సమ్మిళిత  జల సంరక్షణ అవసరం

సమ్మిళిత  జల సంరక్షణ అవసరం

భారత్ వర్షధార వ్యవసాయ దేశం. వర్షపాతంలో అనిశ్చితి కారణంగా వర్షాకాలంలో భారీ తుపానులు, వరదలు వస్తుంటాయి. మిగతా కాలాల్లో కరువు ఉంటుంది. రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు విడుదల చేయడంతో ఈ విపరీతమైన సంఘటనలను కొంత తగ్గించుకుంటున్నాం.

నీటిపారుదల సౌకర్యం లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. ప్రపంచ జనాభాలోని 18 శాతం భారత దేశంలోనే ఉన్నారు. కానీ, నీటి వనరులు కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి. భూమి ఉపరితలం 70 శాతం నీటితో  కప్పబడినప్పటికీ, చాలామందికి ఈ విలువైన వనరును సేకరించడం ఇప్పటికీ  రోజువారీ పోరాటమే. 

1987లో జాతీయ నీటి విధానాన్ని  కేంద్ర  ప్రభుత్వం రూపొందించింది.  2002 లో,  2012లో సవరణలు చేశారు.  ప్రస్తుతం జాతీయ నీటి విధానం- 2012ను  అమలు చేస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఏకీకృత జాతీయ దృక్పథం, నీటి వనరుల నిర్వహణ, వినియోగం, అవగాహన పెంచడం,  నీటి వ్యవస్థను  ప్రతిపాదించడం.  

జాతీయ నీటి విధానం పరిధిలో చట్టాలు, వ్యవస్థలు, సంస్థలు, కార్యాచరణ  ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది.  ప్రస్తుత సవాళ్లను  పరిష్కరించడానికి జాతీయ నీటి విధానాన్ని  సవరించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. నివేదికను  కమిటీ ఇప్పటికే సిద్ధం చేసింది.

నీటి లభ్యత

జలశక్తి 2023-–24  వార్షిక నివేదిక ప్రకారం భారత్​లో 3,880 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటి లభ్యత ఉంది.  భౌగోళిక,  ఇతర  కారకాల  కారణంగా 1,139 బిలియన్ల  క్యూబిక్  మీటర్ల నీటిని మాత్రమే వాడుకోగలం. దీనిలో 690   బిలియన్ల క్యూబిక్ మీటర్ల  ఉపరితల జలాలు, 449 బిలియన్ల క్యూబిక్ మీటర్ల  తిరిగి నింపదగినవి భూగర్భ జలాలు.  ప్రస్తుతం 450 బిలియన్ల క్యూబిక్ మీటర్ల ఉపరితల నీరు,  241 బిలియన్ల క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలను మాత్రమే వినియోగిస్తున్నాం. 2050  నాటికి 1,180 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తామని అంచనా. 

ప్రతి రైతుకు నీటిపారుదల సౌకర్యం

ప్రధాన మంత్రి వ్యవసాయ నీటిపారుదల యోజనలో భాగంగా  ప్రతి రైతుకు  నీటిపారుదల సౌకర్యం కల్పించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ నీటి పథకాన్ని ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతుల భవిష్యత్తుకు తగినంత సామర్థ్యాన్ని ఇచ్చేలా భూగర్భ జలాల అభివృద్ధికి 2023 -– 24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.29.71 కోట్లు విడుదల చేసింది. అస్సాం, అరుణాచల్​ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 550 బావులను నిర్మించారు. 1309 మంది సన్నకారు రైతులు  ప్రయోజనం  పొందారు. 

నీటి సంరక్షణ

వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ అవసరం. వర్షపాతం లేదా నీటిపారుదల నీటిలో కొంత భాగాన్ని మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. మిగిలినవి లోతైన భూగర్భజలాలలోకి ప్రవేశిస్తాయి లేదా ఉపరితలం నుంచి బాష్పీభవనం ద్వారా పోతాయి. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా, బాష్పీభవనం వల్ల దాని నష్టాన్ని తగ్గించడం ద్వారా వ్యవసాయ నీటి డిమాండ్‌‌‌‌ను తగ్గించవచ్చు. భారతదేశ నీటి డిమాండ్ 2050 వరకు పెరుగుతుందని , అదే సమయంలో  మొత్తం జనాభా 160  కోట్లకు  చేరుతుందని అంచనా.

ప్రస్తుత నీటి వినియోగ స్థాయి కంటే 20 శాతం నుంచి 30 శాతం పెరుగుదల ఉంటుంది. పారిశ్రామిక,  దేశీయ రంగాలలో డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. నీటి కొరత పరిస్థితి రాబోయే కాలంలో మరింత తీవ్రమవుతుంది. భారతదేశంలో నీటి వనరులు తగ్గిపోతున్నందున నీటి సంరక్షణ తీవ్ర ఆందోళన కలిగించే విషయం. పెరుగుతున్న జనాభా పరిమాణానికి అనుగుణంగా పరిరక్షణ  ప్రయత్నాలను వేగవంతం చేయాలి. 

- డా. సునీల్ కుమార్ పోతన, జర్నలిస్ట్-