
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిర్వహిస్తున్న క్లాసిక్ ఈవెంట్ వేదిక పంచకుల నుంచి బెంగళూరుకు మారింది. పంచకులలో తగినంత వెలుతురు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని నీరజ్ సోమవారం వెల్లడించాడు. మే 24న జరిగే ఈ టోర్నీలో వరల్డ్ స్టార్లు అండర్సన్ పీటర్స్, థామస్ రోహ్లెర్ బరిలోకి దిగుతుండటంతో స్టేడియం నిండిపోనుంది.
పాకిస్తాన్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్‌ను కూడా ఈ పోటీకి ఆహ్వానించానని నీరజ్ తెలిపాడు. అయితే అతను పోటీలకు వచ్చే అంశంపై క్లారిటీ లేదన్నాడు. ఈ పోటీలకు వరల్డ్ అథ్లెటిక్స్ ఏ–స్టేటస్ కేటగిరీని కేటాయించింది. ‘పంచకులలోనే టోర్నీ జరగాలని కోరుకున్నా. కానీ వెలుతురుకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల వేదికను మార్చాల్సి వచ్చింది. వరల్డ్ అథ్లెటిక్స్ రూల్స్ ప్రకారం వెలుతురు 600 లూమెన్స్ ఉండాలి. పంచకులలో లేదు. అందుకే బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి మార్చాం’ అని నీరజ్ పేర్కొన్నాడు.