NDTV వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ప్రమోటర్ సంస్థ అయిన ఆర్ఆర్ పీఆర్ (RRPR) హోల్డింగ్ కంపెనీ నుంచి వైదొలిగారు. గతంలో ఇచ్చిన రుణాన్ని RRPR ద్వారా వాటాలుగా మార్చుకోవడంతో NDTVలో 29.18శాతం వాటా అదానీ గ్రూపు వశమైంది. ఈ క్రమంలో ప్రమోటర్ గ్రూపు నుంచి ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ వైదొలిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి NDTV తెలిపింది. అయితే.. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ న్యూస్ చానల్ బోర్డులో మాత్రం కొనసాగనున్నారు. ఇద్దరికీ ఇప్పటికీ NDTVలో 32.26శాతం వాటా ఉంది. NDTV చైర్ పర్సన్ గా ప్రణయ్ రాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాధికా రాయ్ ప్రస్తుతం కొనసాగుతున్నారు.
మరోవైపు.. RRPR హోల్డింగ్ కంపెనీకి సుదీప్తా భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నయ్య చెంగల్వారాయన్ డైరెక్టర్లుగా నియమితులైనట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి NDTV తెలిపింది.
ఇంకోవైపు.. ఓపెన్ ఆఫర్ పూర్తయితే.. NDTV లో యాజమాన్య హక్కులు అదానీ సంస్థకు దక్కనున్నాయి. అప్పుడు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లను బోర్డు నుంచి వైదొలగమని కోరే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) సంస్థ గతంలో NDTVకి రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని NDTVలో వాటాగా అదానీ గ్రూప్ మార్చుకుంది. దీనికి అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. దీంతో ఇప్పుడు 34 ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్డీటీవీ అదానీ సొంతమైంది. ఎన్డీటీవీలో మెజారిటీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్‌డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.
ప్రణయ్‌రాయ్ దంపతులు వైదొలగడంపై మంత్రి కేటీఆర్ స్పందన
ఎన్డీటీవీ నుంచి ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ వైదొలగడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.