పదవీ విరమణ చేసిన తరువాత అంతకు ముందున్న అట్టహాసం ఉండదు. మంచి పనులు చేసిన అధికారులకు, గౌరవంగా చూసిన అధికారులకు ఆ గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. ప్రపంచంలోని చాలా దేశాధినేతలు పదవీ విరమణ చేసిన తరువాత మామూలు జీవితం గడుపుతున్నారు. మన దేశంలోని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ అట్టహాసం ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. సర్వీస్కమిషన్లో నాతోపాటు పనిచేసిన ఇద్దరు నాకో కథను షేర్చేశారు. దాని పేరు ‘ఫ్యూజ్డ్బల్బ్’ అది ఇంగ్లీష్ లో ఉంది. దాన్ని తెలుగులో కాస్త మెరుగుపరిచి ఓ వీడియో చేశాను. దాన్ని చూసిన కొంత మంది మిత్రులు, అందరూ ప్యూజ్డ్ బల్బులు కాదని అన్నారు. ఇదంతా ఎందుకు గుర్తుకొస్తుందంటే ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. కొంత మంది అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడానికి ముందే వారికి కావాల్సిన వాటి కన్నా ఎక్కువ సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి సౌకర్యాలు న్యాయమూర్తులకు కొంత మేర అవసరమేమో కానీ లీడర్లకు, అధికారులకు అవసరం లేదు. న్యాయమూర్తులకు కూడా అవసరానికి మించి ఏర్పాటు చేస్తే అది గౌరవంగా అనిపించదు.
ఏపీ ప్రభుత్వం జీవో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.14 వేలు, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించి 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి దగ్గర పనివాడిని, డ్రైవర్‌ను, సెక్యూరిటీ గార్డును, క్లర్క్‌ను పెట్టుకోవడానికి ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. 1500 కాల్స్వరకు ఉచిత టెలిఫోన్ సౌకర్యాన్నీ ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా 2016లో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అదే ఏడాది సుప్రీంకోర్టు కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. సీజేఐగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తుల పదేండ్ల ప్రయోజనాల కోసం ఈ నియమాలను ఏర్పాటు చేసింది. నియమం 3(బి) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి జీవితకాలంపాటు నెలకు రూ.25 వేలు చెల్లించాలి. ఇంటి దగ్గర సాయపడేందుకు ఓ వ్యక్తిని, డ్రైవర్‌ను, సెక్యూరిటీని పెట్టుకునేందుకు ఈ డబ్బును వాడుకోవచ్చు. 1500 కాల్స్వరకు ఉచిత టెలిఫోన్సౌకర్యం ఉంటుంది. నియమం 3బి(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులకు నెలకు రూ.14 వేల చొప్పున సుప్రీంకోర్టు చెల్లిస్తుంది. దీన్ని ఆదాయం కింద పరిగణించరు. ఈ మొత్తం
అప్పట్లో బాగానే అనిపించినా, ఇప్పుడది చాలా తక్కువ. ఈ మొత్తాలను రెట్టింపు చేసినా పదవిలో ఉన్నప్పటి అట్టహాసం వచ్చే అవకాశం లేదు. ఆ అట్టహాసం ఉండాలని అనుకోవడం కూడా సరికాదు.
గౌహతి హైకోర్టు తీర్మానం
సీజేఐగా రంజన్ గొగోయ్పదవీ విరమణ చేసిన తరువాత గౌహతి హైకోర్టు ఆయనకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను సమకూర్చింది. రిటైర్మెంట్తరువాత ఆయన గౌహతిలో నివసించే అవకాశం ఉందని భావించి, ఆయనకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించాలని18 మంది న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సమావేశంలో గౌహతి హైకోర్టు తీర్మానించింది. అదే రోజు ప్రొటోకాల్కమిటీ సమావేశంలో ఆ ప్రతిపాదనలను ఆమోదించింది. వాటి ప్రకారం జస్టిస్ గొగోయ్ఆయన భార్య, రోజువారి అవసరాలు చూసేందుకు ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సెక్రటరీని నియమించాలి. ఆ అధికారి అతనికి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంతోపాటు ఏదైనా ప్రొటోకాల్సంబంధిత అవసరాల కోసం రిజిస్ట్రీతో సమన్వయం చేయవచ్చు. జస్టిస్ గొగోయ్ గౌహతి నివాసంలో పనిచేయడానికి ఒక గ్రేడ్4 ప్యూన్, బంగ్లా ప్యూన్ ని హైకోర్టు అందుబాటులో ఉంచాలి. మంచి కండిషన్లో ఉన్న హైకోర్టుకు చెందిన పెద్ద వాహనాన్ని డ్రైవర్‌తోపాటు ఇంధన ప్రాతిపదికన జస్టిస్ గొగోయ్‌కు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంచాలి. ఆయన కోసం నియమించిన ప్రైవేటు సెక్రటరీతో సమన్వయం చేయడానికి హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నోడల్ అధికారిని గుర్తించి ఉంచాలి.
ఈ ప్రయోజనాలు కొత్తవేమీ కాదు
పదవీ విరమణ చేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కల్పించాలన్న ప్రతిపాదన కొత్తదేమీ కాదు. న్యాయ వ్యవస్థలో చాలా కాలం నుంచి ఉన్నదే. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు తమ దైనందిన జీవిత అవసరాలను తీర్చుకోవడంలో సాధారణ పౌరుడిలా బాధలు పడకూడదనే ఆలోచన నుంచి ఇది వచ్చింది. ఇది వివక్షకు సంబంధించిన అంశం కాదు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఒక ప్రత్యేక వర్గంగా న్యాయ వ్యవస్థ గుర్తిస్తుంది.
ఈ ప్రత్యేకమైన పద్ధతి వల్ల
న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలవుతుందని గౌహతి హైకోర్టు తన తీర్మానంలో భావించింది. పి. రామక్రిష్ణం రాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కూడా గౌహతి హైకోర్టు తన తీర్మానంలో ఉదహరించింది. ఆ తీర్పును ప్రశ్నించిన న్యాయమూర్తులు, జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ ముగ్గురు భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులే. గౌహతి హైకోర్టు ప్రతిపాదించిన ఈ ప్రయోజనాలను జస్టిస్ గొగోయ్స్వీకరించారో లేదో తెలియదు. ఆయనకు సంబంధం లేకుండానే ఈ ప్రతిపాదనను గౌహతి హైకోర్టు చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇలాంటివి ప్రతిపాదించడం సరైంది కాదని చాలా మంది భావన. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రతిపాదనలు చేసినా వాటిని స్వీకరించకపోవడమే ఆ న్యాయమూర్తికి శోభనిస్తుంది. మామూలుగా ఉండటమే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
- మంగారి రాజేందర్, విశ్రాంత జిల్లా జడ్జి