Virat Kohli: మొన్న మెడ, ఇప్పుడు మోకాలు.. ఇదేనా ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అంటే..: కోహ్లీపై మాజీ క్రికెటర్ సెటైర్లు

Virat Kohli: మొన్న మెడ, ఇప్పుడు మోకాలు.. ఇదేనా ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అంటే..: కోహ్లీపై మాజీ క్రికెటర్ సెటైర్లు

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్తారు. ఈ భారత క్రికెటర్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అని కొందరంటే.. ప్రపంచంలోనే ఫిట్టెస్ట్‌ క్రికెటర్ అని మరికొందరు వర్ణిస్తారు. ఆహారం, వ్యాయామం అతనికి రెండు కళ్లు వంటివని.. జంక్‌ ఫుడ్‌ జోలికి అస్సలు వెళ్లడని, ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్‌ చేయకుండా కాలు బయట పెట్టడని చెప్తారు. ఇటువంటి వర్ణనలూ మరికొన్ని ఉన్నాయి. మరీ ఇంత క్రమశిక్షణతో మెలిగే కోహ్లీకి.. ఫిట్‌నెస్‌ సమస్య ఎందుకొచ్చిందన్నదే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్న. 

నాగ్‌పూర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగలేదు. విరాట్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ ప్రకటనపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. కోహ్లీ ఫిట్‌నెస్‌ మంత్రపై సెటైర్లు వేశారు. జనవరిలో మెడ నొప్పి అంటివి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి అంటివి.. ఇదేం ఫిట్‌నెస్‌.. అని నెట్టింట జోకులు పేల్చాడు. 

ALSO READ | SA20: ఆ ముగ్గురు భారత క్రికెటర్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడితే చూడాలని ఉంది: సౌతాఫ్రికా పేసర్

“జనవరిలో మెడ. ఫిబ్రవరిలో మోకాలు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కోహ్లీ క్రికెట్‌కు దూరమవ్వడం తరచుగా జరగదు. కటక్‌ మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడు..” అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు.

ఎదుటోళ్లపై కుళ్లు జోకులు

ఈ భారత మాజీ క్రికెటర్‌కు ఇతర ఆటగాళ్లపై జోకులు వేయడం పరిపాటి. తన ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి ట్వీట్లు వేస్తారో.. లేదా దీని వెనుక మరో ఉద్దేశ్యం ఉందో తెలియదు కానీ, అప్పుడప్పుడు ఇటువంటి సెటైరికల్ ట్వీట్లు వేస్తుంటారు. కోహ్లీపై ట్వీట్ వల్ల.. అతని అభిమానులు ఆకాష్ చోప్రాపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.