మేడిగడ్డ ఏడో బ్లాక్ కూల్చాల్సిందే!..రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు

మేడిగడ్డ ఏడో బ్లాక్ కూల్చాల్సిందే!..రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు
  • తుది నివేదికలో పేర్కొన్న ఎన్డీఎస్ఏ! 
  • రిపేర్లు చేసినా ఎన్నాళ్లుంటుందనే గ్యారంటీ లేదు
  • మళ్లీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే 
  • డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెల్లడి 
  • రెండు వారాల్లో సర్కార్​కు నివేదిక అందే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్​ను కూల్చి మళ్లీ కట్టాల్సిందేనని ఇప్పటికే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొందరు చెప్పారు. ఇప్పుడు నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కూడా అదే అభిప్రాయానికి వచ్చిందని తెలిసింది. ఏడో బ్లాక్​ను పూర్తిగా కూల్చేసి, కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తన తుది నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. ఏడో బ్లాక్ ​కింద భారీ అగాధం ఉన్నదని, దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్​తో పూడ్చారని.. ఈ బ్లాక్​కు రిపేర్లు చేసినా ఎన్నాళ్లు పటిష్టంగా ఉంటుందన్నది చెప్పలేమని రిపోర్టులో వెల్లడించినట్టు తెలిసింది. కొద్ది వరదకే ఏడో బ్లాక్​ కుంగిందని, భవిష్యత్తులో భారీ వరద వస్తే అది తట్టుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొన్నట్టు సమాచారం. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని, ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయని రిపోర్టులో కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. బ్యారేజీ సైట్​లో టెస్టులు చేశాక డిజైన్లను ఫైనల్​ చేయాల్సి ఉన్నా.. డిజైన్లు, టెస్టులు ప్యారలల్​గా చేశారని పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆ టెస్టులు కూడా అరకొరగానే చేశారని.. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాకులు, ఆప్రాన్ల వంటి ప్రొటెక్షన్​ వర్క్స్​సరిగ్గా లేవని ఆక్షేపించినట్టు తెలుస్తున్నది. జియోఫిజికల్, జియోటెక్నికల్​ టెస్టులను సరిగా నిర్వహించకుండానే బ్యారేజీకి డిజైన్లను ఖరారు చేశారని పేర్కొన్నట్టు తెలిసింది. బ్యారేజీ కుంగిన తర్వాత అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలని చెప్పినా సరిగా చేయలేదని, గ్రౌటింగ్ ​చేసి అక్కడున్న ఎవిడెన్స్​ను తుడిచిపెట్టారని వెల్లడించినట్టు సమాచారం. బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​నూ పట్టించుకోలేదని.. ఎప్పటికప్పుడు మానిటర్ ​చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొన్నట్టు తెలిసింది.  

రెండు వారాల్లో రిపోర్ట్.. ​

రిపోర్టును కొద్ది రోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డీఎస్ఏ సమర్పించింది. ఇటీవల సీతారామ ప్రాజె క్టుపై జరిగిన టెక్నికల్​అప్రైజల్ కమిటీ (టీఏసీ) మీటింగ్​లో ఈ రిపోర్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఆ నివేదికను చూపించే సీతారామ డిజైన్లపై మరోసారి రివ్యూ చేయించుకోవాలని అధికారులకు కేంద్రం సూచించిందని సమాచారం. కాగా, ఎన్డీఎస్ఏ ఫైనల్​ రిపోర్టును కేంద్ర సర్కార్ మరో రెండు వారాల్లో రాష్ట్ర సర్కార్​కు అందజేయనున్నట్టు తెలిసింది. ఈ రిపోర్టు కోసమే కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​కూడా వేచి చూస్తున్నది. ఆ రిపోర్టు ప్రకారం కమిషన్ ​చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.