకు పోటీ పడవచ్చు.
ఖాళీలు: మొత్తం 341 ఖాళీల్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్- 100, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 22, ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్- 170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్- 17 పోస్టులు ఉన్నాయి.
అర్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఏయిర్‌ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి. పరీక్ష ఏప్రిల్ 16న నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు www.upsconline.nic.in ఆన్‌లైన్‌లో సంప్రదించాలి.
ట్రైనింగ్
తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను దెహ్రాదూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.