
- సీఎస్‌కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ
- ఆ బ్లాక్ రిపేర్లు చేయలేనంతగా దెబ్బతిన్నది
- దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికే ప్రమాదం
- మిగతా బ్లాకుల కింద కూడా భారీ గోతులు
- ఆయా బ్లాకుల్లోని పియర్లు కుంగే ప్రమాదం.. సీకెంట్ పైల్స్ సైతం కుంగే ముప్పు
- మొత్తం బ్యారేజీకీ మరోసారి టెస్టులు చేయాల్సిందే
- బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రీహాబిలిటేషన్ డిజైన్లను రూపొందించాలి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సు చేసింది. రిపేర్లు చేయలేనంతగా ఏడో బ్లాక్ డ్యామేజ్ అయిందని, బ్లాక్‌లోని రాఫ్ట్, పియర్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల అవి పూర్తిగా డిస్లొకేట్ అయ్యాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఆ బ్లాక్‌ను సురక్షితంగా అక్కడి నుంచి తొలగించాలని లేదంటే అందుబాటులో ఉన్న సాంకేతికతలను వాడి ఆ బ్లాక్‌ను స్థిరీకరించాలని సూచించింది. అలా చేసే క్రమంలో ఏడో బ్లాక్‌కు పక్కన ఉన్న బ్లాకులు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టును విడుదల చేసింది.
ఆ రిపోర్టును చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి పంపిన ఎన్డీఎస్ఏ.. రిపోర్టులోని అంశాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏడో బ్లాక్‌కు జరిగిన ప్రమాదంతో మేడిగడ్డ బ్యారేజీ మొత్తానికే ప్రమాదం ఏర్పడినట్టయిందని, బ్యారేజీ సురక్షితంగా ఉండాలంటే రీహాబిలిటేషన్ డిజైన్ (బ్యారేజీ నిర్మాణాన్ని పటిష్ఠపరిచేలా చర్యలు తీసుకోవడం)పై ఆలోచన చేయాలని సూచించింది.
మేడిగడ్డ బ్యారేజీ కింద ఏర్పడిన గొయ్యి, సీపేజీలు, డిజైన్లు, నిర్మాణ లోపాలతో మొత్తం బ్యారేజీకే ప్రమాదం ఏర్పడిందని పేర్కొంది. ఫలితంగా ఒక్క ఏడో బ్లాకే కాకుండా బ్యారేజీలోని అన్ని బ్లాకుల్లోనూ అలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డే కాకుండా ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మూడు బ్యారేజీలపై మళ్లీ అన్ని టెస్టులను చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఇంజనీరింగ్ విలువలను పాటిస్తూ ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఇన్వెస్టిగేషన్స్, స్టడీస్‌ను చేయాలని సూచించింది. ఇన్వెస్టిగేషన్లు, రీహాబిలిటేషన్ డిజైన్ల కోసం దేశంలోని అత్యున్నతమైన రీసెర్చ్ స్టేషన్లు, డిపార్ట్మెంట్ల సేవలను వినియోగించుకోవాలని పేర్కొంది. బ్యారేజీల్లో డిజైన్ల లోపాలు స్పష్టంగా ఉన్నందున.. రీహాబిలిటేషన్ డిజైన్లపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) క్లియరెన్సులు తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది.
ఏడో బ్లాక్‌ను సేఫ్‌గా తొలగించడం సవాలే
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ రాఫ్ట్ కింద భారీ గోతులు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా రాఫ్ట్‌కు భారీ క్రాకులు ఏర్పడి కిందకు కుంగాయని పేర్కొంది. దానికే జాయింట్ చేసిన పియర్లకు కూడా పెద్ద పెద్ద క్రాకులు వచ్చి పక్కకు ఒరిగి భూమిలోపలికి కుంగాయని తెలిపింది.
‘‘ఏడో బ్లాక్‌లో 11వ నంబర్ నుంచి 22వ నంబర్ వరకు పియర్లున్నాయి. అందులో 16వ నంబర్ నుంచి 21వ నంబర్ పియర్ల వరకు వివిధ కోణాల్లో పక్కకు ఒరిగి.. వివిధ లోతులకు కుంగిపోయాయి. 20వ పియర్‌కు డ్యామేజ్ జరిగింది. ఆ ఒక్క పియరే 1.2 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు కుంగిపోయింది.
ఆ పియర్‌కు గేట్ల వద్ద 70 మిల్లీమీటర్ల మేర క్రాకులురాగా.. పియర్‌కు ఎగువన 300 మిల్లీమీటర్ల మేర పగుళ్లు వచ్చాయి. దీంతో అక్కడ బ్యారేజీ కిందకు కుంగిపోయింది. మిగతా పియర్లలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. ఏడో బ్లాక్‌ను సేఫ్‌గా బ్యారేజ్ నుంచి తొలగించడం ప్రస్తుతం సవాల్‌తో కూడుకున్నదే. అలా తొలగించేటప్పుడు పక్కన ఉన్న బ్లాకులకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది’’ అని స్పష్టం చేసింది.
నీటి లీకులతో డ్యామేజీలు
మేడిగడ్డ ఏడో బ్లాకుతో పాటు బ్యారేజీలోని మిగతా బ్లాకుల రాఫ్ట్‌ల కింద గోతులు ఏర్పడినట్టు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో తేలిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చింది. ఏడో బ్లాక్ కింద ఏర్పడింది భారీ గొయ్యి అని గ్రౌటింగ్ చేసి పూడ్చడం ద్వారా తేలిందని పేర్కొంది. బ్యారేజీ పరిస్థితులన్నీ ఒకేలా ఉన్నాయని, కనుక మిగతా బ్లాకుల్లోనూ ఏడో బ్లాక్ కింద ఏర్పడినంత గోతులే ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసింది.
ఈ గోతుల వల్ల మిగతా బ్లాకుల్లోనూ డ్యామేజీలు ఏర్పడి అవి కుంగిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. బ్యారేజీలోని చాలా చోట్ల సీకెంట్ పైల్స్ కటాఫ్, రాఫ్ట్‌కు మధ్య ఉన్న జాయింట్ డ్యామేజ్ అయ్యి డిస్లొకేట్ అయ్యాయని పేర్కొంది. పైపింగ్ (నీటి లీకేజీలు)తో బ్యారేజీ ఎగువన పియర్ 20 సీకెంట్ పైల్ కటాఫ్, దిగువన పియర్ నంబర్ 17 కటాఫ్‌లు డ్యామేజ్ అయ్యాయని తెలిపింది. కునక బ్యారేజీలోని మిగతా బ్లాకుల్లోని సీకెంట్ పైల్స్ కటాఫ్లకూ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.
మేడిగడ్డ ఎనర్జీ డిసిపేషన్ సరిగ్గా లేదు
మేడిగడ్డ నిర్మాణ సమయంలో సరైన ఎనర్జీ డిసిపేషన్ (ఎగువ నుంచి వరదను వదిలినప్పుడు ఆ ప్రవాహ వేగానికి ఏర్పడే శక్తి/పీడనాన్ని నియంత్రించే ఏర్పాట్లు) సరిగ్గా లేదని ఎన్డీఎస్ఏ రిపోర్టు తేల్చింది. ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పుడున్న స్టిల్లింగ్ బేసిన్ (వరద వదిలినప్పుడు బ్యారేజీ దిగువన ఆ వరద దూకే స్థలం)కు అదనంగా మరో బేసిన్ లేదా చూట్ బ్లాకులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
స్టిల్లింగ్ బేసిన్‌కు ఎక్స్‌టెన్షన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. బ్యారేజీపై ఒత్తిడి, సీపేజీ, డీఫార్మేషన్, ఫెయిల్యూర్ పాయింట్లను తెలుసుకునేందుకు, బ్యారేజీ నిర్మాణ నాణ్యతను చెక్ చేసేందుకు ఎలిమెంట్ మోడలింగ్ స్టడీస్ చేయాలని సూచించింది. రాఫ్ట్‌ల కింద గోతులు ఉంటే వాటిని పూడ్చాలని సిఫార్సు చేసింది. బ్యారేజీ వద్ద అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది.
బ్యారేజీ నుంచి వరదను రిలీజ్ చేసేటప్పుడు బ్యారేజీ, అక్కడి నేల, నీటి పీడనాలను లెక్కించేందుకు ఒక్కో గేటు వద్ద మూడు చొప్పున పీజో మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఒక్కో గేటుకు ఎగువన, మధ్యలో, దిగువన వాటిని ఏర్పాటు చేయాలని, అలా బ్యారేజీలోని అన్ని గేట్ల వద్ద వాటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రతి పరికరం ఇచ్చే డేటాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యారేజీపై నిత్యం నిఘా ఉంచాలని సూచించింది.
మేడిగడ్డ డిజైన్లకు అనుమతుల్లేవు..
మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు, క్లియరెన్సులు లేవని ఎన్డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై సీడీవో ఇచ్చిన పలు డ్రాయింగ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయనేలేదని, అది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది.
అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించేటప్పుడు కనీస విలువలను పాటించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్లపై సీడీవోకు ఎలాంటి సంబంధం లేదని తమకు చెప్పారని, కానీ, ఎప్పటికప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్పై సీడీవో అధికారులు ఆన్సైట్లో కోఆర్డినేషన్ చేసుకున్నారని స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్లోని క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను స్వతంత్ర విభాగంగా మార్చాలని సూచించింది. సిబ్బందిని ఎక్కువగా నియమించాలని పేర్కొంది. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేసింది.
ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అండ్ ఎం మాన్యువల్‌ను సిద్ధం చేయాలని పేర్కొంది. ఇప్పటి దాకా మెయింటెనెన్స్ ప్రొటోకాల్ లేకపోవడమూ బ్యారేజీ కుంగడానికి కారణమైందని పేర్కొంది. అత్యంత కీలకమైన మోడల్ స్టడీస్‌ను నిర్వహించే ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని ఆధునికీకరించాలని సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా డ్యాములు, బ్యారేజీల నిఘా కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్పష్టం చేసింది.
డ్రోన్లతో సమగ్రంగా మ్యాపింగ్ చేయాలి
రీహాబిలిటేషన్ డిజైన్లలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ మొత్తానికీ మళ్లీ మొదటి నుంచి డిజైన్ స్టడీస్, టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్‌ను నిర్వహించాల్సిందేనని ఎన్డీఎస్ఏ నివేదిక తేల్చి చెప్పింది. బ్యారేజీ డిజైన్లలో లోపాలు, సమస్యలను గుర్తించాలని స్పష్టం చేసింది. జియోటెక్నికల్, హైడ్రలాజికల్, హైడ్రాలిక్, నిర్మాణ సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పున:సమీక్ష చేయాలని సూచించింది.
బ్యారేజీపై మరోసారి ఆప్టికల్ సర్వే చేయించాలని సూచించింది. ‘‘శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా బ్యారేజీ మొత్తాన్ని పరిశీలించి ఎక్కడైనా నీటి ప్రవాహంలో లోపాలున్నాయో గుర్తించాలి. ఎక్కడైనా ఇసుక పేరుకుపోయిందేమో చూడాలి. బ్యారేజీల్లో పగుళ్ల మ్యాపింగ్‌కు నిర్మాణ సంస్థ డ్రోన్లతో సరిగ్గా స్టడీ చేయలేదు. నిర్మాణ సంస్థ చేసిన స్టడీ డేటా సరిపోలేదు. మిగతా బ్లాకుల్లో ఉన్న పగుళ్లను మరోసారి డ్రోన్లతో సమగ్రంగా మ్యాపింగ్ చేయించాలి.
రీహాబిలిటేషన్ డిజైన్లకు సంబంధించి జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను సమగ్రంగా నిర్వహించాలి. సీకెంట్ పైల్స్ కటాఫ్స్ పటిష్టతను, బ్యారేజీ అన్ని బ్లాకుల్లోని రాఫ్టుల కింద గోతులేమైనా ఉన్నాయేమో తెలుసుకు నేందుకు జియోఫిజికల్ టెస్టులను చేయాలి. బ్యారేజీ కాంక్రీట్ నిర్మాణాల పటిష్టతనూ చెక్ చేయాలి’’ అని తేల్చి చెప్పింది.
గ్రౌటింగ్ చేసి ఎవిడెన్స్‌ను నాశనం చేశారు
మేడిగడ్డ ఏడో బ్లాక్ కింద భారీ గొయ్యి కింద గ్రౌటింగ్ చేసి అక్కడున్న పరిస్థితులను తెలుసుకోలేకుండా చేశారని ఎన్డీఎస్ఏ రిపోర్టులో పేర్కొంది. తాము చెప్పేదాకా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్నా కూడా వినిపించుకోలేదని, బ్యారేజీ పరిస్థితులను తెలుసుకోవాలంటే అక్కడ ఇంతకుముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడం అత్యంత కీలకమని, కానీ, గ్రౌటింగ్ ద్వారా ఆ కీలకమైన ఆధారాలను ధ్వంసం చేశారని ఆక్షేపించింది. అయితే, గ్రౌటింగ్ చేయడం ద్వారా భారీ వరద వచ్చినా ఏడో బ్లాక్ నిలవగలిగిందని తెలిపింది.
అన్నారం, సుందిళ్లదీ అదే పరిస్థితి
మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితే అన్నారం, సుందిళ్లలోనూ ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు తేల్చి చెప్పింది. అన్నారంలోని 35, 44, 28, 38 గేట్ల వద్ద భారీ సీపేజీ ఉందని, దాని కింద భారీ గోతులు ఉండడంతో పాలియురేథిన్ గ్రౌటింగ్ చేశారని పేర్కొంది. అయితే, మిగతా బ్లాకులు, గేట్ల వద్ద కూడా గోతులు ఏర్పడి ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫలితంగా మిగతా చోట్ల కూడా సీపేజీలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుం దని ఆందోళన వ్యక్తం చేసింది.
సుందిళ్ల బ్యారేజీలోని 46, 52, 33, 50వ గేట్ల వద్ద సీపేజీలు ఏర్పడ్డాయని, ఈ బ్యారేజీలోని మిగతా బ్లాకుల కింద కూడా గోతులు ఉండే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీ తరహాలోనే ఈ రెండు బ్యారేజీలకూ రీహాబిలిటేషన్ డిజైన్లను ఇవ్వాలని, మేడిగడ్డకు చేసే టెస్టులు, ఇన్వెస్టిగేషన్ల న్నింటినీ చేయాలని స్పష్టం చేసింది.