Health Tips: మెడనొప్పి.. వెన్ను నొప్పి వేధిస్తున్నాయా.. అయితే ఈ మసాజ్​ లు చేయండి

వెన్నునొప్పి, మెడనొప్పి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోవడం, మొబైల్, ల్యాప్టాప్ వాడటం వంటి అనేక కారణాలతో ఈ పెయిన్స్ వస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో నొప్పులు తగ్గితే పర్లేదు. కానీ, రోజుల తరబడి పెయిన్స్ వేధిస్తుంటే ఎలాంటా ట్రీట్​ మెంట్​  తీసుకోవాలి.. పెయిన్స్ తగ్గించే కొన్ని సులభమైన మసాజ్ ల గురించి తెలుసుకుందాం.  .. 

ఫిజియోథెరపీ, మసాజ్ వంటివి చేయించుకుంటే నొప్పులు తగ్గుతాయి.. మసాజ్ చేసుకోవడానికి అన్నిసార్లు నిపుణుల సాయమే అక్కర్లేదు. కొన్ని మసాజ్ లు సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉండే కొన్ని మసాజ్ లు చేయడం ఎలాగో తెలుసుకుంటే మీ నొప్పుల్ని మీరే తగ్గించుకోవచ్చు. అయితే వీటిని అవసరమైనప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. విశ్రాంతిగా అవసరమైన పొజిషన్ లో కూర్చుని, గట్టిగా ఊపిరి తీసుకుంటూ మసాజ్ చేసుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పాదాలు...-చేతులు:  ప్రతి పెయిన్ ను తగ్గించేందుకు ఒక ఆక్యుప్రెజర్ పాయింట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ ప్రదేశంలో నొక్కడం, మసాజ్ చేయడం చేస్తే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కు సంబంధించి చాలా ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పాదాలు, చేతులు, పాదాల కింది భాగంలో బొటన, రెండో వేలుకు మధ్య ప్రదేశంలో ఉండే అక్యుప్రెజర్ పాయింట్లో నెమ్మదిగా నొక్కుతుండాలి. అరచేతికి సంబంధించి బొటనవేలి కింది భాగం, వేలు ప్రారంభమయ్యే ప్రదేశం, మణికట్టు భాగంలో కూడా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రదేశాల్లో నెమ్మదిగా నొక్కుతూ ఉంటే క్రమంగా నొప్పి తగ్గుతుంది.

టెన్నిస్ బాల్:  మార్కెట్లో దొరికే టెన్నిస్ బాల్ తో  మసాజ్ చేసుకోగలిగే...సాధారణంగా కండరాలు ఎక్కువ అలసటకుగురై, వాటిపై ఒత్తిడి పెరగడం వల్ల నొప్పి కలుగుతుంది. వాటికి విశ్రాంతినిచ్చి, ఒత్తిడి తగ్గించగలిగితే నొప్పి దూరమవుతుంది. దీనికోసం రెండు బాల్స్ ను తీసుకోవాలి.  నేలపై యోగా మ్యాట్ పరిచి, వెల్లకిలా పడుకుని, మోకాళ్లు మడవాలి. అరికాళ్లు నేలను తాకుతుండాలి. వీపును కొద్దిగా పైకి లేపి, భుజాలకు దగ్గరగా, వీపు కింది భాగంలో రెండు టెన్నిస్ బాల్స్ ఉంచాలి. వాటిపై క్రమంగా వీపుతో ఒత్తిడి పెంచుతూ, బాల్స్ ను ఇతర కండరాలకు తగిలేలా అటూఇటూ తిప్పాలి. వీపు కండరాలు అంతా తగిలేలా బాలు తిప్పగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది.. ప్రతి కండరంపై కనీసం ఒక నిమిషం ఒత్తిడి పడేలా చూడాలి.

హాట్ టవల్ మసాజ్ : మెడనొప్పి తగ్గేందుకు ఈ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒళ్లు కాపడం పెట్టడం లాంటిదే. ఒక సాఫ్ట్ టవల్, వేడి నీళ్లు కావాలంతే. టవలు కొద్దిగా మెలితిప్పి, వేడి నీటిలో ముంచాలి. టవల్ వేడెక్కాక, దాన్ని మెడపై వేసి రెండు చేతులతో అటూఇటూ సున్నితంగా లాగాలి. ఎక్కడ నొప్పి ఎక్కువగా ఉందో, అక్కడ టవల్ తో ఎక్కువగా ఒత్తిడి కలిగించాలి. ఇలా వేడి టవల్ తో ఎక్కువసార్లు చేసుకోగలిగితే మెడనొప్పి చాలా వరకు తగ్గుతుంది.

సింపుల్ మసాజ్: మెడనొప్పి తగ్గించేందుకు సాయపడే మరో సింపుల్ మసాజ్ ఇది. ఎడమచేతిని మెడపై ఉంచి, పైనుంచి కిందికి నొక్కుతూ రావాలి. ఇలా నొప్పి ఉన్న చోట, కాస్త రిలాక్స్డ్ గా అనిపించే వరకు చేస్తూనే ఉండాలి. నొప్పి ఉన్న ప్రతి చోటా కనీసం ముప్పై సెకండ్ల వరకు మసాజ్ చేయాలి. మెడ చుట్టూ ఉన్న కండరాలు కూడా రిలాక్స్ అయ్యేలా చేస్తే, నొప్పి చాలా వరకు తగ్గుతుంది. అయితే మెడపై మరీ ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా, సున్నితంగా నొక్కాలి.

హాట్ స్టోన్ మసాజ్: వేడినీటిలో ముంచిన లేదా కొద్దిగా వేడెక్కేలా చేసిన నునుపైన రాళ్లను వీపు, శరీరంలో నొప్పి ఉన్న ఇతర భాగాలపై ఉంచుతారు. ఈ వెచ్చదనం వల్ల కండరాలపై ఉన్న ఒత్తిడితగ్గి, అవి మృదువుగా తయారవుతాయి. ఈ తరహా మసాజ్ వల్ల కండరాల లోపలి భాగాలు కూడా రిలాక్స్ అవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నొప్పి ఉన్న చోట, కొద్దిగా వేడెక్కిన రాళ్లను కొద్దిసేపు ఉంచి, అటూఇటూ జరిపితే చాలు.

షియాట్పు మసాజ్ : ఇది ప్రాచీన చైనీస్, జపనీస్ మసాజ్ మెథడ్. దీనిని ఇంగ్లీషులో ఫింగర్ ప్రెజర్ అంటారు. అంటే వేళ్లతో ఒత్తిడి కలిగించి, నొప్పి తగ్గించడం. ఈ మసాజ్ చేసేవాళ్లు ఎక్కువగా బొటనవేలును ఉపయోగిస్తారు. మిగతావేళ్లను, అరచేతిని కూడా ఉపయోగించి కండరాలపై ఒత్తిడి పెంచి, నొప్పుల్ని తగ్గిస్తారు. నొప్పికి సంబంధించిన అక్యుప్రెజర్ పాయింట్లపై మసాజ్ చేసి, కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తారు. దీనివల్ల కండరాలు కొత్త శక్తిని పుంజుకుంటాయి.

ఆయుర్వేదిక్ మసాజ్: మన ప్రాచీన వైద్యవిధానాల్లో ఆయుర్వేదంఒకటి. ఈ పద్ధతిలో వివిధ వనమూలికల్నిఉపయోగించి తయారు చేసిన తైలాలను(ఆయిల్స్)ను ఉపయోగించి మసాజ్ చేస్తే, అవినొప్పిని తగ్గిస్తాయి. ఔషధాలు కలిగిన ఆయిల్స్ కణజాలలోపలికి చొచ్చుకెళ్లి, వాటిని రిపేర్ చేసి, విశ్రాంతినిస్తాయి. దీనివల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.