- సురక్షితంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు
ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో ఆకేరు వరద బీభత్సం సృష్టించింది. వరదలో 52 మంది చిక్కుకుపోగా... వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు రక్షించారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఆకేరు ఉధృత రూపం దాల్చడంతో రాకాసితండాలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆ వరదల్లో మొత్తం 52 మంది వరకు తండా వాసులు చిక్కుకున్నారు. అధికారులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు టీమ్ లుగా ఏర్పడి రక్షణ చర్యలు చేపట్టారు.
ఆకేరులో వరద ఉధృతంగా ఉండడంతో.. బోట్ల ద్వారా పక్కనే ఉన్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలకొయ్యలపాడు గ్రామానికి బాధితులను తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆపరేషన్ మొదలు పెట్టిన గంటన్నర సమయంలోనే 52 మంది వరద బాధితులను సేఫ్ గా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం మధ్యాహ్నం రాకాసి తండాను సందర్శించారు. సహాయ చర్యల్లో ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి, మండల అధికారులు తహశీల్దార్ రామకృష్ణ, ఎస్సై జగదీశ్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మంగీలాల్, కొప్పుల అశోక్, తదితరులు పాల్గొన్నారు