
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ పీజీ అన్ని క్యాటగిరీల్లో కటాఫ్‌ను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్‌బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ పూర్తయినా ఇంకా 8000 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీట్లు వృథా కాకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్ రౌండ్‌లో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరిన్నివార్తల కోసం...