జ్ఞానవాపి మందిరమే అనేందుకు ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి?  

అన్నం ఉడికిందా.. లేదా?  అని తెలుసుకునేందుకు ఒక మెతుకు పట్టి చూస్తే సరిపోతుంది! కానీ ఒక మెతుకు కాదు కదా.. మొత్తం కుండలోని ప్రతి మెతుకును పిసికి చూస్తున్నారు. అయినా అన్నం ఉడికింది అని చెప్పేందుకు నోరు రావడం లేదు. అంతకుమించి  ధైర్యం చాలడం లేదు.!! వారణాసిలోని జ్ఞాన వాపి మందిరం విషయంలో కూడా ఇదే తరహా సర్వే సాగింది. మొదట శివలింగం బయటపడింది. ఆ ఒక్క ఆధారంతో అది గుడి అని నిర్ధారణ అయింది. కానీ.. ప్రతివాదులు ఒప్పుకోలేదు. దీంతో మరుసటి  రెండు రోజులపాటు చేసిన సర్వేలో శివుడి అభిముఖం వైపు చూస్తున్న నందీశ్వరుడు, శృంగార దేవి, వినాయకుడు, హనుమంతుడు, హిందూ సంప్రదాయం పోలి ఉన్న కట్టడాలు వెలుగుచూశాయి. ఆ తర్వాత పలు దేవతా విగ్రహాలు.. రాతితో చెక్కిన కమలం పువ్వులు, రాతితో రూపొందించిన శేషనాగు శిల్పం, శివుడి త్రిశూలం, డమరుకం, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలను కూడా సర్వే బృందం గుర్తించింది. కలశం, నగిషీలు, స్తంభాలపై చెక్కిన పురాతన హిందీ అక్షరాల ఆనవాళ్లు సాక్షాత్కరించాయి.
 

స్పష్టమైన ఆధారాలు దొరికినా..
మసీదులో పురాతన ఆలయ శిథిలాలు.. అందులో దేవతామూర్తుల విగ్రహాలు, కమలం ఆకృతులు, మధ్యలో శేషనాగు, నాగఫణి శిల్పాలు దర్శనమిచ్చాయి. హిందువుల పవిత్ర జీవన విధానమైన దీపారాధనకు సంబంధించి గుర్తులు కూడా మసీదులో సర్వే అధికారులు కనుగొన్నారు. మసీదు వెనక పడమటి గోడపై కళాత్మక నమూనాలు, రాతి పలకలు దర్శనమిస్తున్నాయి. కానీ.. మసీదు అనేందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా అక్కడ లేకపోవడం గమనార్హం! మసీదు వెనుక గోడ నుంచి రెండు పెద్ద స్తంభాలు, ఒక స్వాగత ఆర్చి పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అవి పరిపూర్ణంగా ఆలయ అవశేషాలే తప్ప మరోదానికి ఆస్కారం లేదు. మసీదు కట్టడాలలో ఇలాంటి ఆకృతులకు సంబంధమే లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు మసీదు మధ్య గుమ్మటం కింద శంఖం ఆకారపు నిర్మాణం.. శేషనాగు పడగ ప్రతిమ కూడా స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ శిథిలాలుగా పగిలి ఉన్న రాళ్లు.. వాటి ఆనవాళ్లు పరిశీలిస్తే, వాటి వయసు కూడా దాదాపు 500 నుంచి 600 సంవత్సరాలు ఉంటుందనే విషయం తెలిసిపోతుంది. ఇంతటి ఆధారాలు సహా అవశేషాలు లభించినా కూడా "అంజుమన్ ఇంతే జామియా" అనే మసీదు కమిటీ అడ్డంగా వాదించడంలో అర్థం లేదు. వాస్తవాలను అంగీకరించి, మందిరాన్ని హిందువులకు అప్పగిస్తే గౌరవం.. మర్యాద లభిస్తుంది. లేదంటే నేటి ఆధునిక యుగంలో స్పష్టమైన ఆధారాలు, వాటి ఆనవాళ్లు కాదని మాట్లాడితే నవ్వుల పాలు కావాల్సిందే.. తప్ప ఫలితం ఉండదు. 
 

వెలుగులోకి వస్తుంటే ఒవైసీకి ఉలుకెందుకు..?
ప్రఖ్యాత జ్ఞానవాపి మందిరం విషయంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీరు అభ్యంతరకరంగా ఉంది. ఇన్నాళ్లు మసీదుగా మార్చుకొని ఉన్న ప్రదేశంలో శివలింగంతో పాటు మిగతా నంది, హిందూ కట్టడాలు బయటపడటం జీర్ణించుకోలేక ఒవైసీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తిని అంటూనే.. కోర్టు తీర్పులను తప్పు పడుతూ వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నాకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది.. కాబట్టి నేను మాట్లాడుతా’’ అంటూ కోర్టు తీర్పుపై విమర్శ చేయడం సరికాదు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మందిరం కాంప్లెక్స్ లో గల బావిలో పవిత్రమైన శివలింగం బయటపడింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా అది వెలుగులోకి వచ్చింది. ఈ శుభ పరిణామం పట్ల హిందూ సమాజం హర్షించింది. మరీ ముఖ్యంగా శివలింగం బయటపడిన ప్రాంతాన్ని, బావిని సీల్ చేసి.. అక్కడకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్ పీఎఫ్ కమాండోలను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు కూడా. అయోధ్యలోని బాబ్రీ మసీదు లాగా జ్ఞానవాపి మసీదును కానివ్వబోమని  అసదుద్దీన్ వ్యాఖ్యానించడం ఆక్షేపణీయం. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేస్తున్నా.. చట్టాన్ని ఉల్లంఘించి సర్వే చేస్తున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసి, హిందూ దేవాలయాలు, భూములు, ఆస్తులు కోల్పోయేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 1991 చట్టంలోని సెక్షన్4(2)ను వెంటనే సవరించి హిందూ దేవాలయాలను, ఆస్తులను మొత్తంగా హిందూ అస్తిత్వాన్ని కాపాడాలి. 

బాబ్రీ మసీదును లాక్కోలేదు.. 
ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని అయోధ్య బాబ్రీ మసీదు లాక్కున్నాయని.. వాటి తరహాలోనే జ్ఞానవాపి మసీదును లాక్కునేందుకు కుట్ర చేస్తున్నాయని ఒవైసీ ఆరోపించడం కూడా ఆయనలో వివేకం లోపించిందనడానికి నిదర్శనం. వాస్తవానికి అయోధ్యలో రామజన్మభూమి కోసం వందల సంవత్సరాల పోరాటం జరిగింది. ఎందరో హిందువులు ప్రాణత్యాగం చేసి, చివరకు న్యాయబద్ధంగా రామ జన్మభూమిని సొంతం చేసుకున్న విషయం ఒవైసీ తెలుసుకోవాలి. ఇదంతా మన కండ్ల ముందరి చరిత్ర. జ్ఞానవాపి విషయం ఇంకా కోర్టులో ఉండగానే కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా, అసహనం వెళ్లగక్కడం ఒవైసీ డొల్లతనానికి  నిదర్శనం. ముమ్మాటికీ జ్ఞాన వాపి మందిరమే. న్యాయబద్ధంగా పోరాడి మందిరాన్ని  సాధించుకు తీరుతాం. మొగలుల పాలనలో ధ్వంసమైన దేవాలయాల గురించి మాత్రమే మా పోరాటం. మొగలులు నిర్మించుకున్న మసీదులు మాకు అక్కరలేదు. లక్షల కొద్దీ దేవాలయాలు దాడులకు గురయ్యాయి, ధ్వంసమయ్యాయి, దోపిడీ జరిగింది. మెజారిటీగా ప్రతి మసీదు కింద ఓ దేవాలయం ఉంది. ఇది చరిత్ర చెప్పే సత్యం. పురావస్తు శాఖ చెప్పే సాక్ష్యం. 
                                                                                                                                  - పగుడాకుల బాలస్వామి ప్రచార సహ ప్రముఖ్, (రాష్ట్ర అధికార ప్రతినిధి), వీహెచ్ పీ, తెలంగాణ