
పటాన్చెరు, వెలుగు: సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్నేత నీలం మధు ఆరోపించారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కార్ ఈడీని అడ్డుపెట్టుకొని సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
నేషనల్ హెరాల్డ్ విషయంలో ఇద్దరి పేర్లను చార్జిషీట్లో చేర్చడాన్ని wఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.