ఔరంగజేబు సమాధి తొలగించాలని గొడవ.. మహారాష్ట్రలో ఉద్రిక్తత.. నాగ్పూర్లో కర్ఫ్యూ విధింపు

ఔరంగజేబు సమాధి తొలగించాలని గొడవ.. మహారాష్ట్రలో ఉద్రిక్తత.. నాగ్పూర్లో కర్ఫ్యూ విధింపు

నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శంభాజీ నగర్లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో నాగ్పూర్లో అల్లర్లు రేగాయి. హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు నాగ్పూర్లో కర్ఫ్యూ విధించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత తరహాలో ఔరంగజేబు సమాధిని కూడా కూల్చేస్తామని కొన్ని హిందూ సంఘాల ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేశారు. దీంతో.. ఔరంగజేబు సమాధి పోలీసులు భద్రత పెంచారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలని భజ్ రంగ్ దళ్ సభ్యులు సోమవారం మధ్యాహ్నం నాగ్పూర్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఔరంగజేబు సమాధిని తొలగించకపోతే బాబ్రీ మసీదు కూల్చివేత తరహా ఘటన మరోసారి పునరావృతమవుతుందని భజ్ రంగ్ దళ్ నేత నితిన్ మహజాన్ హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం నాగ్ పూర్ లో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కార్లను ధ్వంసం చేశారు. బస్సులకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నాగ్ పూర్ లోని చిట్నిస్ పార్క్, మహల్ ప్రాంతంలోని ఇళ్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 30 మంది పోలీసులు గాయపడ్డారు.

సోమవారం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు కొందరు శివ్ జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఔరంజేబు సమాధి తొలగించాలని 40 నుంచి 50 మందికి పైగా వీహెచ్పీ, భజ్ రంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను కాల్చేస్తున్నారనే పుకార్లకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పుకార్ల కారణంగా సోమవారం రాత్రి 5 నుంచి 7 గంటల సమయంలో కొందరు ముస్లిం యువకులు రోడ్డెక్కి నినాదాలు చేశారు. ఆ తర్వాత కొంత సమయానికే ఇరు వర్గాలకు చెందిన వేల మంది యువకులు రోడ్డెక్కి రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. నాగ్ పూర్ లో ప్రస్తుతం పోలీసులు విధించిన కర్ఫ్యూ కారణంగా ఎమర్జెన్సీ సేవల మినహా అన్నీ బంద్ అయ్యాయి.