న్యూఢిల్లీ: జంక్ ఫుడ్ (ప్యాకేజ్డ్ ఫుడ్) సేల్స్ పెరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నా, జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా జరుగుతున్నాయి. యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్‌ఐ) రిపోర్ట్ ప్రకారం, టాప్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల సేల్స్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాటా పెరుగుతోంది. దేశంలో టాప్ 20 ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అమ్ముతున్న 1,901 రకాల ప్రొడక్ట్‌లలో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. మొత్తం ఏడు కేటగిరీలలో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్‌ఐ వెల్లడించింది.
ప్రొడక్ట్ పూర్తి వివరాలు, గవర్నెన్స్, మార్కెటింగ్, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్‌ఐ కంపెనీలకు ‘హెల్తీనెస్’ స్కోర్స్‌ను ఇచ్చింది. ఇందులో ఐటీసీ టాప్‌లో ఉందని పేర్కొంది. ఈ కంపెనీ తర్వాత హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్‌లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్ పొందిన ప్రొడక్ట్‌లను ‘హెల్తీ ప్రొడక్ట్‌లు’ గా ఏటీఎన్‌ఐ వర్గీకరించింది. ఇటువంటి ప్రొడక్ట్‌లలో పండ్లు, కూరగాయలు, ఫైబర్, కంట్రోలింగ్ స్థాయిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉన్నాయి.
మెజార్టీ కంపెనీల రేటింగ్ తక్కువే..
చాలా కంపెనీల ప్రొడక్ట్‌ల రేటింగ్ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్‌ఏ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ 20 ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్‌ల యావరేజ్ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్‌ల రేటింగ్ ఐదింటిలో 1.5 గా ఉందని, కేవలం 12 శాతం ప్రొడక్ట్‌లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ‘ ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయి. డైట్, న్యూట్రిషన్, హెల్త్ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఏం జరగడం లేదు? అనే విషయాలను ఏటీఎన్ఐ ఇండెక్స్ తెలియజేస్తోంది’ అని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఎస్ గారెట్ అన్నారు.
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు, షుగర్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వాటాను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్‌లను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీలు తెస్తున్నాయి. కానీ, మరోవైపు సమస్యలు కూడా లేకపోలేదని ఏటీఎన్‌ఐ రిపోర్ట్ వెల్లడించింది. హెల్తీ ఫుడ్ అంటే ఏంటో తెలియజేయడానికి స్టాండర్డ్ డెఫినిషన్ ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు తమకు తాముగా నిర్ణయించుకుంటున్నాయని, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందడం లేదని పేర్కొంది.