ఏపీలో అంతుచిక్కని వ్యాధితో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది.. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో పౌల్ట్రీ పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడింది. అంతుచిక్కని వైరస్ బారిన పడి నెలరోజుల్లోనే సుమారు 4 లక్షలకు పైగా కోళ్లు మరణించినట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే లక్షల్లో కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ వల్ల సగటున కోడికి రూ.300 వరకు నష్టం వస్తోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని అంటున్నారు అధికారులు.
అంతవరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు అప్పటికప్పుడే కుప్పకూలి చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ల మరణాలు సాధారణమే అయినప్పటికీ ఈ రేంజ్ లో మరణాలు సంభవించటం పౌల్ట్రీ రైతులను కలవరపెడుతోంది.. అంతుచిక్కని వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
రోజురోజుకీ కోళ్ల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వినియోగదారులు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. చికెన్ కు గిరాకీ తగ్గటంతో అటు వ్యాపారులు, అంతుచిక్కని వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పౌల్ట్రీ రైతులు సతమతం అవుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టి పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.