![కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం : నీలం మధు ముదిరాజ్](https://static.v6velugu.com/uploads/2025/02/neelam-madhu-mudiraj-said-social-justice-is-possible-only-with-congr_JpnC0mhHjv.jpg)
హైదరాబాద్ సిటీ, వెలుగు: సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుత పాలన కొనసాగుతోందన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తూనే ఎస్సీ వర్గీకరణకు చొరవ చూపించారన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఎందుకంత కడుపు మంటని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం జరుగుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నేతలు తమ వివరాలు ఇవ్వకపోవడం బీసీలను అవమానించడమేనన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలపై బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు.