
మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. పెనువిధ్వంసంతో రెండు దేశాల ప్రజలు గజగజవణికిపోయారు. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. మయన్మార్, థాయిలాండ్ లో మృతిచెందిన వారి సంఖ్య 16వందలకు చేరింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
భూకంపంతో అతలాకుతలం అయిన మయన్మార్, థాయిలాండ్ లకు భారత్ సాయం ప్రకటించింది. ఆపరేషన్ బ్రహ్మపేరుతో మూడు స్పెషల్ విమానాల్లో సహాయక సామాగ్రిని తరలించింది. యూపీలోని గజియాబాద్ ఇండస్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్ కు 15టన్నుల సహాయ మెటీరియల్ ను పంపింది. విమానాల్లో ఆహారం,మెడిసిన్, జనరేటర్లు, టెంట్లు, బ్యాగులు, దుప్పట్లు, వాటర్ క్లీనింగ్ మెటీరియల్ పంపించారు. మయన్మార్, థాయిలాండ్ కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ శాఖ అధికారులు.
మరోవైపు మయన్మార్‌లోని నేపిడాలో NDRF బృందంతో మొదటి C130 విమానం దిగింది. ఈ బృందాన్ని భారత రాయబారి, మయన్మార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి మాంగ్ మాంగ్ లిన్ రిసీవ్ చేసుకున్నారు. భూకంపం తర్వాత విమానాశ్రయం పాక్షికంగా పనిచేయకపోయినా రాజధానికి రెస్క్యూ సిబ్బందిని పంపిన మొదటి దేశం భారతదేశం. NDRF బృందం రేపు తెల్లవారుజామున మండలేకు బయలుదేరుతుంది, కార్యకలాపాల కోసం అక్కడికి చేరుకున్న మొదటి రెస్క్యూ బృందం ఇదే.
మయన్మార్‌లో భూకంపం కొనసాగుతున్నాఅంతర్యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది సైనికజుంటా. విపత్తు ఉన్నప్పటికీ ప్రభుత్వ దళాలు మిలీషియాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న మయన్మార్ సైనిక జుంటా..ప్రజాస్వామ్య అనుకూల సమూహాలతో అనచివేస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 3 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 20 మిలియన్ల మందికి సహాయం అవసరమని తెలిపింది.
దీనికి ప్రతిస్పందనగా, చైనా, రష్యా, భారతదేశం,మలేషియా వంటి దేశాలు సహాయం అందించడానికి హామీ ఇచ్చాయి. చైనా రెస్క్యూ బృందాలు పరికరాలను పంపగా, భారతదేశం 80 మంది సభ్యుల జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాన్ని వైద్య సదుపాయాలతో పాటు పంపింది. సహాయ చర్యల కోసం UN 5 మిలియన్లు డాలర్లు కేటాయించింది. దక్షిణ కొరియా,USతో సహా ఇతర దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి.
అయితే మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణ సహాయాన్ని సమర్థవంతంగా అందించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. శిథిలాల కింద ఇంకా తప్పిపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.