- వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు
- డిజైన్ ఫ్లడ్ ఎంత.. ఆ రోజు వచ్చిన వరదెంత అడిగిన ఎన్డీఎస్ఏ
హైదరాబాద్, వెలుగు: పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆరా తీసింది. ప్రాజెక్టుకు జరిగిన ప్రమాదంపై పూర్తి స్థాయి రిపోర్టులు అధికారుల నుంచి ఎన్డీఎస్ఏ కోరినట్టు తెలిసింది. జులై 18న భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద పొంగి పొర్లిన సంగతి తెలిసిందే. ఆ వరదను తట్టుకోలేక ప్రాజెక్టు కరకట్ట తెగి కింద ఉన్న ఊర్లు మునిగాయి. దీని ప్రభావంతో రూ.150 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాలు వేశారు.
అయితే, వరద అంతలా వస్తున్నా ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారని ఇరిగేషన్ అధికారులను ఎన్డీఎస్ఏ ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ సమయంలో ఎంత వరద వచ్చింది? ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యం ఎంత? డిజైన్ ఫ్లడ్ ఎంత మేర ఉన్నది? అన్న విషయాలపై రిపోర్ట్ ఇవ్వాలని ఎన్డీఎస్ఏ అడిగినట్టు చెబుతున్నారు. అంతేగాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంత నమోదవుతుంది? ప్రాజెక్ట్ కరకట్ట తెగిన రోజు ఎంత వర్షం పడింది వంటి వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలిసింది. అంతేగాకుండా మీడియం, మైనర్ ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌పైనా ఆరా తీసినట్టు సమాచారం.
ప్రాజెక్ట్ మెయింటెనెన్స్‌పై ఫీల్డ్ ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుకు చివరిసారిగా చేసిన మెయింటెనెన్స్ పనులపైనా ఆరా తీసినట్టుగా చెబుతున్నారు. ఆయా వివరాలను వీలైనంత త్వరగా ఎన్డీఎస్ఏకి అందించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అక్కడ డిజైన్ ఫ్లడ్ లెక్కలతో పాటు.. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి వచ్చిన ఫ్లడ్ వివరాలను అధికారులు వెలికి తీస్తున్నారు. ఆ ప్రాజెక్టు నుంచి 40 వేల క్యూసెక్కుల ఫ్లడ్‌ను డిశ్చార్జ్ చేసేలా డిజైన్ చేశారని అధికారులు అంటున్నారు. అయితే, గండి పడిన రోజు అంతకు రెట్టింపు వరద వచ్చిందని, అందుకే ప్రాజెక్ట్ కరకట్ట బ్రీచ్ అయి ఉంటుందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు