టూరిజం నుంచి బీసీ శాఖకు నీరా కేఫ్ బదిలీ

టూరిజం నుంచి బీసీ శాఖకు నీరా కేఫ్ బదిలీ
  • ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి

హైదరాబాద్, వెలుగు:  టూరిజం శాఖ పరిధిలో ఉన్న  నీరా కేఫ్  బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది.   నీరాకేఫ్ భవనం పరిధిలో ఉన్న ఆస్తులను తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ చేస్తూ బుధవారం సెక్రటేరియెట్ లో ఇరు శాఖల మంత్రులు పొన్నం, జూపల్లి  ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి ముదిరాజ్, విజయరమణ రావు పాల్గొన్నారు.  

కేఫ్ ను టూరిజం నుంచి బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేయాలని పలు సార్లు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావుతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. తాజా నిర్ణయంతో ఇప్పటి దాకా టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరాకేఫ్ ఇక నుంచి కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నడవనుంది . త్వరలో బదిలీ ఉత్తర్వులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అధికారిక ఉత్తర్వులు వచ్చాక కేఫ్ నిర్వహణ, బడ్జెట్ ఇతర గైడ్ లైన్స్ రానున్నాయి. 

నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ ను బీసీ సంక్షేమ శాఖలోని టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్  రూ. 12.5 కోట్లతో నిర్మించగా టూరిజం డిపార్ట్ మెంట్ నిర్వహణలో ఉంది. కార్పొరేషన్ కు బదిలీ అయ్యాక గీత కార్మికులకు నీరా, తాటి బెల్లం విక్రయించేలా అవకాశం ఇస్తామని అధికారులు అంటున్నారు. కల్లు గీతా కార్మికులకు అండగా ఉంటానని, ఎలాంటి ఆందోళన వద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.