ఏపీలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 7,998 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 7,998 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు 8 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 58,052 శాంపిల్స్ టెస్ట్ చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే రోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. ఈ ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనా బారినపడిన వారి సంఖ్య 72,711కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 37,555 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 34,272 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కొద్ది రోజులుగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరుగడం ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 61 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. తూర్పు గోదావరి జిల్లాలో 14 మంది, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, చిత్తూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 884కి చేరింది.

జిల్లా వారీగా కరోోనా కేసుల వివరాలు: