- లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించాలి
- ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి
- రివ్యూ మీటింగ్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
భద్రాచలం, వెలుగు: వరదలు తగ్గేంత వరకు జిల్లా ఆఫీసర్లు విశ్రమించొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఆదేశించారు. గోదావరి వంతెనపై నుంచి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి ఆర్డీవో ఆఫీసులో శుక్రవారం రివ్యూ నిర్వహించారు. ఆఫీసర్లు సమన్వయంతో అప్రమత్తంగా పని చేయాలని, ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లకుండా చూడాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు రహదారుల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. రాబోయే రెండు నెలలు ఇదే తరహాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని రెస్క్యూ టీంలను భద్రాద్రికి రప్పించాలని ఆదేశించారు.
ఎక్కడ గేట్లు ఎత్తినా గోదావరిలోకే వరద వస్తుందని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో ఎస్ఈని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్ ద్వారా సేవలు అందించేందుకు మూడు హెలిీప్యాడ్లు రెడీ చేయాలన్నారు. మీటింగ్‌లో ప్రత్యేకఅధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, అనుదీప్ దురిశెట్టి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ప్రియాంక అలా, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఏఎస్పీ పంకజ్పారితోష్, ప్రభుత్వ విప్రేగా కాంతారావు పాల్గొన్నారు.
మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్
రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే సీఎం కేసీఆర్హైదరాబాద్నుంచి మంత్రి పువ్వాడకు ఫోన్‌చేసి మాట్లాడారు. గోదావరి ఉధృతిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితి, ఏర్పాట్లపై రివ్యూ చేయాలని సీఎం ఆదేశించారు. ఉన్న రక్షణ, సహాయక చర్యలను వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దుమ్ముగూడెం వద్ద వరద ప్రవాహం ఉన్నా ఎక్కడా ఇబ్బంది కల్గలేదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి ఆహారం, తాగునీరు, వైద్యం అందిస్తున్నామని సీఎంకు వివరించారు.