- ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లే!
- వైరస్‌తో చాలా చోట్ల మాడిపోయిన చెట్లు
- ఎండిన చెట్ల నుంచి పువ్వు తెంపేందుకు జనం జంకు
కరీంనగర్, వెలుగు: ఉగాది నాటికి ఆకురాలి కొత్త చిగుళ్లు వేయడంతోపాటు పూత పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉగాది వచ్చిందంటే ఇంటి ఆవరణలోనో, ఇంటికి ఆ పక్కో, ఈ పక్కో దొరికిన వేప పువ్వు కోసం.. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తోంది. పాలమూరు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగేండ్ల క్రితం వేప చెట్లపై కనిపించిన వైరస్ ప్రభావం క్రమంగా పల్లెలకు విస్తరించింది. రాష్ట్రంలోని ప్రతి 10 వేప చెట్లలో 8 వైరస్ ప్రభావంతో మాడిపోయాయి. కొన్ని చెట్లు సగం ఎండిపోయి.. సగం ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్న చెట్లు ఎక్కడో ఒకటి, రెండే కనిపిస్తున్నాయి. వాటికి కూడా చిటారు కొమ్మల్లో పువ్వు ఉంటోంది. పట్టణాలు, సిటీల్లో కాంక్రీట్ నిర్మాణాల కారణంగా వేపచెట్లు క్రమంగా మాయమవుతున్నాయి. తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ లో కూడా వేప మొక్కల పెంపకాన్ని పట్టించుకోకపోవడం ఇప్పుడు వేప పువ్వు కొరతకు కారణమవుతోంది.
ఎండు తెగులు కారణంగానే..
గతంలో జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ డిపార్ట్ మెంట్, జయశంకర్ అగ్రి వర్సిటీ సైంటిస్టులు ఈ వైరస్‌పై పరిశోధన చేసి తేమ వల్ల శిలీంధ్రాలు గాలి, వర్షాలతో చెట్లపైకి వ్యాపించి ఎండు తెగులు పెరిగేందుకు కారణమైతున్నట్లు తేల్చారు. ఫామోస్ఫిస్ అజాడిరక్టే, ఫ్యూసారియమ్ అనే శిలీంధ్రాలు వేప చెట్లను నాశనం చేస్తున్నాయని, ఈ శిలీంధ్రాల ప్రభావం ఎక్కువగా ఉంటే చెట్ల కొమ్మలే కాదు.. మొత్తం చెట్టే చనిపోతుందని వెల్లడించారు. శిలీంధ్రాలను కంట్రోల్ చేయడానికి లీటర్ నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ లేదా మ్యాంకోజెబ్, కార్బండిజమ్ మిశ్రమం 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై చల్లాలని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ వేప చెట్లను రక్షించేందుకు ప్రభుత్వం వైపు నుంచి గానీ, ప్రజల వైపు నుంచి గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో వైరస్ బారిన పడుతున్న చెట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది.
పచ్చడిలో వేసుకోవాలా ? వద్దా ?
తెలుగు సంవత్సరాది రోజు షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగు ప్రజల ఆచారం. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేయడం ఆనవాయితీ. పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి పిందెలు, తీపి కోసం బెల్లం, చేదు రుచి వచ్చేందుకు వేప పువ్వును వాడుతారు. తెగుళ్ల బారినపడి చెట్లు ఎండిపోతుండడంతో వేప పూతను పచ్చడిలో కలుపుకోవాలా వద్దా అనే విషయంలో జనం వెనకాడుతున్నారు. అయితే ఉగాది పచ్చడిలో వేప పూతను కలిపి తినొచ్చని, ఇబ్బందేమి లేదని సైంటిస్టులు చెప్తున్నారు.
హరితహారంలో నాటట్లే
తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ కింద ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఏపుగా ఎదిగి గాలి, నీడ అందించే వేప చెట్ల సంరక్షణను మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. హరితహారంలోనూ వేప మొక్కలను పెద్దగా నాటడం లేదు. రెండు, మూడేండ్లలో ఎక్కువగా గన్నేరు, మందారం, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ మొక్కలు నాటారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉండేందుకు కోనో కార్పస్ లాంటి హానికరమైన మొక్కలను లక్షలాదిగా పెంచారు. వీటితో పోలిస్తే హరితహారంలో నాటిన వేప మొక్కల సంఖ్య చాలా తక్కువని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఫామోస్ఫిస్ అజాడిరక్టే, ఫ్యూసారియమ్ అనే శిలీంధ్రాల వల్ల వేప చెట్లు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తెగుళ్లు వచ్చినప్పుడు చెట్లను సంరక్షించేందుకు జిల్లాకో బోటనిస్టును నియమించాలి.
- డాక్టర్ పెంచాల శ్రీనివాస్, బోటనీ లెక్చరర్