
ముంబై: దేశ జనాభా 140 కోట్ల పైగానే ఉన్నా దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమే. వీళ్లు స్వేచ్ఛగా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు కేవలం 13–14 కోట్ల మందేనని పేర్కొంది. ఇది మెక్సికో జనాభాకు సమానమని నివేదిక తెలిపింది.
మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులని తెలిపింది. అంటే వీరు ఆచి, తూచి ఖర్చు చేసేవారని తెలిపింది. ఇప్పుడిప్పుడే డబ్బులు తీయడం మొదలు పెట్టారని పేర్కొంది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో ఇప్పుడున్న వినియోగదారులు ఆర్థికంగా మరింతగా వృద్ధి చెందుతున్నంతగా ఈ వర్గం సైజు మాత్రం విస్తరించడం లేదని తెలిపింది.
సంపన్నుల సంఖ్య పెరగట్లేదు. సంపన్నులే మరింత సంపన్నులుగా మారుతున్నారని పేర్కొంది. కొవిడ్ సంక్షోభం తర్వాత కాలంలో ధనవంతుల ఆస్తి మరింత పెరగగా.. పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ట్రెండ్ కరోనా సంక్షోభానికి ముందే ప్రారంభమైందని, దేశంలో ఆర్థిక అసమానత పెరుగుతూవస్తున్నాయని తెలిపింది. దేశ సంపదలో 57.7 శాతం కేవలం 10 శాతం మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
ALSO READ : నష్టాల్లో 83 శాతం చిన్న షేర్లు.. రోజుకు 25 వేల కోట్ల నష్టం.. ఈ షేర్లు కొన్నోళ్లకు రక్త కన్నీరే
హాట్ కేకుల్లా బ్రాండెడ్ వస్తువులు
సంపన్నుల స్వేచ్ఛగా ఖర్చు చేసుకోగలిగే వెసులుబాటు ఉండటంతో వారంతా బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన వాటిపైనే దృష్టి సారించారని దీంతో వాటి అమ్మకాలు ఊపందుకున్నాయని తెలిపింది. అత్యంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల్లో గృహాలు, ఐఫోన్ వంటి ప్రీమియం మొబైల్స్ విక్రయాల్లో అనూహ్య వృద్ధే ఇందుకు నిదర్శనం.
ALSO READ : EPFO వడ్డీరేటు 8.25శాతం..EPFO బోర్డు ఆమోదం
రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే అందుబాటు ధరలో లభించే గృహాల ప్రాజెక్టుల వాటా ఐదేళ్ల క్రితం 40% ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గిందని అంటోంది. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో మంచి అనుభూతిని పంచే ఖరీదైన సేవలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిందని తెలిపింది. కోల్డ్ ప్లే, ఎడ్ షీరన్ వంటి పాశ్చాత్య గాయకులు భారత్‌లో నిర్వహించిన లైవ్ షోల టిక్కెట్లు హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి.