
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలను వెల్లడించింది. మే 2022 నుంచి డిసెంబర్ 2024 వరకూ ప్రధాని మోదీ విదేశీ పర్యటనల నిమిత్తం 258 కోట్ల రూపాయలు ఖర్చయిందని కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో 2023 జూన్లో వెళ్లిన అమెరికా పర్యటనకు అత్యధికంగా 22 కోట్ల ఖర్చయినట్లు పేర్కొంది.
మే 2022 నుంచి డిసెంబర్ 2024 మధ్య ప్రధాని మోదీ మొత్తం 38 విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చినట్లు కేంద్రం తెలిపింది. గత మూడేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. మల్లిఖార్జున్ ఖర్గే ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పబిత్ర మార్గరెటా ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై వివరాలను వెల్లడించారు. ప్రధాని మోదీ ఏఏ దేశం వెళ్లినప్పుడు ఎంత ఖర్చయిందో కేంద్రం సవివరంగా డేటాను బయటపెట్టింది.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు:
* జూన్ 2023-అమెరికా- 22 కోట్ల 89 లక్షల 68వేల 509 రూపాయలు
* సెప్టెంబర్ 2024-అమెరికా- 15 కోట్ల 33 లక్షల 76 వేల 348 రూపాయలు
* మే 2022-జపాన్- 17 కోట్ల 19 లక్షల 33 వేల 356 రూపాయలు
* మే 2022-నేపాల్- 80 లక్షల 14 వందల 483 రూపాయలు
* 2024-పోలాండ్- 10 కోట్ల 10 లక్షల 18 వేల 686 రూపాయలు
* 2024-ఉక్రెయిన్- 2 కోట్ల 52 లక్షల 11 వందల 69 రూపాయలు
* 2024-రష్యా- 5 కోట్ల 34 లక్షల 71 వేల 726 రూపాయలు
*2024-ఇటలీ- 14 కోట్ల 36 లక్షల 55 వేల 289 రూపాయలు
*2024-బ్రెజిల్- 5 కోట్ల 51 లక్షల 86 వేల 592 రూపాయలు
* 2024-గయానా- 5 కోట్ల 45 లక్షల 91 వేల 495 రూపాయలు
ఈ దేశాలు కాక మే 2022 నుంచి డిసెంబర్ 2024 మధ్య కాలంలో డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, ఉజ్ బెకిస్తాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్ ఇతర దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. మోదీ 2019 నుంచి 2022 వరకు 21 విదేశీ ప్రయాణాలు చేశారని.. వీటికి గానూ రూ.22.76 కోట్లు ఖర్చు అయిందని 2023 ఫిబ్రవరిలో కేంద్రం రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.