సంస్కృతి సమాజ ధోరణికి అద్దం పడుతుంది. సమాజం కొనసాగడానికి సంస్కృతి ఒక వాహకం. అయితే వర్తమానంలో ఒక కొత్త రకం సంస్కృతి రూపుదిద్దుకుంటున్నది. అపార్ట్మెంట్లు ఈ మధ్య సర్వసాధారణం అయిపోయినాయి. చిన్న పట్టణాలు, కొన్ని పల్లెలలో కూడా అపార్ట్మెంట్లు కనపడుతున్నాయి. ఖాళీ ప్రదేశంతో కూడిన సొంత ఇల్లు ఒకప్పటి సాధారణ కల. ఇప్పటికీ ఆ కల చాలామందిలో ఉన్నా నెరవేరడం కష్టసాధ్యంగా మారింది. అపార్ట్మెంట్లు పెరగడానికి కారణం పెరుగుతున్న భూమి ధరలు. 200 లేదా 300 గజాల భూమిలో 10 నుంచి 15 కుటుంబాలు నివసించడం సుపరిణామం కావచ్చు. అయితే ఈ రకమైన నివాసాల వల్ల సమాజం మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది?. వ్యక్తుల నడవడిక సమాహారమే సమాజ సంస్కృతి. కాకపోతే సంస్కృతి పదం చాలా లోతైనది కనుక మారుతున్న సమాజం పోకడలు అంటే మంచిదేమో. అనేక అపార్ట్‌మెంట్లులో కలిసి మెలిసి ఉంటున్న కుటుంబాలు ఉన్నాయి. కొట్లాటలు, కార్పణ్యాలు, పోలీసు కేసులు, కోర్టులలో వ్యాజ్యాలు వగైరా కూడా ప్రస్ఫుటిస్తున్నాయి. అనేక రకాల వ్యక్తుల, వ్యక్తిత్వాల సమాహారం అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ‘సమాజ’ వాతావరణం ఉంటుంది.
1950లలో డేవిడ్ రీస్మన్, ర్యూయెల్ డెన్నీ, నాథన్ గ్లేజర్ కలిసి రచించిన "ది లోన్లీ క్రౌడ్: ఎ స్టడీ ఆఫ్ ది ఛేంజింగ్ అమెరికన్ క్యారెక్టర్" అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ పుస్తకం ఉద్దేశ్యం ప్రధానంగా అమెరికన్ జీవితాన్ని విశ్లేషించడం వరకే దాని లోపాలను సూచించడం కాదు అని చెప్పారు కూడా. అయితే అప్పటి అమెరికన్ సమాజంలో మార్పులకు అది చాలా చక్కగా అద్దం పట్టింది. భారతదేశంలో ఈ తరహా రచనలు అరుదు. భారతదేశంలో అపార్ట్మెంట్ జీవనం మీద కూడా విశ్లేషణలు అవసరం. భారత్ వంటి సంప్రదాయ దేశంలో అపార్ట్మెంట్ నివాసాలు పెరగడానికి ప్రధానంగా భూమి ధరలు కారణం. తక్కువ ధరకు నివాసం, భద్రత కారణంగా ఎక్కువమంది ప్రజలు ఫ్లాట్లలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో, కుల దురహంకారం బారిన పడినవారు, ఇంకా అనేక సమాజ రుగ్మతల బాధితులు అపార్ట్ మెంట్లో ఉండడం మంచిదని భావిస్తున్నారు. పట్టణాలలో, అపార్ట్మెంట్లలో ఒకరికొకరు సంబంధం లేకుండా జీవించే వాతావరణంలో, ‘అనామకత్వాన్ని’ కోరుకునేవారికి అపార్ట్మెంట్ తరహా నివాసం స్వర్గధామంగా కనిపిస్తున్నది.
కుల, మతాలవారీగా అపార్ట్మెంట్లు
కొత్తగా కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా కూడా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. తమ వారి మధ్య ఉంటే సౌఖ్యంగా ఉంటుంది అని భావించేవారు ఉన్నారు. చిన్న అపార్ట్మెంట్లలో అందరూ ఉండడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే కొన్ని నగరాలలో కొన్ని మతాలవారికి, కులాల వారికి, ఒంటరి యువతీ, యువకులకు ఫ్లాట్ కిరాయికి ఇవ్వడం లేదు అని వార్తలు చూస్తున్నాం. ఒంటరి వ్యక్తులకు ఇవ్వడం కొన్ని అపార్ట్మెంట్ సంఘాలు ఒప్పుకోవడం లేదు. ఎవరికి అద్దెకు ఇవ్వాలి అనేది ఆ సంఘాలు నిర్ణయిస్తున్నాయి. శాసిస్తున్నాయి. చిన్న అపార్ట్మెంట్లలో ఒక రకం సమస్యలు ఉంటే, మధ్య తరహా వాటిలో ఆ మేరకు ఎవరికీ పట్టని సమస్యలు ఉన్నాయి. ఇంకా పెద్దవి అయితే పూర్తిగా ‘నిర్వహణ సంస్థ’ ఆధ్వర్యంలో నివసించాల్సి వస్తుంది. నెలవారీ నిర్వహణ ఖర్చు చాలాఎక్కువ. అపార్ట్మెంట్ భవనం ఆవిర్భావాన్ని చూసిన మొదటి భారతీయ నగరం బొంబాయి. దశాబ్దాల అనుభవం దృష్ట్యా ఇక్కడి అపార్ట్మెంట్లు రకరకాలుగా కడుతున్నారు. ఆధునికతను స్వీకరించడానికి, విస్తరణకు, రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి బహుళ- అంతస్తుల భవనాలు సహాయపడ్డాయి. అపార్ట్మెంట్ ఒక నివాస తరహాగా (హౌసింగ్ టైపోలాజీగా) సామాజిక మార్పుకు సూచికగా రూపొందింది.
ఆందోళనకరమైన పరిస్థితి
ఆధునిక సమాజంలో కొంత దిగజారుతున్న, ఆందోళనకరమైన పరిస్థితి ఈ అపార్ట్మెంట్ జీవనంలో కనపడుతున్నది. హైదరాబాదులో ఒక అతి పెద్ద అపార్ట్మెంట్ సముదాయంలో ఒక మహిళ శవం 3 రోజులుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటే ‘నిర్లక్ష్యం’ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అపార్ట్మెంట్లు పెరుగుతున్నా, ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నా ఈ తరహా జీవనంలో వచ్చే సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టి లేదు. ఏ ఒక్క శాఖ పరిధిలోకి ఈ విషయాలు రావు. దీంతో కొందరు వ్యక్తులు పేట్రేగిపోతున్నారని అపార్ట్మెంట్ వాసులు బాధపడుతున్నారు. ఆ మధ్య బెంగళూరులో ఒక వ్యక్తి తన ఫ్లాట్లో పిల్లర్ అడ్డం వస్తుందని కూలగొట్టిస్తే మొత్తం అపార్ట్మెంట్ కూలిపోయింది.
అపార్ట్మెంట్ ఫ్లాట్ గమ్మత్తయిన ఆస్తి
అపార్ట్మెంటులో ఒక ఫ్లాట్ ఒక ఆస్తి. కాకపోతే గమ్మత్తైన ఆస్తి. అపార్ట్మెంట్ ఉన్న భూమి విస్తీర్ణం మాత్రమే విభజించని వాటాగా నమోదు చేస్తారు. ఈ భూమిని విభజించి అమ్ముకునే వీలులేదు. నిర్మాణానికే విలువ. ఇప్పటికీ భూమికి ‘టైటిల్’ హక్కు లేని సందర్భంలో ఆ భూమి మీద కట్టిన నిర్మాణానికి ‘టైటిల్’ హక్కు ఉండదు. ప్రభుత్వం భూమి క్రయ విక్రయాలు మాత్రమే నమోదు చేస్తుంది. ఫ్లాట్ పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే బ్యాంకులు అప్పు ఇవ్వడంతో ఈ చట్టం లొసుగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతి అపార్ట్ మెంట్‌కు ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఉండాలని భావిస్తున్నా ప్రత్యేక చట్టం లేదు. స్వచ్ఛంద సంస్థలను నమోదు చేసుకునే చట్టం వీటికి వర్తిస్తుంది. అపార్ట్మెంట్లలో వచ్చే సమస్యలకు ఈ సొసైటీ తరహా వ్యవస్థలో ‘సమాధానాలు’ దొరకవు. అపార్ట్మెంట్ వాసుల కష్టాలకు, పరిస్థితికి, ఈ సొసైటీ చట్టం ఉపయోగపడదు. పైగా సంక్లిష్టం అవుతున్నది. అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ఒక ప్రత్యేక చట్టం ఆవశ్యకత ఉంది.
పర్యావరణ అనుకూల పద్ధతులు పాటించాలి
డిజిటల్ లోకం సృష్టించుకుని మురిసిపోయే ఆధునిక సముదాయాలలో ‘కమ్యూనికేషన్’ వ్యవస్థ గందరగోళంగా ఉంటుంది. క్రైం రేటు పెరుగుతున్న కాలంలో ఎవరు ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరు. రక్షణ కోసం ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సి వస్తున్నది. కొనుక్కునేటప్పుడు ప్రకటించే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకు క్రమంగా అన్ని సేవలకు రోజువారీ ఖర్చు ఉంటుంది. పెద్ద సముదాయంలో ‘సొంత’ ఫ్లాట్ ఉన్నా, అన్నింటికీ రుసుములు కట్టటం ఒక విధంగా ‘టాక్స్’ కట్టినట్టే. సగటు ఇంటికంటే ఒక ఫ్లాట్ నుంచి వచ్చే నిరర్ధక వ్యర్థాలు ఎక్కువ. పెద్ద అపార్ట్మెంట్ సముదాయాలు తామే మురికినీటిని శుద్ధిచేసి తిరిగి వాడుకోవచ్చు. సౌర విద్యుత్ వాడుకోవచ్చు. తడి చెత్తగా భావించే ఘన వ్యర్థాలను ఎరువుగా మార్చుకోవచ్చు. వాన నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుకూల పద్ధతులు పాటిస్తే ఆ తరువాత ఏర్పాట్లకు ఖర్చు తగ్గుతుంది. ‘ఆధునికత’ను సంబరంగా అందిపుచ్చుకునేవారు పర్యావరణ- అనుకూల నివాసాలు ఆ కోవలోకి వస్తాయని గుర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
చట్టబద్ధత కల్పించాలి
మన దేశంలో పట్టణాలలో ఉండే దాదాపు 50 కోట్ల జనాభాలో 25 కోట్ల అపార్ట్మెంట్వాసులని లెక్క వేసుకున్నా, సమస్య ఎంత పెద్దదో మనకు అర్థం అవుతుంది. ప్రతి అపార్ట్మెంట్ ఒక ఉమ్మడి ఆస్తి. ఒక వ్యాపార వస్తువు ఉమ్మడి ఆస్తిగా బహుశా ఇంకొక ఉదాహరణ లేదేమో. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ఇది ప్రధాన కారణం. ఇక్కడ సాధ్యమైన ‘ఉమ్మడి’ ఆస్తి వేరే సందర్భాలలో సాధ్యం పడదు. ఈ విభజించలేని ఉమ్మడి ఆస్తిలో సౌకర్యాలు కూడా విడదీయలేని పరిస్థితులలో వాడుకుంటారు అపార్ట్‌మెంట్‌వాసులు. ప్రధానంగా నీళ్లు, కామన్ ఏరియా, మెట్లు, లిఫ్ట్ వగైరాలు అందరికి అందుబాటులో ఉంటాయి. విద్యుత్, నీటి సరఫరా సామాన్యంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఉండవు. ఈ సేవలకు చార్జీలు కట్టాలి. కొందరు కట్టరు. అయినా వారికి ఆ సేవలు ఆపే సౌకర్యం ఉండదు. నిర్దేశించే చట్టం కూడా ఏమీ లేదు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టంలో ‘దారి’ లేదు. ఇక వందల ఫ్లాట్లు ఉన్న పెద్ద అపార్ట్మెంట్ సముదాయంలో పరిస్థితి ఇంకా ఘోరం. పారిశ్రామిక ప్రాంతాలకు ఐల (IALA) ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ సముదాయాలకు ‘చట్టబద్ధ’ వ్యవస్థ కల్పించకపోవడం శోచనీయం.
డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్