మేడిగడ్డ నీటి లీకులతో డ్యామేజీలు..సరిగ్గా లేని ఎనర్జీ డిసిపేషన్

మేడిగడ్డ నీటి లీకులతో డ్యామేజీలు..సరిగ్గా లేని ఎనర్జీ  డిసిపేషన్

మేడిగడ్డ ఏడో బ్లాకుతో పాటు బ్యారేజీలోని మిగతా బ్లాకుల రాఫ్ట్​ల కింద గోతులు ఏర్పడినట్టు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో తేలిందని ఎన్​డీఎస్ఏ రిపోర్ట్ తేల్చింది. ఏడో బ్లాక్ కింద ఏర్పడింది భారీ గొయ్యి అని గ్రౌటింగ్ చేసి పూడ్చడం ద్వారా తేలిందని పేర్కొంది. బ్యారేజీ పరిస్థితులన్నీ ఒకేలా ఉన్నాయని, కనుక మిగతా బ్లాకుల్లోనూ ఏడో బ్లాక్​ కింద ఏర్పడినంత గోతులే ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసింది.

ఈ గోతుల వల్ల మిగతా బ్లాకుల్లోనూ డ్యామేజీలు ఏర్పడి అవి కుంగిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. బ్యారేజీలోని చాలా చోట్ల సీకెంట్ పైల్స్ కటాఫ్, రాఫ్ట్​కు మధ్య ఉన్న జాయింట్ డ్యామేజ్ అయ్యి డిస్​లొకేట్ అయ్యాయని పేర్కొంది. పైపింగ్ (నీటి లీకేజీలు)తో బ్యారేజీ ఎగువన పియర్ 20 సీకెంట్ పైల్ కటాఫ్, దిగువన పియర్ నంబర్ 17 కటాఫ్​లు డ్యామేజ్ అయ్యాయని తెలిపింది. కునక బ్యారేజీలోని మిగతా బ్లాకుల్లోని సీకెంట్ పైల్స్ కటాఫ్​లకూ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.

మేడిగడ్డ ఎనర్జీ డిసిపేషన్​ సరిగ్గా లేదు

మేడిగడ్డ నిర్మాణ సమయంలో సరైన ఎనర్జీ డిసిపేషన్ (ఎగువ నుంచి వరదను వదిలినప్పుడు ఆ ప్రవాహ వేగానికి ఏర్పడే శక్తి/పీడనాన్ని నియంత్రించే ఏర్పాట్లు) సరిగ్గా లేదని ఎన్​డీఎస్ఏ రిపోర్టు తేల్చింది. ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పుడున్న స్టిల్లింగ్ బేసిన్ (వరద వదిలినప్పుడు బ్యారేజీ దిగువన ఆ వరద దూకే స్థలం)కు అదనంగా మరో బేసిన్ లేదా చూట్ బ్లాకులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

 స్టిల్లింగ్ బేసిన్​కు ఎక్స్​టెన్షన్​ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. బ్యారేజీపై ఒత్తిడి, సీపేజీ, డీఫార్మేషన్, ఫెయిల్యూర్ పాయింట్లను తెలుసుకునేందుకు, బ్యారేజీ నిర్మాణ నాణ్యతను చెక్ చేసేందుకు ఎలిమెంట్ మోడలింగ్ స్టడీస్ చేయాలని సూచించింది. రాఫ్ట్​ల కింద గోతులు ఉంటే వాటిని పూడ్చాలని సిఫార్సు చేసింది. బ్యారేజీ వద్ద అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని ఎన్​డీఎస్ఏ స్పష్టం చేసింది. 

బ్యారేజీ నుంచి వరదను రిలీజ్ చేసేటప్పుడు బ్యారేజీ, అక్కడి నేల, నీటి పీడనాలను లెక్కించేందుకు ఒక్కో గేటు వద్ద మూడు చొప్పున పీజో మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఒక్కో గేటుకు ఎగువన, మధ్యలో, దిగువన వాటిని ఏర్పాటు చేయాలని, అలా బ్యారేజీలోని అన్ని గేట్ల వద్ద వాటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రతి పరికరం ఇచ్చే డేటాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యారేజీపై నిత్యం నిఘా ఉంచాలని సూచించింది.