భూ సంస్కరణల అవసరం మళ్లీ ఉందా?

అర్బన్ ​ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడానికి, భూ వివాదాలకు, వాటి ద్వారా జరుగుతున్న దారుణాలకు, పర్యావరణానికి హాని జరగడానికి ప్రభుత్వాల భూ వినియోగ లోపాలె కారణంగా కన్పిస్తున్నాయి. పేదవారి వద్ద గుంట భూమి లేని దుస్థితి ఒకవైపు, ధనవంతులు, లీడర్లు ఇప్పటికీ కోట్ల రూపాయల విలువైన వందల ఎకరాలను కూడబెట్టుకుంటున్న పరిస్థితి మరోవైపు ఉంది.ఇప్పటికైనా ప్రభుత్వాలు సుస్థిరాభివృద్ధి దిశగా స్పష్టమైన భూమి వినియోగ విధానాలు రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేదంటే 1972లో చేపట్టినట్లుగా మరోసారి భూసంస్కరణలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 

హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత కళకు ప్రసిద్ధి చెందిన ఊరు. 1951 ఏప్రిల్​లో ఆచార్య వినోబా భావే ఈ ఊరిలోనే భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది తిరిగేసరికల్లా అది గ్రామ్ దాన్ ఉద్యమంగా మారింది. భూదాన్ ఉద్యమానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ ఉద్యమమే1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భూసంస్కరణలు చేపట్టేందుకు ప్రేరణగా నిలిచింది. దేశం ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య దినోత్సవం దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో భూదాన్, గ్రామ్ దాన్ ఉద్యమాలకు 70 ఏండ్లు అవుతున్నాయి. ఇందిరా గాంధీ తెచ్చిన భూసంస్కరణలను1972లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు అమలు చేశారు. ఆ భూ సంస్కరణలకు 50 ఏండ్లు పూర్తయ్యాయి.  

స్పష్టమైన వ్యూహం..

భూ సంస్కరణల కోసం అప్పటి ప్రధాని ఇందిర ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహాన్ని రూపొందించారు. దీని అమలు కోసం కాంగ్రెస్ పార్టీ, ఇందిర ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మధ్యేమార్గాన్ని అనుసరించాయి. సామాజిక అసమానతలను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న అసహనాన్ని నివారించడం, ఆహార భద్రత ఉండేలా చూడటం వంటి లక్ష్యాల సాధన కోసమే భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విజయవంతంగా ఈ లక్ష్యాల సాధనతో ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం మరింత బలపడేలా చేయగలిగారు. ఎలాంటి రక్తపాతం లేకుండా భూస్వాములు స్వచ్ఛందంగా భూములు దానం చేసిన అతిగొప్ప ఉద్యమం ఇది. హైదరాబాద్ స్టేట్ లో 1946 నుంచి 1951 మధ్య జరిగిన సాయుధ పోరాటంలో భూపంపిణీ కీలకంగా నిలిచింది. బలవంతంగా, సాయుధ పోరాటంతో సాధించలేని భూ సంస్కరణలను గాంధేయ పద్ధతుల్లో శాంతియుతంగానే భూస్వాములను ఒప్పించి సాధించగలిగారు. అయితే, ఆనాడు భూ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గనుక.. గ్రామీణ ప్రాంతాల్లో అల్లర్లకు దారి తీసే పరిస్థితి ఉందన్నమాట మాత్రం వాస్తవం. 

 ఇలా మొదలైంది..   

ఆచార్య వినోబా భావే మొదటగా పోచంపల్లిలోని హరిజన వాడను సందర్శించారు. అక్కడ నివసిస్తున్న 80 హరిజన కుటుంబాలు తమకు 40 ఎకరాల తరి, 40 ఎకరాల మెట్ట పొలం కావాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ఇతర మార్గం ఏమైనా ఉందా? అన్న ఆలోచన అప్పుడే మొదలైంది. దీంతో వినోబా భావేకు100 ఎకరాలు దానం చేసేందుకు స్థానిక భూస్వామి రామచంద్రా రెడ్డి ముందుకొచ్చారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్న పోచంపల్లిలో ఇలా ఆనాడు భూదానోద్యమానికి పునాదిరాయి పడింది. ఆ తర్వాత వినోబాభావే వెంటనే పాదయాత్ర చేపట్టారు. ఒక్కో రాష్ట్రం తిరుగుతూ దేశమంతా భూదానోద్యమాన్ని విస్తరించారు. ఒక్కో చోట ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తూ.. పేదలకు పంచుతూ వెళ్లారు. కమ్యూనిజానికి భూదానోద్యమం ప్రత్యామ్నాయంగా నిలిచింది. కమ్యూనిస్టుల పోరాటం మాదిరిగా బలవంతంగా భూములు లాక్కుని పంచాల్సిన అవసరం లేకపోయింది. వినోబా భావే చేపట్టిన సర్వోదయ కార్యక్రమంతో భూస్వాములు స్వచ్ఛందంగా భూములను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో కౌలు రైతులు, వ్యవసాయ కూలీల వంటివారిని సమాజంలో అట్టడుగునే వదిలేయకుండా అభివృద్ధి దిశగా నడిపేందుకు ఈ ఉద్యమం తోడ్పడింది. స్వాతంత్ర్యానికి పూర్వమే కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణలను తన రాజకీయ ఎజెండాలో చేర్చింది. 1938లో అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్.. నేషనల్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా పండిట్ జవహర్ లాల్ నెహ్రూను నియమించారు. పార్టీ వెంటనే దృష్టిపెట్టాల్సిన అంశాల్లో భూ సంస్కరణలు చాలా ముఖ్యమైనవని ఆ కమిటీ గుర్తించింది. స్వాతంత్ర్యం తర్వాత 1952లో ప్రధాన మంత్రి ఎక్స్అఫీషియో చైర్మన్ గా, కేబినెట్ హోదాతో ఒక డిప్యూటీ చైర్మన్ ఉండేలా ప్రణాళికా సంఘం ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది. దీంతోపాటు కౌలు రైతుల రక్షణ కోసం హైదరాబాద్ రాష్ట్ర కౌలు రైతుల రక్షణ చట్టం, 1950 కూడా భూసంస్కరణల్లో కీలకమైన మైలురాయిగా నిలిచింది.

సీఎంలతో ఇందిర కాన్ఫరెన్స్ 

ఇందిరా గాంధీ 1969లో భూ సంస్కరణలపై ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టాలకు ఏకాభిప్రాయం పొందడం, అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాలను అమలు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 1970, సెప్టెంబర్ 26న ‘ల్యాండ్ రిఫామ్స్, ఫుడ్ పాలసీ’ పేరుతో జరిగిన ఈ సమావేశంలో ఇందిరా మాట్లాడారు. భూసంస్కరణలు జాతీయ ప్రాముఖ్యత ఉన్న అత్యవసర విషయం ఎందుకైందో ఆమె ముఖ్యమంత్రులకు తెలియజెప్పారు. ‘‘భూసంస్కరణలు అత్యంత కీలకమైన పరీక్ష. మన రాజకీయ వ్యవస్థ మనుగడ సాగించాలంటే ఇందులో తప్పనిసరిగా పాస్ కావాలి. దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకూ ఈ సంస్కరణలు తప్పనిసరి. 1971 నాటికి అన్ని సబ్సిడీ ఆహార దిగుమతులను ఆపివేయాలని మనం1967లోనే తీర్మానం చేసుకున్నాం. అందుకే ఈ దిశగా మీరంతా అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నా. భూసంస్కరణలు, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల మీ సహకారంతోనే సాధ్యం. ఇందుకోసం అత్యంత వేగంగా సంస్కరణలు అమలు చేయాలి. ఎక్కువ మంది రైతులు కొత్త టెక్నాలజీ పద్ధతులను వాడుతూ పంటలు పండించాలి. ఇలా జరిగితేనే దేశ ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఎలాంటి ఢోకా ఉండదు” అని ఇందిర వివరించారు.  అంతర్జాతీయ దృష్టికోణంలో చూస్తే భూసంస్కరణలను మించిన విప్లవాత్మక సంస్కరణలు ఏవీ లేవని కూడా ఇందిరా గాంధీ చెప్పారు. జపాన్ లో పారిశ్రామిక ప్రగతి వెనుక భూసంస్కరణలదే కీలక పాత్రని వెల్లడించారు. ఇరాన్ లో షాహెన్షా చేపట్టిన భూసంస్కరణల వల్లే దేశం పురోభివృద్ధిని సాధించిందని తెలిపారు. 

సమానత్వ వ్యవస్థను సృష్టించేందుకు..

భూసంస్కరణలను లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా వ్యవసాయంలో తెచ్చిన ఒక కొత్త డీల్ గా ఇందిరా గాంధీ భావించారు. సంస్కరణలు తెచ్చినంత మాత్రాన పని ముగిసినట్లు కాదని, ఇంకా సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. పుస్తకాల్లో రాసే సోషలిజాన్ని లేదా సిద్ధాంతపరమైన సమతావాదాన్ని ఆమె నమ్మలేదు. దేశంలో నక్సలిజం పురుడుపోసుకున్న తొలినాళ్లలో 1967లోనే.. ఇందిరా గాంధీ రాబోయే రోజులను ఊహించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అసహనం పెరుగుతోందని, అది అలాగే పెరిగితే దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మడం ఖాయమని భావించారు. అందుకే ముఖ్యమంత్రులు చాలా పెద్ద లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘గ్రామీణ పేదల సమానత్వం కోసం మనం ఇంకా ఒక సమానత్వ వ్యవస్థను సృష్టించాల్సి ఉంది. ధనిక వర్గాలకు కాకుండా పేదలకు మాత్రమే అందేలా మనం ఇంకా క్రెడిట్, ఇన్ పుట్ లను పంపిణీ చేయాల్సి ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే.. చిన్న రైతులు, కౌలు రైతులు, కూలీలను అగ్రికల్చరల్ న్యూ డీల్ లో మనం ఇంకా భాగస్వాములను చేయాల్సి ఉంది” అని ముఖ్యమంత్రులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. 

ఏపీలో చట్టం తెచ్చిన పీవీ

భూసంస్కరణలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఏ కార్యక్రమం కూడా భూసంస్కరణలకు మించి లక్షలాది మంది ప్రజలకు మేలును కలిగించలేదని ఇందిరా గాంధీ గుర్తించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చగలిగే శక్తి, భావి తరాల భవిష్యత్తుకు బాటలు పర్చే శక్తి వీటికే ఉందన్నారు. అందుకే భూసంస్కరణలు విజయవంతం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. ఇక ఇందిర తెచ్చిన భూసంస్కరణల మేరకు.. 1972లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు చరిత్రాత్మకమైన ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారు. ఇది 1973లో ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని ఒడిశా అప్పటి ముఖ్యమంత్రి నందిని సత్పతి కూడా వారి రాష్ట్రంలో అమలు చేశారు. అప్పటి ఏపీ రెవెన్యూ మంత్రి పి. నర్సా రెడ్డి కూడా భూసంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించారు. భూములపై వచ్చే తగాదాలు(లిటిగేషన్ లు) భూసంస్కరణలకు ప్రధాన అడ్డంకిగా మారతాయని ఇందిరా గాంధీ ముందే ఊహించారు. లిటిగేషన్ ల కారణంగా సంస్కరణలకు అడ్డుకట్ట పడకూడదని ఆమె ఆలోచించారు. అలాగే సివిల్ కోర్టులపై భూ తగాదాల భారాన్ని మోపకుండా ప్రత్యేకంగా జ్యూరిస్ డిక్షన్ ఉండేలా ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. భూసంస్కరణ చట్టాల వల్ల తలెత్తే లిటిగేషన్లను పరిష్కరించే బాధ్యతలను ఈ ట్రిబ్యునళ్లకు అప్పగించారు. 

- పర్సా వెంకట్, 
పొలిటికల్ ​ఎనలిస్ట్